Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు
రాష్ట్రపతి తొలగింపు విధానం– మహాభియోగ తీర్మానం
- ప్రకరణ 61(1)లో రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను పేర్కొన్నారు. దీనినే మహాభియోగ తీర్మానం అంటారు. ఇది ఒక పాక్షిక న్యాయ ప్రక్రియ. ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
- ‘రాజ్యాంగ అతిక్రమణ ’ అనే ఏకైక కారణం వల్ల రాష్ట్రపతిని తొలగించవచ్చు. మహాభియోగ తీర్మాన ప్రక్రియను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అందుకోసం ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యులలో 1/4వంతు సభ్యులు సంతకాలు చేసి, 14రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తరువాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ తరువాత ఆ సభలోని మొత్తం సభ్యులలో(ఖాళీ స్థానాలతో సహా)2/3 వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే,మహాభియోగ ప్రక్రియలో మొదటిదశ పూర్తవుతుంది.
- తరువాత మహాభియోగ తీర్మానం ఇంకో సభకు పంపడం జరుగుతుంది. ఈ దశలో రెండవ సభ స్వయంగాకానీ లేదా కమిటీ ద్వారా గానీ,రాష్ట్రపతి పైన పేర్కొన్న అభియోగాలపై విచారణ జరుపుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి స్వయంగా కానీ, న్యాయవాది ద్వారాగానీ తన వాదన వినిపించవచ్చు. రెండో సభ కూడా మొత్తం సభ్యులలో 2/3 వ వంతు మెజారిటీతో మహాభియోగ తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుండి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.
- మహాభియోగ తీర్మానం ద్వారా ఇంతవరకు ఏ రాష్ట్రపతిని కూడా తొలగించలేదు. ఐతే 1971లో ఆ నాటి రాష్ట్రపతి వి.వి.గిరిపై మహాభియోగ తీర్మానం నోటీస్ ఇచ్చారు. దానిని తర్వాత ఉపసంహరించుకున్నారు.
చదవండి: Indian Polity Notes for Competitive Exams: భారత రాష్ట్రపతి–ఎన్నిక పద్ధతి, అధికార విధులు
మహాభియోగ తీర్మానం– కొన్ని లోపాలు
- రాష్ట్రపతి మీద అభియోగాలు విచారణ దశలో ఉన్నప్పుడు ఆ సమయంలో రాష్ట్రపతి తన పదవిలో కొనసాగవచ్చు.
- రాజ్యాంగ అతిక్రమణ అనే వాక్యానికి సరి అయిన అర్ధాన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు.
- రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని నామినేటెడ్ సభ్యులు కూడా తొలగింపు ప్రక్రియలో పాల్గొనవచ్చు.
- రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే రాష్ట్ర విధాన సభ సభ్యులకు తొలగింపు ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు.
- మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన రాష్ట్రపతి తిరిగి పోటీచేసే విషయంపై స్పష్టత లేదు.
- విధానసభ సభ్యులు రాష్ట్ర్టపతి తొలగింపులో పాల్గొనరు. దీనికి కారణం తొలగింపు విషయంలో ప్రాంతీయ, సంకుచిత రాజకీయాలకు అస్కారం లేకుండా చూడడం.
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
రాష్ట్రపతి పదవి – షరతులు
ప్రకరణ 59ప్రకారం ఈ కింది షరతులు వర్తిస్తాయి.
- పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలో సభ్యుడై ఉండరాదు. ఒకవేళ ఉంటే, ఎన్నికైన రోజునుంచి ఆ సభ్యత్వం రద్దు అవుతుంది.
- ఆదాయం వచ్చే లాభదాయక పదవులలో ఉండరాదు.
- రాష్ట్రపతి జీత భత్యాలు, పెన్షన్ ఇతర సౌకర్యాలకు సంబంధించి పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
రాష్ట్రపతి జీత భత్యాలు
- ప్రకరణ 59 ప్రకారం, రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీటిని ఎట్టి పరిస్థితులలోను తగ్గించడానికి వీలులేదు.
ఎ)ప్రస్తుతం రాష్ట్రపతికి వేతనం నెలకు రూ.5,00,000 (గతంలో 1,50,000 ఉండేది)
బి) ఉచిత నివాసం
సి) పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం
డి) ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
అలాగే రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి.
భారతదేశంలోను, విదేశాలలోను పర్యటించినప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు. అలాగే ప్రకరణ 361 ప్రకారం, రాష్ట్రపతి ఏ న్యాయస్థానానికీ జవాబుదారి కాడు. ఇతని పదవీకాలంలోని చర్యలకు ఏ న్యాయస్థానంలోను దావా వేయరాదు. రాష్ట్రపతికి సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి.
చదవండి: Polity Study Material for Group 1 & 2: భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ..
రాష్ట్రపతి అధికారాలు – విధులు
రాష్ట్రపతి భారత గణతంత్ర రాజ్యాధినేత, దేశ మొదటి పౌరుడు. 53వ ప్రకరణ ప్రకారం, కేంద్ర కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అతడు ఈ అధికారాలను రాజ్యాంగం ప్రకారం స్వయంగా కానీ, తన కింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిర్వహించే సమస్త అధికారాలు కార్యనిర్వాహణాధికారం అనే భావనలోనే ఉంటాయని జె.సి. జోహారి పేర్కొన్నారు. అంటే సాధారణంగా చర్చించే వివిధ అధికారాలైన కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయాధికారాలు కార్యనిర్వహణాధికారం అనే భావనలోనే ఉంటాయని పేర్కొనవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడా రాష్ట్రపతి అధికారాలను వివిధ రకాలుగా వర్గీకరించడం జరగలేదు. కాని సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.
1. సాధారణ అధికారాలు – విధులు
2. అసాధారణ అధికారాలు
సాధారణ అధికారాలు
సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిర్వహించే విధులను సాధారణ అధికారాలని అనవచ్చు. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.
కార్యనిర్వహణాధికారాలు
రాష్ట్రపతి భారత గణతంత్రానికి ప్రధాన కార్యనిర్వహణాధిపతి. ప్రకరణ 74(1) ప్రకారం, ప్రధానమంత్రి అధ్యక్షతనగల కేంద్రమంత్రి మండలి సలహా, సహాయాలతో రాష్ట్రపతి తన విధులను నిర్వహిస్తారు. తన క్రింది అధికారుల ద్వారా రాజ్యాంగం ప్రకారం అధికార నిర్వహణ చేయాలని 53వ ప్రకరణ తెలుపుతుంది.
ప్రకరణ 77 ప్రకారం, కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదే ప్రకటించాలి. రాష్ట్రపతి ఈ కార్య నిర్వహణాధికారం నిర్వహించడానికి అనేక నియామకాలు చేస్తాడు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం వారిని తొలగిస్తాడు. కార్యనిర్వహణాధికారాలను కింది విధంగా పేర్కొనవచ్చు.
- మంత్రిమండలి నియామకం ప్రకరణ (75)
- ప్రధానమంత్రి నియామకం ప్రకరణ 75(1)
- అటార్నీ జనరల్ నియామకం ప్రకరణ 76(1)
- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం ప్రకరణ (124)
- రాష్ట్ర గవర్నర్ల నియామకం ప్రకరణ (155)
- కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నియామకం ప్రకరణ (148)
- రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం ప్రకరణ (217)
- కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్‌లను మరియు పరిపాలకులను నియమిస్తారు మరియు నేరుగా పరిపాలిస్తారు ప్రకరణ(239)
- కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులను, మంత్రిమండలిని నియమిస్తారు
- అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు ప్రకరణ (263)
- ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ప్రకరణ (280)
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (316)
- ప్రధాన ఎన్నికల కమీషనర్, ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం ప్రకరణ (324(2))
- షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (338)
- షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (338ఎ)
- ప్రకరణ 78 ప్రకారం, కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని తెలుసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంది.
- ఏదైనా ప్రాంతాన్ని షెడ్యూలు పాంతంగా ప్రకటించవచ్చు
చదవండి: Indian Polity Notes for Groups: రాజ్యాంగ ప్రవేశిక–తాత్విక పునాదులు
శాసనాధికారాలు–విధులు
ప్రకరణ 79 ప్రకారం, రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. రాష్ట్రపతి పార్లమెంటులో ఏ సభలోను సభ్యుడు కాదు. అయినా అతనికి ఈ క్రింది శాసనాధికారాలున్నాయి.
- పార్లమెంటు ఉభయసభలను సమావేశపరచటం – ప్రకరణ 85(1)
- ఏ సభా సమావేశాన్ని అయినా సమాపనం చేయడం – ప్రకరణ 85(2)
- పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దీనిని పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం–ప్రకరణ 108
- లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం – ప్రకరణ 331 (ప్రస్తుతం వీరి నామినేషన్ రద్దయింది)
- రాజ్యసభకు 12 మంది వివిధ రంగాల నిష్ణాతులను నామినేట్ చేయడం – ప్రకరణ 80(3)
- పార్లమెంటు సభ్యుల అనర్హతలను నిర్ణయించడం – ప్రకరణ 103
- పార్లమెంటు సభలను విడిగాగాని, సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడుగాని ప్రసంగించడం–ప్రకరణ 87
- పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్‌లు జారీచేయడం – ప్రకరణ 123
- లోక్‌సభలో ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెడతారు – ప్రకరణ 117
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ , ఆర్ధిక సంఘం నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపడం – ప్రకరణ (151(1), 323(1), 281)
- లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షుడు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమించడం – ప్రకరణ (95(1), 91(1)
- పార్లమెంటు ఆమోదించిన బిల్లులను చట్టాలుగా కావడానికి ఆమోదం తెలపడం – ప్రకరణ 111
- రాష్ట్ర గవర్నర్ తనకు పంపించిన రాష్ట్ర బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం – ప్రకరణ 201
- రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోద ముద్రవేయడం – ప్రకరణ 368
చదవండి: Indian Polity Notes for Group 1&2: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం
రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టే బిల్లులు
- ప్రకరణ 3: రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అంశాలు
- ప్రకరణ 109: ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలు
- ప్రకరణ 112: బడ్జెట్ ను రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టాలి.
- ప్రకరణ 117: మొదటి రకం ఆర్థిక బిల్లులోని అంశాలు.
- ప్రకరణ 266: రాష్ట్రపతి అనుమతితోనే కేంద్ర సంఘటిత నిధి నుండి ఖర్చు చేయాలి.
- ప్రకరణ 274: రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్న పన్నులు
- ప్రకరణ 304: అంతర్రాష్ట్ర వ్యాపారం, వాణిజ్యం ఇమిడి ఉన్న అంశాలు.
- ప్రకరణ 349: సుప్రీంకోర్ట్, హైకోర్టులలో ఉపయోగించే భాషలకు సంబంధించిన అంశాలు.
రాష్ట్రపతి – ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం (అత్యవసర ఆదేశం)
రాష్ట్రపతికి గల ఆర్డినెన్స్ జారీచేసే అధికారము శాసన అధికారాలలో అంతర్భాగం. ప్రపంచంలో ఏ అధ్యక్షునికీ ఇలాంటి అధికారం లేదు. ఆర్డినెన్స్ జారీ చేసే అంశాన్ని 1935 చట్టం నుండి గ్రహించారు. ప్రకరణ 123 ప్రకారం, పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తే, రాష్ట్రపతి ఆర్డినెన్సు రూపంలో చట్టాలు చేస్తారు.
ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహామేరకే ఆర్డినెన్సును జారీచేస్తారు. ఆ విధంగా జారీచేసిన ఆర్డినెన్సును పార్లమెంటు తిరిగి సమావేశమయిన తరువాత ఆరు వారాల లోపల ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదించిన తరువాత ఆర్డినెన్సు సాధారణ చట్టం అవుతుంది. లేదంటే రద్దవుతుంది. రాష్ట్రపతి మరొక ఆదేశం ద్వారా ఆర్డినెన్సును ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ప్రశ్నించవచ్చు.
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సు జారీచేసే అధికారం పార్లమెంటు శాసనాధికారంతో సమానంగా ఉంటుంది. అనగా పార్లమెంటు ఏ జాబితాలో చట్టాలు చేస్తుందో ఆ అన్ని జాబితాలలోను రాష్ట్రపతి ఆర్డినెన్సు జారీచేయవచ్చు. పార్లమెంటుకు ఉన్న పరిమితులు ఆర్డినెన్స్‌లకు కూడా వర్తిస్తాయి. అయితే అది పార్లమెంటు శాసనాధికారమునకు ప్రత్యామ్నాయం, సమాంతరము కాదు. సహసంబంధ అధికారమే.
- ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్సు జారీ చేయవచ్చు. అలాగే ఒక సభలో ఆమోదం పొంది∙మరో సభలో పరిగణనలో ఉన్న బిల్లు పైన కూడా ఆర్డినెన్సు జారీ చేయవచ్చు. ద్రవ్య బిల్లు విషయంలో కూడా ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. ప్రకరణ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఉండి రాష్ట్ర శాసనసభ సుప్త చేతనావస్థ(తాత్కాలిక రద్దు)లో ఉన్నప్పుడు కూడా ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు.
- ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాలను రూపొందించవచ్చు. అమలులో ఉన్న చట్టాలను రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. ఇది రాష్ట్రపతి విచక్షణ అధికారం కాదు మంత్రిమండలి సలహామేరకే ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కాని ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయడానికి సాధ్యంకాదు.
- ఒక ఆర్డినెన్సు పార్లమెంటు∙ఆమోదం పొంది కూడా గరిష్టంగా ఏడు నెలలు, పదిహేను రోజులు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఒక సమావేశానికి, మరొక సమావేశానికి మధ్య కాలము ఆరు నెలలు, అలాగే పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరువారాలలోపు ఆమోదించవచ్చు అనే నియమం వల్ల, ఒకవేళ పార్లమెంటు సమావేశం ముగిసిన తరువాత ఆర్డినెన్సు జారీ చేసి, తిరిగి సమావేశమైన తరువాత ఆరోవారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు 6 వారాలు, అంటే.. గరిష్టంగా 7బీ నెలలు అవుతుంది. అయితే ఆర్డినెన్స్‌కు కనిష్ట కాలపరిమితి లేదు. దీనిని రాష్ట్రపతి ఎప్పుడయినా రద్దు చేయవచ్చు.
- ఆరు వారాలు గడువు లెక్కించేందుకు ఒక పద్ధతి ఉంది. ఉభయ సభలు వేరు వేరు తేదీలలో సమావేశమైతే ఆలస్యంగా సమావేశమైన సభ తేదీని పరిగణలోకి తీసుకుంటారు. ఉదా : రాజ్యసభ ఆ నెలలో 4వ తేదీన, లోక్‌సభ ఆ నెలలో 6వ తేదీన సమావేశమైతే 6వ తేదీని పరిగణలోకి తీసుకుంటారు. లోక్‌సభ నియమాల ప్రకారం ఆర్డినెన్స్‌ను ఉపసంహరిస్తూ ఆ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఆర్డినెన్స్ జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులను ప్రభుత్వం సభకు తెలియచేయాల్సి ఉంటుంది.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు