Jobs: యూనివర్సిటీల్లో పేరుకుపోయిన ఖాళీలు.. మెుత్తం పోస్టుల వివరాలు ఇలా..
అసలీ బోర్డును ఎందుకు తెచ్చారో చెప్పాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. University Grant Commission (UGC) నిబంధనల మేరకే బోర్డు ఏర్పాటు జరిగిందా? అని ఆమె సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం మాత్రం అన్ని నిబంధనలకు లోబడే ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు, ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఈ దశలోనే వివాదం మొదలైంది.
చదవండి: AP Govt Jobs: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఏమిటీ వివాదం?
రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో 8 ఏళ్లుగా నియామకాలు జరగలేదు. టీచింగ్, నాన్–టీచింగ్ కలిపి 8 వేల పోస్టుల ఖాళీలున్నాయి. గతంలో వర్సిటీల్లో ఎక్కడికక్కడే సిబ్బందిని నియమించుకునే వాళ్లు. ఈ విధానంలో అవినీతి జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఎవరికి వారు ఇష్టానుసారంగా మార్గదర్శకాలు పెట్టుకోవడం సరికాదంటూ ఉమ్మడి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఇది తమ అధికారాన్ని తగ్గించేలా ఉందంటూ వీసీలూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి బోర్డులో ఉన్నత విద్యామండలి చైర్మన్, ఇతర ఐఏఎస్ అధికారుల పాత్రను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జగడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీల చాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్ ఉమ్మడి బోర్డుపై మరింత స్పష్టత కోరుతూ విద్యామంత్రికి లేఖ రాసి, వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి బోర్డు పేరుతో ప్రభుత్వం రాజకీయ నియామకాలు చేపట్టే వీలుందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం మధ్యలో వర్సిటీల్లో నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించడం లేదని అంటున్నారు.
చదవండి: Student Career : ఉద్యోగాలు వచ్చేలా.. ‘పరీక్షలు’.. ఎలా అంటే..!
యూనివర్సిటీల్లో మెుత్తం పోస్టుల వివరాలు ఇలా..
కేటగిరీ |
మంజూరు |
ఖాళీలు |
ప్రొఫెసర్ |
395 |
238 |
అసోసియేట్ ప్రొఫెసర్ |
910 |
781 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ |
1,532 |
850 |
మెుత్తం |
2,837 |
1,869 |
భారీగా ఖాళీలు... తగ్గుతున్న నాణ్యత
వర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడాయి. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాంట్రాక్టు సిబ్బందితో ఏదో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
- 2021 జనవరి 31 నాటికి 11 వర్సిటీల్లో 2,837 పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులున్నారు.
- 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా భర్తీ చేయలేదు.
- శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ), అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకే ఒకరున్నారు.
- 11 వర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.