UPSC Civil Services Exam 2022: సివిల్స్ లక్ష్యంగా... సరైన ప్రణాళిక!!
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్–2022 నోటిఫికేషన్ విడుదల
- గత ఏడాది కంటే పెరిగిన పోస్ట్‌ల సంఖ్య
- తొలి దశ ప్రిలిమ్స్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- జూన్ 5వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షతో అడుగులు వేస్తే.. సక్సెస్
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్‌పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
చదవండి: UPSC Civil Services Exam 2022: సివిల్ సర్వీస్‌లో 861 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గతేడాది కంటే పెరిగిన పోస్టులు
సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్‌ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్‌లు, 2020లో 796 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
పది లక్షల వరకు పోటీ
సివిల్స్‌కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు.ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్‌ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
మొత్తం మూడు దశలు
సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ)
ప్రిలిమినరీ ఇలా
- తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు.. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు
చదవండి: UPSC IFS Exam 2022: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్‌ఎస్)లో 151 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మెయిన్ ఎగ్జామ్.. ఇలా
- సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్.
- ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి.
- అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు.
- తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు.
- మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది.
- మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించే మార్కులు 275.
- పర్సనాలిటీ టెస్ట్‌లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు.
ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే
సివిల్స్ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి.
- జనరల్ స్టడీస్ పేపర్‌గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
- రెండో పేపర్ సీశాట్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
చదవండి: Latest Current Affairs
కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం
అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి.
అనుసంధాన వ్యూహం
సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి.
డిస్క్రిప్టివ్ అప్రోచ్
ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్‌లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి.
ఈ సబ్జెక్ట్‌లపై ప్రత్యేక దృష్టి
ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి.
పేపర్–2కు ఇలా
అర్హత పేపర్‌గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్‌లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.
మెయిన్‌తో అనుసంధానం
సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్‌లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్‌ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
చదవండి: UPSC ESE Prelims– 2022: తుది దశ సన్నద్ధత ఎలా!..
సిలబస్‌పై అవగాహన
ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్‌లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది.
పుస్తకాలు
సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
టైమ్ మేనేజ్‌మెంట్
ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్‌లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.
చదవండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై పట్టు.. కొలువు కొట్టు !
సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు
- పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్(సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్.
- పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్.
సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం
- అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022
- తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://upsconline.nic.in/mainmenu2.php
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
దీర్ఘకాలిక వ్యూహం
సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్‌ను మెయిన్ ఎగ్జామినేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్‌సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి.
– శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ
చదవండి: Latest from Civils