Good News: వైద్య శాఖలో బదిలీలకు అనుమతి
బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ మధ్య బదిలీల ప్రక్రియ చేపట్టడానికి ఆంధ్రప్రదే«శ్ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల రీత్యా బదిలీలు కోరుతూ ఉద్యోగుల నుంచి అనేక దరఖాస్తులు అందినందున, ప్రభుత్వం బదిలీలు చేపట్టడానికి నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆన్ లైన్ లోనే దరఖాస్తులు
మొత్తం బదిలీల ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో చేపడతారు. దరఖాస్తుల స్వీకరణ, ఖాళీలు, సీనియారిటీ జాబితా ప్రకటన, ఇతర ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుంది. అన్ని విభాగాధిపతులు వారి పరిధిలో ఉన్న ఖాళీల జాబితాను ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రదర్శిస్తారు. బదిలీకి అర్హులైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 7వ తేదీ నాటికి దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరాలి. బదిలీ కోసం ప్రతి ఉద్యోగి గరిష్టంగా మూడు ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. ప్రాధాన్యతలు ఇవ్వని పక్షంలో ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 21వ తేదీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఉద్యోగులు తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలి.
మార్గదర్శకాలు..
- ఫిబ్రవరి 28 నాటికి మైదాన ప్రాంతాల్లో 3 ఏళ్లు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. వీరికి బదిలీ తప్పనిసరి కాదు. విన్నపం మేరకే బదిలీ ఉంటుంది
- ఫిబ్రవరి 28కి ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొనే ఉద్యోగులందరికీ బదిలీ తప్పనిసరి
- ఏ స్పెషలిస్టు వైద్యుడిని అదే స్పెషాలిటీలో నియమించాలి. ఇతర స్పెషాలిటీల్లో నియమించకూడదు. మిస్ మ్యాచ్ పోస్టింగ్‌లు పూర్తిగా నిషేధం
- 2023 ఫ్రిబ్రవరి 28 లోపు ఉద్యోగ విరమణ పొందే వారికి బదిలీల నుంచి మినహాయింపు
- బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న దగ్గర రిలీవ్ అవ్వాలి. ప్రత్యేక పరిస్థితుల్లో ఏడు రోజుల వరకు సమయం ఉంటుంది. ఈ నిబంధనలను అతిక్రమించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది
- మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న ఉద్యోగులను, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటివి చేయించుకున్న ఉద్యోగులకు వైద్య వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీకి అవకాశం. మెడికల్ గ్రౌండ్స్ కింద ఉద్యోగికి లేదా అతనిపై ఆధారపడి ఉండే భార్య, పిల్లలు, తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితుల పరిశీలన
- డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఏపీవీవీపీ, ప్రజారోగ్యం, ఆయుష్, ఔషధ నియంత్రణ ఇలా విభాగాల వారీగా విభాగాధిపతులు, ఇతర సభ్యులతో కూడిన కమిటీలు రాష్ట్రస్థాయి బదిలీలకు కౌన్సెలింగ్ చేపడతాయి.
- జోనల్, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి) అధ్యక్షతన రీజినల్ డైరెక్టర్, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌లతో కూడిన కమిటీలు కౌన్సెలింగ్ చేపడతాయి
- బదిలీల ప్రక్రియ మొత్తాన్ని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ పర్యవేక్షిస్తారు.
చదవండి:
After Inter BiPC: అవకాశాలు భేష్!