After Inter BiPC: అవకాశాలు భేష్!
ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో చేరి.. వైద్య రంగంలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం నీట్ యూజీలో విజయానికి ఇంటర్ తొలి రోజు నుంచే కృషి చేస్తారు. దేశంలో మెడికల్ సీట్లు పరిమితం. పోటీ ఎక్కువ. దాంతో ఆశించిన అందరికీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశం లభించే అవకాశం లేదు. అయినా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులకు.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు..మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి!! ఏ కోర్సు పూర్తి చేసినా.. ఉన్నత విద్యతోపాటు ఉజ్వల కెరీర్ అవకాశాలు ఖాయం అంటున్నారు నిపుణులు! ఈ నేపథ్యంలో.. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సహా అందుబాటులో ఉన్న కోర్సులు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ..
- ఎక్కువ మంది బైపీసీ విద్యార్థుల లక్ష్యం ఎంబీబీఎస్, బీడీఎస్
- వీటితోపాటు కెరీర్‌కు కలిసొచ్చే మరెన్నో కోర్సులు
- ఏ కోర్సు పూర్తి చేసుకున్నా.. అవకాశాలు ఖాయం
తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఇంటర్‌లో ఎంపీసీ తర్వాత ఎక్కువ మంది బైపీసీ విద్యార్థులు ఉంటారు. బైపీసీ గ్రూప్ విద్యార్థులు ఉన్నత విద్య అనగానే ఎంబీబీఎస్, బీడీఎస్‌లే అనుకుంటారు. కానీ.. వీటితోపాటు మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఆయా కోర్సుల గురించి అవగాహన పెంచుకుంటే.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీటు రాకున్నా.. నిరాశ చెందకుండా.. ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరేందుకు మానసిక సంసిద్ధత లభిస్తుంది.
ఎంబీబీఎస్
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ.. ఎంబీబీఎస్. ఇది బైపీసీ విద్యార్థుల తొలి లక్ష్యం. ఈ కోర్సులో చేరాలంటే.. నీట్–యూజీలో ర్యాంకు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులయ్యాక ఉన్నత విద్యలో పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీహెచ్‌డీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ స్థాయిలో ఎండీ లేదా ఎంఎస్ పేరుతో దాదాపు 30 స్పెషలైజేషన్లలో చేరే అవకాశం ఉంది. ఎండీ లేదా ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డీఎన్‌బీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సులు అభ్యసించాలనుకునే అభ్యర్థులు నీట్–పీజీ ఎంట్రన్స్‌లో, డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాలనుకునే వారు నీట్–ఎస్‌ఎస్ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
చదవండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!
బీడీఎస్
బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీటు రాకపోతే బీడీఎస్‌లో చేరతారు. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీగా పిలిచే ఈ కోర్సును పూర్తి చేసుకుంటే.. దీటైన అవకాశాలు అందుకోవచ్చు. ఈ కోర్సులో చేరాలంటే.. నీట్–యూజీలో ర్యాంకు సాధించాలి. మెరిట్, సీట్ల సంఖ్య ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఉన్నత విద్యలో ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)లో చేరే అవకాశం ఉంది. ఈ కోర్సులో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎండీఎస్‌లో చేరాలంటే.. నీట్–పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించాలి. బీడీఎస్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో ఉన్నత విద్య అవకాశం.. పీజీ డిప్లొమా. రెండేళ్ల ఈ పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేయడం ద్వారా పీజీ స్థాయి కోర్సులు చదివిన వారికి లభించే అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ఆయుష్ కోర్సులు
వైద్య రంగంలో కెరీర్ కోరుకునే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ యోగ, హోమియోపతిలనే సంక్షిప్తంగా ఆయుష్‌గా పిలుస్తారు. ఇటీవల కాలంలో అల్లోపతి వైద్యంతోపాటు సంప్రదాయ వైద్య రీతులుగా భావించే ఈ ఆయుష్ విభాగాలకు కూడా ఆదరణ పెరుగుతోంది.
బీహెచ్‌ఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ సంక్షిప్తంగా.. బీహెచ్‌ఎంఎస్. ఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత ఆదరణ పొందుతున్న కోర్సు ఇది. ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్ కరిక్యులంలో ఉండే విభాగాలు ఉంటాయి. బీహెచ్‌ఎంఎస్ అర్హతతోనే నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యలో..పీజీ స్థాయిలో మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో కెరీర్ అవకాశాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
చదవండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...
బీఏఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ.. బీఏఎంఎస్. ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం సంపాధించడం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియల ద్వారా రోగులకు అందించే వైద్యంపై పట్టు లభిస్తుంది. ఉన్నత విద్యలో.. ఎండీ స్థాయిలో.. ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సులు కూడా పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి.
యునానీ (బీయూఎంఎస్)
బీయూఎంఎస్.. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్. దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. బీయూఎంస్ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే విధంగా ఎండీ, ఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీఎన్‌వైఎస్
బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్(బీఎన్‌వైఎస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి.
నీట్ స్కోర్ ఆధారంగా సీట్ల భర్తీ
ఆయుష్ కోర్సుల అభ్యర్థులు కూడా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–యూజీ(అండర్ గ్రాడ్యుయేషన్) ప్రవేశ పరీక్షలో మంచి స్కోర్ సాధించాలి. కారణం.. ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.దీనికోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి.
- వివరాలకు వెబ్‌సైట్స్: ntruhs.ap.in, knruhs.telangana.gov.in
వెటర్నరీ సైన్స్
పేరుకు ముందు డాక్టర్ హోదా.. కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అందుకునేందుకు వీలు కల్పించే ప్రత్యామ్నాయ కోర్సు..బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్‌సీ). జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం కల్పించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేస్తే.. పౌల్ట్రీ ఫారాలు,ప్రభుత్వ,ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు,పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు,జంతు ప్రదర్శనశాలలు,డెయిరీ ఫామ్స్,గొర్రెల పెంపకం కేంద్రాల్లో ఉపాధి లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు..ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ,తెలంగాణలో íపీవీన రసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంది.పీజీ స్థాయిలోనూ పలు స్పెషలైజేషన్లు అభ్యసించే అవకాశం ఉంది.
- వివరాలకు వెబ్‌సైట్స్: www.tsvu.nic.in, www.SVVU.edu.in
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ కోర్సు పూర్తి చేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా ఉపాధి పొందొచ్చు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా అందుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి పరంగా ఢోకా లేదు.
చదవండి: After 10+2: ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా
పారా మెడికల్ కోర్సులు
బైపీసీ గ్రూప్ విద్యార్థులకు సత్వర ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. వీటిలో ప్రధానంగా న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ఆసుపత్రుల్లో ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు.
బీఎస్సీ నర్సింగ్
బైపీసీ విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పిస్తున్న మరో కోర్సు.. బీఎస్సీ నర్సింగ్. రాష్ట్రాల స్థాయిలో పారామెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, స్టేట్ హెల్త్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించే ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్‌తో నర్సులుగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్యలో పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్ అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో మెడికల్ సర్జన్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్ నర్సింగ్, ఆబ్సె›్టట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీరికి ఆస్పత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం నర్సింగ్ కోర్సులను రాష్ట స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివే అవకాశం ఉంది. నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉంది.
అగ్రికల్చర్ బీఎస్సీ
బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
బీఎఫ్‌ఎస్సీ
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంక్షిప్తంగా.. బీఎఫ్‌ఎస్సీ. చేపల పెంపకం,సేకరణకు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా చెప్పొచ్చు. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
బీటెక్–ఫుడ్ టెక్నాలజీ
బైపీసీ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో కెరీర్ పరంగా కలిసొచ్చే కోర్సు.. బీటెక్–ఫుడ్ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసుకుంటే ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువులు సంపాధించొచ్చు.
చదవండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు