Teacher Postings: 1,382 మందికి త్వరలో టీచర్ పోస్టింగ్.. ఈ కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టీకరణ!

అంతకుముందు వారిని టీచర్లుగా నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున అది ముగిసిన వెంటనే పోస్టింగ్‌లు ఇస్తామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అయితే ఈ నియామకాల కు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని, వెంటనే నియామకాలు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఈ నియామకాలకు ఏడాది క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఇవి కొత్తగా ఇస్తున్నవి కాదని పేర్కొంది. వెంటనే నియామకాలు చేపట్టి సంబంధిత వివరాలను ఫిబ్రవరి 10న తమ ముందుంచాలని స్పష్టం చేసింది. లేదంటే ఉన్నతాధికారులు తమ ముందు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
చదవండి: Free Coaching: పోటీ పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు.. దరఖాస్తులు ఆహ్వానం..
2009లో హైకోర్టులో పిటిషన్‌తో మొదలు..
2008 డిసెంబర్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, వీటికి బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొంది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో 28ని తీసుకొచ్చింది.
అయితే తమ కంటే తక్కువ అర్హత కలిగిన డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు రిజర్వు చేయడాన్ని, ఇందుకు సంబంధించి తమకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 70 మంది బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 2009లో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి మళ్లీ ఇక్కడికే వచ్చింది. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవి ధర్మాసనం ఫిబ్రవరి 3న మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.
![]() ![]() |
![]() ![]() |
నియామకాలకు సీఎం ఆమోదం తెలిపారు..
‘1,382 మంది బీఎడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. 2024, ఫిబ్రవరి 24న కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో 292ను జారీ చేసింది. కేబినెట్ సబ్ కమి టీ చైర్మన్ అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. 1,382 మంది అభ్యర్థులు కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాల డీఈవోలు తెలిపారు.
ఇదే విషయాన్ని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కమిటీ కూడా నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నియామకాలు చేపడతాం..’ అని ఏజీ చెప్పారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు ఇస్తామని ఏజీ చెప్పినప్పటికీ.. ఈ నెల 10లోగా పోస్టింగ్‌లు ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేశారు.