సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టండిలా..
ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి.
ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి.
20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు ఇలా..
తెలంగాణలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీ), ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి.
అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్‌మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.
డిగ్రీలో ఏం చేయబోతున్నారు..?
సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు.
కోర్సులు పూర్తయ్యాక వారికి..
దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు..
సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తున్నాం.
–ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
దీనివల్ల డిగ్రీ కోర్సులకు..
సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది.
– గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్