Polity Study Material for Group 1 & 2: భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ..
భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్రం, రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ఏర్పరచిన అధికార విభజన సూత్రం ఆధారంగా పని చేస్తాయి. సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది, రాష్ట్రాల ఏర్పాటు, పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలను ఒకటవ భాగంలో ప్రకరణలు 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు.
భారత భూభాగం (Territory of India)
- ప్రకరణ 1–భారత్ లేదా ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్ . ఈ ప్రకరణ ప్రకారం–భారత భూభాగం అంటే.. రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం సముపార్జించుకున్న ఇతర భూభాగాలు ఉంటాయి.
- ‘భారత భూభాగం’ అనే భావన విస్తృతమైనది. ఇది భారత సార్వభౌమాధికారం ఏ విధంగా విస్తరించి ఉంటుందో తెలుపుతుంది. భారత సార్వభౌమాధికారం భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర ప్రాదేశిక జలాలు (Territorial Waters) 12 నాటికల్ మైల్స్ వరకు, విశిష్ట ఆర్థిక మండళ్లు (Exclusive Economic Zones) 200 నాటికల్ మైల్స్ వరకు, అలాగే భారత అంతరిక్ష సరిహద్దులకు కూడా సార్వభౌమాధికారం వర్తిస్తుంది.
Indian Polity Notes for Groups: రాజ్యాంగ ప్రవేశిక–తాత్విక పునాదులు
భారత యూనియన్ (Union of India)
ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రాలు సమాఖ్యలో అంతర్భాగంగా ఉంటూ.. నిర్ణీత అధికారాలను కలిగి ఉంటాయి. ఈ పదం కేంద్ర రాష్ట్ర సంబంధాలను సూచిస్తుంది.
రాష్ట్రాల సమ్మేళనం (Union of States)
- భారత రాజ్యాంగంలో ఒకటవ ప్రకరణలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్ ’ (Union of States)గా పేర్కొన్నారు. సమాఖ్య (Federation) అన్న పదాన్ని ఎక్కడా పేర్కొనలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ‘యూనియన్ ’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
- భారత సమాఖ్య అమెరికాలో జరిగినట్లు రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అలాగే కెనడాలో జరిగినట్లు ఏకకేంద్ర రాజ్యాన్ని సమాఖ్యగా విడగొట్టలేదు. భారత సమాఖ్య ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది.
- భారత సమాఖ్యలో.. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు. కాబట్టి రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేవు.
- అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. ఐతే ఈ హక్కును ఆ తర్వాత రద్దు చేసారు.
- అందుకే భారత సమాఖ్యను ‘విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ ’గా పేర్కొంటారు (Indestructible Union of Destructible States). అలాగే అమెరికాను ‘అవిచ్ఛిన రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్’గా (Indestructible Union of Indestructible States)గా పేర్కొనవచ్చు.
Indian Polity Study Material: భారత రాష్ట్రపతి
ప్రకరణ 2
ఈ ప్రకరణ ప్రకారం–పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొన్ని షరతులతో కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు (Admission or establishment of new states). ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఈ అధికారం పార్లమెంటుకు సంబంధించినదైనా.. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుందని గమనించాలి.
ప్రకరణ 3
ఈ ప్రకరణలో.. ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
ఎ) కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను కలిపి నూతన రాష్ట్రంగా (ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ కలయికతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది) ఏర్పాటు చేయడం. అలాగే రాష్ట్రాన్ని విడగొట్టి.. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం. తాజా ఉదాహరణ.. 2014 జూన్ లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.
బి) రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు.
సి) రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు.
డి) రాష్ట్ర సరిహద్దులను సవరించవచ్చు.
ఇ) రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు.
ప్రకరణ 2, ప్రకరణ 3ల మధ్య తేడా
- ప్రకరణ 2 అనేది భారత యూనియన్ లో లేని భూభాగాలకు వర్తిస్తుంది. ప్రకరణ 3 భారత భూభాగంలోని ప్రాంతాలకు వర్తిస్తుంది. ప్రకరణ 2 కొత్త రాష్ట్రాలను భారత యూనియన్ లో కలుపుకోవడానికి సంబంధించింది. ప్రకరణ 3 అనేది అప్పటికే అమలులో ఉన్న రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించినది.
Also Practice: రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
రాష్ట్రాల ఏర్పాటు–ప్రక్రియ–పద్ధతి
- ప్రకరణ 3లో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది.
- పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలో(లోక్‌సభ, రాజ్యసభ)నైనా ప్రవేశపెట్టవచ్చు.
- సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరతారు.
- ఆ సంబంధిత రాష్ట్ర శాసన సభ.. రాష్ట్రపతి సూచించిన నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని తెలియచేయాలి.
- రాష్ట్ర శాసనసభలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు(అమెరికా,ఆస్ట్రేలియా దేశాలలో రాష్ట్ర శాసనసభల అంగీకారం తప్పనిసరి).
- ఈ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి.
- పార్లమెంటు ఉభయసభలు సంబంధిత బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే.. సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. బిల్లు వీగిపోతుంది.
- రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. పున:పరిశీలనకు అవకాశం లేదు.
- రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. దీనితో ప్రక్రియ పూర్తి అవుతుంది.
- కొత్త రాష్ట్రం ఏర్పాటు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనినే ‘‘అపాయింటెడ్ డేట్’’ అంటారు.
ప్రకరణ 4
ఈ ప్రకరణ–రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ తరువాత సంభవించే పరిణామాల గురించి వివరిస్తుంది. ఉదాహరణకు ప్రత్యేక హోదా, సదుపాయాలు, మినహాయింపులు వంటి వాటిపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ప్రకరణ 2,3 ప్రకారం–ఏదైనా సవరణ చేసినప్పుడు 1,4 షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం–ఏ సవరణ చేసినా.. తదనుగుణంగా 1,4 షెడ్యూల్‌లోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి.
Also Read: ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
భాషా ప్రయుక్త రాష్ట్రాలు–రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి రెండు రకాలైన రాజకీయ భాగాలు ఉండేవి. అవి.. 1) నేరుగా బ్రిటీష్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నవి, 2) బ్రిటీషు సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు(స్వదేశీ సంస్థనాలు).
- ఆ నాటికి దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. బ్రిటీషర్లు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం–549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్ లో విలీనం అయ్యాయి. కాని హైదరాబాద్, జునాఘఢ్, కాశ్మీర్ సంస్థానాలు విలీనాన్ని వ్యతిరేకించాయి. తరువాత కాలంలో కాశ్మీర్, భారత్‌లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగం అయింది.
- జునాగఢ్ ప్రజాభిప్రాయం ద్వారా భారత్‌లో కలిసిపోయింది. ఆ విధంగా ప్రజాభిప్రాయం ద్వారా కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే.
- హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య (లేదా సైనిక చర్య) ద్వారా విలీనం చేయడం జరిగింది.
- 1950 నాటికి రాజ్యాంగం ప్రకారం–నాలుగు రకాలైన రాష్ట్రాలు అమలులో ఉండేవి. వీటిని పార్ట్–ఎ, పార్ట్–బి, పార్ట్–సి, పార్ట్–డిగా వర్గీకరించారు. పార్ట్–ఎలో బ్రిటీష్ పాలిత గవర్నర్ ప్రావిన్స్‌లు ఉండేవి. వీటి సంఖ్య 9. పార్ట్–బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వీటి సంఖ్య 9. పార్ట్–సిలో చీఫ్ కమీషనర్ ప్రాంతాలు ఉండేవి. వీటి సంఖ్య 10. పార్ట్–డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ–ఫజల్ అలీ కమీషన్ (States Reorganisation Commission [SRC])
భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కావడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండు గట్టిగా వినిపించింది. ఈ డిమాండుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ (అనాటి ఒరిస్సా గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో(కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎం.కుంజ్రు) రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ 1955 అక్టోబర్‌లో తన నివేదికను సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సమర్థించినప్పటికీ.. ‘ఒక భాష, ఒక రాష్ట్రం’ అనే డిమాండును తిరస్కరించింది. ఫజల్ అలీ కమిషన్ పలు ప్రతి పాదనలు చేసింది. అవి..
- రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలి.
- భాష,సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
- ఆర్థిక,పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- జాతీయ అభివృద్ధితోపాటు రాష్ట్రాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
- దీనికనుగుణంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని, 7వ రాజ్యాంగ సవరణను చేసి,అంతకుముందు ఉన్న పార్ట్–ఎ, పార్ట్–బి,పార్ట్–సిఅనే వ్యత్యాసాలను రద్దుచేసి.. రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు,6కేంద్రపాలిత ప్రాంతాలతో కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చింది.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు