Skip to main content

టీఎస్‌ పీజీఈసెట్‌–2021 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఇదే..

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ స్టేట్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(పీజీఈసెట్‌) రాయాల్సి ఉంటుంది.

పీజీఈసెట్‌ ర్యాంకు ద్వారా.. ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, ప్రస్తుతం పీజీఈసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా పూర్తి వివరాలు...

జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్‌లో చేరాలంటే... గేట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఇతర ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూ ట్స్‌లో ఎంటెక్‌లో చేరేందుకు అవకాశం కల్పించే పరీక్ష పీజీఈసెట్‌. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పీజీఈసెట్‌–2021 షెడ్యూల్‌ విడుదలైంది. ఇందులో ర్యాంకు ఆధారంగా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, ఫార్మ్‌–డి (పోస్ట్‌ బాక్యులరేట్‌) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

చదివిన బ్రాంచ్‌ ఆధారంగా..

  • టీఎస్‌ పీజీఈసెట్‌ను మొత్తం 19(ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు బీటెక్‌లో తాము చదివిన బ్రాంచ్‌ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
  • ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌; బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌; కెమికల్‌ ఇంజనీరింగ్‌; కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ; ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌; ఫుడ్‌ టెక్నాలజీ; ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్‌; ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌; బయోటెక్నాలజీ; సివిల్‌ ఇంజనీరింగ్‌; ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌; ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌; జియో ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌; మైనింగ్, నానో టెక్నాలజీ; టెక్స్‌టైల్‌ టెక్నాలజీ.

విద్యార్హతలు..
బీటెక్‌/బీఈ/బీఫార్మసీ/బీఆర్క్‌ కోర్సులు లేదా సంబంధిత పేపర్లకు అర్హతగా నిర్దేశించిన బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

ఎంఫార్మసీకి కూడా..
బీఫార్మసీ పూర్తి∙చేసిన విద్యార్థులకు ఉన్నత విద్య కోణంలో ఉన్న అవకాశం.. ఎంఫార్మసీ. ఈ కోర్సులో ప్రవేశానికి కూడా పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసుకొని ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఆ ర్యాంకు ఆధారంగా పీజీ స్థాయిలో ఎంఫార్మసీలో అందుబాటులో ఉండే పలు స్పెషలైజేషన్లలో అడుగుపెట్టొచ్చు. పీజీఈసెట్‌ ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి.

బీటెక్‌ స్థాయి ప్రశ్నలు..
దాదాపు 20 పేపర్లలో పీజీఈసెట్‌ను నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం రెండు గంటలు. పీజీఈసెట్‌లో అడిగే ప్రశ్నలన్నీ బీటెక్‌ స్థాయిలో ఉంటాయి. ప్రశ్నలు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో అడుగుతారు. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్‌ పరంగా ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం బుక్‌ రీడింగ్‌కే పరిమితం కాకుండా.. సమస్యను పలు కోణాల్లో పరిష్కరించే నేర్పును సొంతం చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం నాలుగు గంటల చొప్పున ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ముఖ్యంగా తృతీయ, చివరి సంవత్సరం సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ఆన్‌లైన్‌..
మొదటిసారి ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఈ విధానంపై అవగాహన ఏర్పరచుకోవాలి. తద్వారా పరీక్ష హాల్లో అందుబాటులో ఉండే సమయంలో ప్రశ్నలకు తడబాటులేకుండా సమాధానాలు ఇవ్వగలుగుతారు. ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ముఖ్యంగా పీజీఈసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే∙మాక్‌ టెస్ట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

ఎంపిక జాగ్రత్తగా..
పీజీఈసెట్‌ అభ్యర్థులు తాము ఎంపిక చేసుకునే పేపర్ల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. వాస్తవానికి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సంబంధిత పేపర్‌తోపాటు మరికొన్ని పేపర్లకు కూడా అర్హత ఉంటుంది. అర్హత ఉన్న పేపర్లలో బాగా అవగాహన, నైపుణ్యం ఉన్న పేపర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధించొచ్చు. ఇలా పేపర్‌ ఎంపిక నుంచి పరీక్ష రోజు వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

సీట్లు భర్తీ..
పీజీఈసెట్‌లో ర్యాంకు ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంలో సీట్లు భర్తీ చేస్తారు. ఆయా సీట్ల భర్తీ సమయంలో.. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్, జీప్యాట్‌ పరీక్షల ఉత్తీర్ణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అంటే.. ముందుగా గేట్‌ ర్యాంకర్లు ఎంపిక చేసుకున్న సీట్లను భర్తీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లకు మాత్రమే పీజీఈసెట్‌లో ర్యాంకు సాధించిన వారికి కేటాయిస్తారు. కాబట్టి గేట్‌కు హాజరు కాకుండా.. కేవలం పీజీఈసెట్‌ ద్వారానే సీటు పొందాలనుకునే విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్‌ 30, 2021
  • హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 10–18
  • పరీక్ష తేదీ: జూన్‌ 19–22
  • ఫీజు: రూ.1000, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_HomePage.aspx

Photo Stories