Skip to main content

గురుకులాల్లో 317 గుబులు!

సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది.
GO 317 Tension in Telangana
గురుకులాల్లో 317 గుబులు!

రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS), Telangana Minorities Residential Educational Institutions Society (TMREIS)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది.

చదవండి: తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో రీజినల్‌ లెవల్‌ కో–ఆర్డినేటర్ల తొలగింపు.. ఎందుకంటే!

వివరాల సేకరణ షురూ

ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగు­ల నుంచి నిర్దేశించిన ఫార్మాట్‌లో వివరాలను సేకరించే పనిలో రీజినల్‌ కోఆర్డినేటర్లు బిజీ అయ్యా­రు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. 

చదవండి: గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్లలో సగం సీట్లు స్థానికులకే!

జోనల్‌ ఉద్యోగుల్లో గందరగోళం

కొత్త జోనల్‌ విధానం ప్రకారం విభజన అంశం జోనల్‌ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్‌ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్‌ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. 

చదవండి: తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సబల క్లబ్‌లు

కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా...

జిల్లా స్థాయి: జూనియర్‌ అసిస్టెంట్, స్టోర్‌ కీపర్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, రికార్డ్‌ అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్, ల్యాబ్‌ అటెండర్‌
జోనల్‌ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్‌ డైరెక్టర్‌ (గ్రేడ్‌ 2), లైబ్రేరియన్, సీనియర్‌ అసిస్టెంట్, స్టాఫ్‌ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, ప్లంబర్‌/ఎలక్ట్రీషియన్‌
మల్టీ జోనల్‌ స్థాయి: ప్రిన్సిపల్‌ (గ్రేడ్‌ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, జూనియర్‌ లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ (గ్రేడ్‌ 1), పీజీటీలు.

చదవండి: గురుకుల పదో తరగతికి 50 రోజుల ప్రణాళిక!

జిల్లా, మల్టీ జోన్లలో కొందరు

జిల్లాస్థాయి, మల్టీ జోనల్‌ స్థాయి కేడర్‌ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్‌ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. 

Published date : 15 Jul 2022 03:30PM

Photo Stories