Skip to main content

UPSC ESE Prelims– 2022: తుది దశ సన్నద్ధత ఎలా!..

యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఈఎస్‌ఈ. బీటెక్‌ అర్హతగా నిర్వహించే ఈ పరీక్ష.. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు సుపరిచితం! ఇందులో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికాం ఇంజనీరింగ్‌ విభాగాల్లో.. గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి స్థాయి కొలువు సొంతమవుతుంది! అంతేకాదు సుస్థిర కెరీర్‌తో సమున్నత స్థానాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది! అందుకే.. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఇంజనీరింగ్‌ అభ్యర్థులు ఈఎస్‌ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు. ఈఎస్‌ఈ–2022 మూడు దశల ఎంపిక ప్రక్రియలో కీలకమైన తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష.. ఈ నెల 20వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌...
preparation tips and guidance for ESE 2022 Prelims
preparation tips and guidance for ESE 2022 Prelims
  • ఈ నెల 20న ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష
  • అందుబాటులోకి అడ్మిట్‌ కార్డ్‌ సదుపాయం
  • పునశ్చరణ, మోడల్‌ టెస్ట్‌లకు ప్రాధాన్యం

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌.. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే.. లక్ష్యం దిశగా సగం దూరం చేరుకున్నట్లే! తదుపరి దశ మెయిన్‌ ఎగ్జామ్‌లో రాణించడానికి అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాకుండా ప్రిలిమ్స్‌ మార్కులు ఫైనల్‌ సెలక్షన్‌లోనూ కీలకంగా నిలుస్తాయి. కాబట్టి ఈఎస్‌ఈ అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో రాణించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

మొత్తం పోస్టుల సంఖ్య 247

  • పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో.. గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. ఈఎస్‌ఈ–2022. ఈ పరీక్ష ద్వారా మొత్తం 247 పోస్ట్‌లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మూడు దశలుగా(ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌) ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !


ఇప్పుడేం చేయాలి
తొలిదశ ప్రిలిమ్స్‌ పరీక్షను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు ఇంకా దాదాపు పది రోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్‌ చివరి దశకు చేరుకొని ఉంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమయంలో పునశ్చరణ, మాక్‌టెస్టులపై ఎక్కువగా దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

పునశ్చరణ
ఈఎస్‌ఈ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు చదివిన సిలబస్‌ అంశాలను కనీసం మూడుసార్లు రివిజన్‌ చేసుకునేలా టైం ప్లాన్‌ రూపొందించుకోవాలి. అదే విధంగా మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ టెస్ట్‌లకు సెక్షన్‌ల వారీగా హాజరయ్యే విధానాన్ని అనుసరించాలి. అదేవిధంగా గ్రాండ్‌ టెస్ట్‌లపైనా దృష్టిపెట్టాలి. ఫలితంగా ప్రతి సెక్షన్‌లోను తమ ప్రతిభను తెలుసుకునే అవకాశం ఉంటుంది. సదరు సెక్షన్‌కు సంబంధించి తాము ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకొని.. మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. 

సొంత నోట్స్‌.. సాధనంగా

  • ఈఎస్‌ఈ అభ్యర్థులు ప్రిపరేషన్‌ తొలిదశ నుంచే సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లు, వాటికి సంబంధించిన ముఖ్యాంశాలతో నోట్స్‌ రాసుకొని ఉంటారు.ప్రస్తుత సమయంలో ఈ సొంత నోట్స్‌ను రివిజన్‌కు ఉపయోగించుకోవాలి. ఈ నోట్స్‌లో రాసుకున్న సినాప్సిస్‌లను మరోసారి అవలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాన్సెప్ట్‌లపై గట్టి పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. ఎంపిక చేసుకున్న మెటీరియల్‌లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. బీటెక్‌ స్థాయి అకడమిక్‌ పుస్తకాల్లో పేర్కొన్న కీలక కాన్సెప్ట్‌లను కూడా పునశ్చరణ చేసుకోవాలి.


చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..
 

ప్రీవియస్‌ పేపర్లు

  • ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ చివరి దశ ప్రిపరేషన్‌లో భాగంగా గేట్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గేట్‌లో అడిగే ప్రశ్నల తీరు ఈఎస్‌ఈ ప్రశ్నల మాదిరిగానే ఉంటుంది. గేట్‌లో ఆబ్జెక్టివ్‌తో పాటు మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ కూడా ఉంటాయి. వీటిని బాగా ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఒక టాపిక్‌కు సంబంధించి విభిన్న కోణాల్లో సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా.. దాని బేసిక్‌ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకునే సామర్థ్యం లభిస్తుంది. సమాధానాన్ని సులువుగా గుర్తించగలిగే నైపుణ్యం కూడా సొంతమవుతుంది.
  • అభ్యర్థులు.. పరీక్ష ముందు వారం రోజుల వ్యవధిలో ఈఎస్‌ఈ పాత ప్రశ్న పత్రాల సాధన చేయాలి. ఫలితంగా పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్న తీరుపై అవగాహన లభిస్తుంది. కనీసం అయిదారేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీ గురించి తెలుస్తుంది.

పరీక్ష హాల్లో ఇలా

  • పరీక్ష రోజున అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది.తొలి సెషన్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్, రెండో సెషన్‌లో ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ పేపర్‌లు ఉంటాయి.
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌లో.. అభ్యర్థులు ముందుగా తమకు సులభంగా భావించే ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌ విభాగాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్‌ స్టడీస్‌పై దృష్టి పెట్టాలి. 
  • సబ్జెక్ట్‌ పేపర్‌గా ఉండే రెండో పేపర్‌లో.. ఈజీ టు డిఫికల్ట్‌ సూత్రాన్ని అనుసరించాలి. ముందుగా సులభమైన ప్రశ్నలకు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు, చివరగా బాగా క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్లాన్‌ చేసుకోవాలి. 
  • ప్రతి ప్రశ్నను చదివేటప్పుడు దాని కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలి.దానికి అనుగుణంగా అప్లికేషన్‌ అప్రోచ్‌ నైపుణ్యంతో సమాధానం సాధించాలి. 
  • కొన్ని సందర్భాల్లో ఒకట్రెండు కాన్సెప్ట్‌ల సమ్మిళితంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఆయా కాన్సెప్ట్‌ల మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని అర్థం చేసుకోవాలి.

యాభై శాతం మార్కులు సాధించేలా

  • ఈఎస్‌ఈ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో యాభై శాతం మార్కులు సాధిస్తే.. తదుపరి దశ స్టేజ్‌–2గా పిలిచే మెయిన్‌కు మార్గం సుగమం అవుతుంది. 
  • ఈఎస్‌ఈ గత మూడేళ్ల ప్రిలిమ్స్‌ కటాఫ్‌లను పరిశీలిస్తే.. యాభై శాతం మార్కులుæ కటాఫ్‌ మార్కులుగా నమోదయ్యాయి. కాబట్టి మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే తాపత్రయంతో తప్పులు చేయడం కంటే.. 60 నుంచి 70 శాతం ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా వ్యవహరించాలి. 


ప్రిలిమ్స్‌(స్టేజ్‌–1) పరీక్ష విధానం

  • ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.
  • రెండు పేపర్లలో 500 మార్కులకు ప్రిలిమ్స్‌ పరీక్ష.
  • పేపర్‌–1గా జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌(200 మార్కులు).
  • పేపర్‌–2గా ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ పేపర్‌ (300 మార్కులు).
  • ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తే మలి దశ మెయిన్స్‌ పరీక్ష. 
  • రెండు పేపర్లుగా డిస్క్రిప్టివ్‌ విధానంలో 600 మార్కులకు మెయిన్‌ పరీక్ష.
  • మెయిన్‌లోనూ రాణిస్తే చివరగా పర్సనాలిటీ టెస్ట్‌.

ఈఎస్‌ఈ–2022 ముఖ్య సమాచారం

  • పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/eadmitcard/admitcard_ese_2022/

అంతా ప్రాక్టీస్‌కే
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ఈఎస్‌ఈ అభ్యర్థులు పూర్తిగా ప్రాక్టీస్‌కే పరిమితం కావాలి. రివిజన్, మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ సమయంలో రీడింగ్‌ వల్ల ఆశించినంత ప్రయోజనం ఉండదు. ప్రాక్టీస్‌ ద్వారా అప్లికేషన్‌ అప్రోచ్‌ను పెంచుకోవచ్చు.
–కె.వి.కృష్ణారెడ్డి, ఈఎస్‌ఈ–2020(సివిల్‌) విజేత 

చ‌ద‌వండి: UPSC Civils Prelims 2022: నోటిఫికేషన్ విడుదల... పూర్తి వివరాలు ఇలా

Published date : 07 Feb 2022 03:08PM

Photo Stories