Skip to main content

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌... దరఖాస్తు చేసుకోండిలా..

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు రాష్ట్రంలో తమకు నచ్చిన కాలేజీల్లో ఇష్టమైన కోర్సులో చేరేందుకు వీలుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘దోస్త్‌’లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది.
‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ’గా పిలిచే ఈ పోర్టల్‌ నుంచే కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు, కోర్సులు, అర్హతలు, రిజిస్ట్రేషన్‌ విధానం, సీట్ల కేటాయింపు తదితర వివరాలు..

ఆరు వర్సిటీలకు ఒకే సారిగా..
దోస్త్‌ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ, అటానమస్, ఎయిడెడ్‌/ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. ఆయా కళాశాలల్లో సీట్ల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ–దోస్త్‌’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే వేదికపైకి తెచ్చి.. కోర్సుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దీనిద్వారా విద్యార్థికి ఏ కాలేజీలో ఏయే కోర్సులు ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాకుండా తనకు నచ్చిన కోర్సులో మెచ్చిన కాలేజీలో చేరేలా సింగిల్‌ విండో విధానం అమలవుతోంది.

సైన్స్‌/ఆర్ట్స్‌/కామర్స్‌తోపాటు..
  • ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు అందిస్తున్న బీఏ/బీఎస్సీ/బీకామ్‌/ బీకామ్‌(ఒకేషనల్‌)/బీకామ్‌(హానర్స్‌)/బీఎస్‌డబ్ల్యూ/బీబీఏ/బీబీఎం/బీసీఏ తదితర డిగ్రీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు డీ ఫార్మసీ, డీహెచ్‌ఎంసీటీల్లోనూ దోస్త్‌ ద్వారా అడ్మిషన్‌ పొందొచ్చు.
  • రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో వెయ్యి డిగ్రీ కాలేజీల వరకు ఉన్నాయి. వీటిలో రెండు వందలకుపైగా విభిన్న కోర్సులు అందిస్తున్నారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
  • కోర్సుల పరంగా చూస్తే.. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులతోపాటు మరికొన్ని విభిన్న సబ్జెక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విభాగంలో.. జర్నలిజం/మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం/మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌/మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌/స్టాటిస్టిక్స్‌ వంటి కోర్సుల్లోనూ చేరే వీలుంది.
  • క్లినికల్‌ నూట్రిషన్‌ డైటెటిస్‌/నూట్రిషన్‌ అండ్‌ డైటెటిస్‌/క్రాప్‌ ప్రొడక్షన్‌/డెయిరీ సైన్స్‌/డెయిరీ టెక్నాలజీ/ఫుడ్‌ అండ్‌ నూట్రిషన్‌/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌/ఫారెస్ట్రీ/ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ/పౌల్ట్రీ సైన్స్‌ /ఫిషరీస్‌/అప్లైడ్‌ నూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వంటి కోర్సుల్లోనూ చేరే అవకాశముంది.
  • గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని అనుసరించి విద్యార్థులు మూక్స్‌ కోర్సులు కూడా ఎంచుకోవచ్చు.

అర్హతలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డు, ఇతర రాష్ట్రాల బోర్డుల నుంచి ఇంటర్‌ తత్సమాన గుర్తింపు కలిగిన కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

రిజిస్ట్రేషన్‌ ఇలా..
ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఆధారంగా విద్యార్థులు ‘దోస్త్‌’ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్‌తో ఆనుసంధానమైన ఫోన్‌ నంబర్‌తో వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా దోస్త్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అలా చేయలేనివారు తమ తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌తో తమ ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేసుకోవాలి. లేదా దోస్త్‌ హెల్ప్‌లైన్‌/ మీసేవా సెంటర్స్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీనికోసం రూ.200 ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత జనరేట్‌ అయ్యే దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబర్‌తో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

వెబ్‌ ఆప్షన్స్‌..
రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తి చేసిన తర్వాత ఏ కాలేజీలో యే కోర్సులో చేరాలనుకుంటున్నారో ప్రాధాన్యతా క్రమంలో(ఆప్షన్స్‌) పేర్కొనాలి. పేర్కొన్న ఆప్షన్స్, ఇంటర్మీడియట్‌లో విద్యార్థి సాధించిన మార్కులు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తారు. కాబట్టి విద్యార్థులు ఇటీవల పొందిన కుల, కుటుంబ ఆదాయ సర్టిఫికెట్లతోపాటు ఎన్‌సీసీ, వికలాంగ ధ్రువపత్రాలను దోస్త్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

ఫీజు చెల్లింపు విధానం..:
విద్యార్థి పేర్కొన్న ఆప్షన్స్‌ ప్రకారం–సీటు లభిస్తే.. ఆన్‌లైన్‌లోనే సదరు కళాశాలకు రిపోర్ట్‌ చేసి.. నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి దశలో ఫీజు చెల్లించాక.. కళాశాల మారాలనుకుంటే.. రెండు, మూడో దశల్లోనూ అవకాశం కల్పిస్తారు. ఇందుకు మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

టీ యాప్‌ ఫోలియో..
గత ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ‘టీ యాప్‌ ఫోలియో’లో రియల్‌ టైమ్‌ డిజిటల్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది కూడా కరోనా పరిస్థితులు ఉన్నందున అదే విధానం కొనసాగించనున్నారు. విద్యార్థులు ‘టీ–యాప్‌ ఫోలియో’ను తమ మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని.. దోస్త్‌ ఐడీ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. తమ హాల్‌ టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈ సర్వీస్‌లో సెల్ఫ్‌ ఫొటోతో దోస్త్‌లో రిజిస్టర్‌ కావచ్చు.

ముఖ్యమైన తేదీలు.. :
ఫేజ్‌–1 రిజిస్ట్రేషన్‌/ఫీజు చెల్లింపు (రూ.200): జూలై 1 నుంచి 15 వరకు.
వెబ్‌ ఆప్షన్స్‌ ప్రక్రియ: జూలై 3 నుంచి 16 వరకు
ఫేజ్‌–1 సీట్ల కేటాయింపు: జూలై 22.
ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 23 నుంచి 27 వరకు.
ఫేజ్‌–2 రిజిస్ట్రేషన్‌/ఫీజు రూ.400 చెల్లింపు: జూలై 23 నుంచి 27 వరకు;
ఫేజ్‌ –2 వెబ్‌ ఆఫ్షన్స్‌: జూలై 24 నుంచి 29 వరకు;
ఫేజ్‌–3 రిజిస్ట్రేషన్‌/ఫీజు రూ.400 చెల్లింపు: ఆగస్టు 05 నుంచి 10 వరకు;

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in

Tags

Photo Stories