UPSC CAPF(AC) 2023: 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. రాత పరీక్ష, సిలబస్, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- సీఏపీఎస్(ఏసీ) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల
- మొత్తం 322 పోస్ట్‌లకు యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ
- ఏదైనా డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని పలు సాయుధ దళాల్లో..అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల భర్తీకి నిర్వహించే పరీక్ష.. సీఏపీఎఫ్-ఏసీ ఎగ్జామినేషన్! దీని ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 322 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు.
అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)-86 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)-55, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)-91 పోస్టులు, ఇండో-టిబెటిన్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)-60 పోస్టులు, సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ)-30 పోస్టులు.
చదవండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!
అర్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు పురుషులతోపాటు మహిళలు కూడా అర్హులే.
వయసు
ఆగస్ట్ 1, 2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
మూడంచెల ఎంపిక విధానం
యూపీఎస్‌సీ నిర్వహించే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరగుతుంది. అవి..రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,పర్సనాలిటీ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ.
తొలి దశ రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. అవి.. పేపర్-1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్-250 మార్కులు; పేపర్-2 జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ -200 మార్కులు. ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-1కు రెండు గంటలు, పేపర్-2కు మూడు గంటల సమయం లభిస్తుంది. పరీక్ష పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులను తగ్గిస్తారు.
చదవండి: Civils Prelims Guidance
ఆబ్జెక్టివ్ విధానంలో.. పేపర్-1
పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌లో సమకాలీన అంశాలపై అవగాహనతోపాటు జనరల్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం-జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2.. డిస్క్రిప్టివ్ విధానం
పేపర్-2ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో ఎస్సే కొశ్చన్స్ అడుగుతారు. ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్-ఎకు 80 మార్కులు కేటాయించారు. పార్ట్-బి 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి.
రెండో దశలో పీఈటీ
మొదటి దశ రాత పరీక్ష పేపర్-1, 2లలో నిర్దేశిత కటాఫ్ సాధించిన అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాలుగు విభాగాల్లో(వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి.
చదవండి: Civils Prelims Study Material
పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లలో పొందిన మార్కులు ఆధారంగా.. నిర్దేశిత కటాఫ్‌లను అనుసరించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 150 మార్కులు కేటాయించారు.
గెజిటెడ్ కొలువు
మూడు దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థులకు.. వారు పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా విభాగాన్ని కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాది పాటు ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే గ్రూప్-ఎ గెజిటెడ్ హోదాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా శాశ్వత కొలువు సొంతమవుతుంది.
సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా కెరీర్ ప్రారంభించిన వారు.. భవిష్యత్తులో తాము ఎంపికైన విభాగాల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, ఆపై స్థాయికి చేరుకునే అవకాశముంది. కెరీర్‌లో అత్యంత ప్రతిభా పాటవాలు చూపితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు.
చదవండి: Civils Practice Tests
విజయం సాధించాలంటే
- పేపర్-1: ఈ పేపర్‌లో రాణించేందుకు ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన వస్తుంది. కరెంట్ అఫైర్స్ కోసం ఆర్థిక-రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం, ముఖ్య ఘట్టాలు-వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ-భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
పేపర్-2 ప్రత్యేక వ్యూహం
- డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే పేపర్-2లో రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి..అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో విజయం కోసం ప్రతి రోజు కనీసం రెండు గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు.
60 శాతం మార్కులే లక్ష్యంగా
సీఏపీఎఫ్-ఏసీ పరీక్షకు పోటీ పడే అభ్యర్థులు 60 శాతం మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే.. తుది విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. గత విజేతల స్కోర్‌ను పరిశీలిస్తే.. మొత్తం ఆరు వందల మార్కులకు(రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 150 మార్కులు) జరిగే ఎంపిక ప్రక్రియలో.. 50 శాతం మార్కులు సాధించి, నిర్దేశిత ఫిజికల్ టెస్ట్‌లలో అర్హత సాధించిన వారు విజేతల జాబితాలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: మే 17 నుంచి మే 23 వరకు
- సీఏపీఎఫ్ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 6, 2023
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
- ఆన్‌లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |