Skip to main content

తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో రీజినల్‌ లెవల్‌ కో–ఆర్డినేటర్ల తొలగింపు.. ఎందుకంటే!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ప్రక్షాళన మొదలైంది.
అక్రమాలకు అధికారులు చెక్‌ పెట్టనున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న రీజినల్‌ లెవల్‌ కో–ఆర్డినేటర్‌ (ఆర్‌ఎల్‌సీ)లను ప్రభుత్వం తొలగించింది. గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (పీజీటీ)లో అనుభవజ్ఞులైనవారికి వారిస్థానాల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సొసైటీ (టీమరీస్‌) కార్యదర్శి షఫీఉల్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు విజిలెన్స్‌ వ్యవస్థనూ రద్దు చేయాలని, అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొంది ప్రస్తుతం గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 67 మంది ఆర్‌ఎల్‌సీలు ఇంటిబాట పట్టారు. త్వరలోనే అంతేమంది విజిలెన్స్‌ అధికారులను ప్రభుత్వం తొలగించనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలుండగా వాటిలో 71 కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. గురుకులాల పర్యవేక్షణకు ప్రభుత్వం ఆర్‌ఎల్‌సీలు, జిల్లా విజిలెన్స్‌ బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ఇద్దరు లేదా ముగ్గురున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారినే బోధన, బోధనేతర సిబ్బందిగా నియమించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తనకు తెలియకుండా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టరాదని సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లా హెచ్చరించారు.
Published date : 01 Dec 2020 04:35PM

Photo Stories