JEE Main 2023: కటాఫ్ అంచనా.. 88-100!
- జేఈఈ-మెయిన్-2023.. ముగిసిన రెండు సెషన్లు
- దాదాపు 10 లక్షల మంది హాజరైనట్లు అంచనా
- జేఈఈ-మెయిన్ 2023 కటాఫ్ అంచనా 88-100
- మెయిన్ స్కోర్‌తో నిట్‌లు, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలు
- ఐఐటీల్లో అడుగు పెట్టాలనుకుంటే అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణత తప్పనిసరి
ఈ ఏడాది రెండు దశలుగా నిర్వహించిన జేఈఈ-మెయిన్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య దాదాపు పది లక్షలుగా ఉంటుందని అంచనా. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన తొలి సెషన్‌కు 8,23,967 మంది హాజరయ్యారు. తాజాగా ఏప్రిల్ 6 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు కూడా దాదాపు ఇదే సంఖ్యలో విద్యార్థులు హాజరైనట్లు అంచనా. వీరిలో తొలి సెషన్‌కు కూడా హాజరైన వారి సంఖ్య 30 నుంచి 40 శాతం మేరకు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు పది లక్షల మందికిపైగా జేఈఈ-మెయిన్ పరీక్షలు రాసినట్లు పేర్కొంటున్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
జనరల్ కటాఫ్ ఎంత?
రెండు సెషన్లుగా, పలు స్లాట్లలో నిర్వహించిన జేఈఈ-మెయిన్-2023కు కటాఫ్ జనరల్ కేటగిరీలో 88-100, ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీలో 74-90, ఎస్‌సీ కేటగిరీలో 54-80; ఎస్‌టీ కేటగిరీలో 45-90 మధ్యలో ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కటాఫ్ శ్రేణుల మధ్యలో నిలుస్తామని భావించే విద్యార్థులు తదుపరి దశలకు సన్నద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ దిశగా
జేఈఈ-మెయిన్ ర్యాంకుతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్‌లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ-మెయిన్ స్కోర్ ఆధారంగా 2.5 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. దీంతో.. జేఈఈ-మెయిన్‌లో కటాఫ్ అంచనాల కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తామనే ధీమా ఉన్న విద్యార్థులు.. అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: JEE Main 2022: తొలి సెషన్‌కు తుది ప్రిపరేషన్.. 90 ప్రశ్నలు - 300 మార్కులు
ఐఐటీలు.. కొందరికే అవకాశం
ఐఐటీలో అడుగు పెట్టే అవకాశం కొద్ది మందికే లభిస్తుంది. ఎందుకంటే.. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తంగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 16,598 మాత్రమే. అంటే.. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మందికి అర్హత కల్పించినా.. ప్రవేశం లభించేది కేవలం 16,598 మందికే! దీంతో మిగతా విద్యార్థులకు నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐలే ప్రధాన గమ్యాలుగా నిలుస్తున్నాయి.
మొత్తం సీట్లు 37,879
- జాతీయ స్థాయిలో 32 ఎన్‌ఐటీ క్యాంపస్‌లలో 23,994 సీట్లు; 26 ట్రిపుల్ ఐటీల్లో 7,126 సీట్లు, సెంట్రల్ యూనివర్సిటీలు సహా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 6,759 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- మొత్తంగా జేఈఈ-మెయిన్ స్కోర్ ఆధారంగా 37, 879 సీట్లు కేటాయిస్తారు.
చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం
ఉమ్మడి కౌన్సెలింగ్ జోసా
- ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు తదితర ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- జేఈఈ-మెయిన్ ర్యాంకర్లకు నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌ఐటీలనే ప్రాథమ్యాలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులు మాత్రం ఐఐటీలతో సహా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లను ప్రాథమ్యాలుగా ఎంచుకోవచ్చు.
- విద్యార్థులు పేర్కొన్న ప్రాథమ్యాలు, ఆయా ఇన్‌స్టిట్యూట్స్, బ్రాంచ్‌లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
- సీట్ పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్దేశిత ఫీజు చెల్లించి.. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలి. నిర్దేశిత తేదీలోపు తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆరు రౌండ్లలో జోసా
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ నిర్వహించే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆరు రౌండ్లలో జరగనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం-జోసా 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభం కానుంది. అభ్యర్థులు అయిదో రౌండ్ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొని స్లైడింగ్ ప్రక్రియకు హాజరవ్వచ్చు.
సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్
జోసా అన్ని దశలు పూర్తయిన తర్వాత కూడా ఎన్‌ఐటీల్లో సీట్లు మిగిలితే.. వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా ఎన్‌ఐటీ ప్లస్ సిస్టమ్ పేరుతో సీఎస్‌ఏబీ(సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్) ఆధ్వర్యంలో ఎన్‌ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా ఇది రెండు దశల్లో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: JEE Main Previous Papers
నిట్‌లు.. హోమ్ స్టేట్ కోటా
- నిట్‌ల్లో హోమ్ స్టేట్ కోటా విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం-నిట్ ఏర్పాటైన రాష్ట్ర విద్యార్థులకు హోమ్ స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు.. నిట్-వరంగల్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇందులో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇలా దేశంలోని మొత్తం 31 నిట్‌లలోనూ ఈ విధానంతో సంబంధిత రాష్ట్రాల విద్యార్థులు సీట్లు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
- తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం రెండు నిట్ క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి..ఎన్‌ఐటీ-వరంగల్ (తెలంగాణ), ఎన్‌ఐటీ-ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లిగూడెం).
- నిట్ క్యాంపస్‌లలో హోమ్ స్టేట్ కోటా అమలవుతున్న నేపథ్యంలో 15 వేల లోపు ర్యాంకుతో విద్యార్థులు తమ సొంత రాష్ట్రంలోని నిట్ క్యాంపస్‌లో సీటు పొందే అవకాశం ఉంది. సీఎస్‌ఈ, ఈసీఈ వంటి క్రేజీ కోర్సుల విషయంలో ఆరు వేల లోపు ర్యాంకుతో సులభంగా సీటు పొందే వీలుంది. అదర్ స్టేట్ కోటాలో సీటు సొంతం చేసుకోవాలంటే.. పదివేల లోపు ర్యాంకుతోనే సాధ్యమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఫీజుల్లోనూ రాయితీ
- గత ఏడాది గణాంకాల ప్రకారం-ప్రతి సెమిస్టర్‌కు రూ.62,500 ఫీజుగా నిర్ణయించారు. ప్రభుత్వ విధానాల ప్రకారం-ఆయా వర్గాల వారికి ట్యూషన్ ఫీజు నుంచి నిర్దేశిత మొత్తాల్లో మినహాయింపు కూడా లభిస్తోంది.
- కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న విద్యార్థులకు, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల కేటగిరీలో ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తున్నారు.
- కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష నుంచి రూ.అయిదు లక్షల లోపు ఉన్న విద్యార్థులకు మొత్తం ట్యూషన్ ఫీజులో మూడింట రెండొంతుల ఫీజును మినహాయిస్తున్నారు.
- ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు మినహాయింపు లభిస్తోంది.
- ఈ మినహాయింపులు కోరుకునే అభ్యర్థులు సంబంధిత ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
Also Read: JEE Main Model Papers
జోసా ప్రక్రియకు సిద్ధంగా
జేఈఈ-మెయిన్ స్కోర్‌తో నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో చేరాలనుకునే వారు..జోసా-2023 ప్రక్రియకు సన్నద్ధమవ్వాలి. ఇందుకోసం.. జోసా ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్; ఫొటో ఐడెంటిటీ కార్డ్; జేఈఈ-మెయిన్ అడ్మిట్ కార్డ్; జేఈఈ-మెయిన్ స్కోర్ కార్డ్; జనన ధ్రువీకరణ పత్రం (పదో తరగతి మార్క్ షీట్); ఇంటర్మీడియెట్ మార్క్ షీట్; మెడికల్ సర్టిఫికెట్; కుల ధ్రువీకరణ పత్రం; ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.