Skip to main content

Indian Polity Notes for Group 1&2: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం

indian polity study material for competitive exams
indian polity study material for competitive exams

సవరణ అర్థం

సవరణ అంటే.. కొత్త ప్రకరణలను చేర్చడం (Insertion), ప్రకరణ తొలగించడం (Repeal), పూర్తిగా తొలగించడం (omission), మార్పులు చేయడం. ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మరొక అంశాన్ని చేర్చడం (Substitute) తదితర అంశాలన్నింటినీ సవరణగానే (Amendment) పరిగణిస్తారు. రాజ్యాంగ సవరణ అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు.

సవరణ పద్ధతులు–రాజ్యాంగ స్థానం

రాజ్యాంగంలోని 20వ భాగం,ప్రకరణ 368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపరిచారు. రాజ్యాంగ సవరణకు మూడు ప్రత్యేక పద్ధతులను నిర్దేశించారు. అవి..

  1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Simple Majority)
  2. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Special Majority)
  3. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతోపాటు సగానికి కంటే ఎక్కువ రాష్ట్ర శాసన సభల ఆమోదం (States ratification)ద్వారా జరిగే సవరణ పద్ధతి.
  • ప్రత్యేక వివరణ: మౌలిక రాజ్యాంగంలో ప్రకరణ 368లో రాజ్యాంగాన్ని ‘సవరించే ప్రక్రియ’ అని పేర్కొనడం జరిగింది (Procedure for Ame-ndment of Constitution). కానీ,1971లో 24 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదబం«ధాన్ని ‘రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారంగా’(Power to amend constitution and procedure there of)మార్పులు చేసారు.

Polity Study Material for Group 1 & 2: భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ..

ప్రకరణ 368

  • ప్రకరణ 368లోని అంశాలను ఇప్పటివరకు రెండుసార్లు సవరించారు. అవి.. 24వ రాజ్యాంగ సవరణ(1971),42వ రాజ్యాంగ సవరణ(1976). ప్రకరణ 368లో ఐదు సబ్‌ క్లాజులు ఉన్నాయి. అవి..
    1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారం.
    2. ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలు.
    3. ప్రకరణ 13లో పేర్కొన్న ‘చట్టం’ నిర్వచన పరిధిలోని అంశాలు.. రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.
    4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను(ప్రాథమిక హక్కులతో సహా).. రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించటానికి వీలులేదు.
    5. సవరణ అధికారాల్లో మార్పులు, కూర్పులు, రద్దులు చేసే అంశంలో పార్లమెంటుకు ఏ వి«దమైన ఆంక్షలు వర్తించవు.
  • ప్రత్యేక వివరణ: క్లాజు 4–5లోని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే, ఈ క్లాజులు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని.. 1980లో మినర్వామిల్స్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

సాధారణ మెజారిటీ పద్ధతి

  • ఈ పద్ధతి ప్రకారం–సాధారణ మెజారిటీ ద్వారా కొన్ని ప్రకరణలను పార్లమెంటు సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో.. అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు సవరించేందుకు వీలుంది. సాధారణ మెజారిటీ అంటే.. హాజరై ఓటువేసిన వారిలో సగానికంటె ఎక్కువమంది ఉండాలి.
  • ప్రత్యేక వివరణ–విశ్లేషణ: సాధారణ మెజారిటీ పద్ధతి గురించి ప్రకరణ 368లో ప్రస్తావించలేదు. అందుకే సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు.అంటే..ఈ కింది అంశాలు ప్రకరణ 368లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు.

Indian Polity Notes for Groups: రాజ్యాంగ ప్రవేశిక–తాత్విక పునాదులు

ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు

  • కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు (ప్రకరణ 1–4).
  • రాష్ట్ర ఎగువ సభ (విధాన పరిషత్‌) ఏర్పాటు, రద్దు(ప్రకరణ 169).
  • భారత పౌరసత్వంలో మార్పులు(ప్రకరణ 5–11).
  • పార్లమెంటులో కోరం(ప్రకరణ 100).
  • రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యాలు(ప్రకరణ 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221).
  • పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసన సభ్యుల సాధికారాలు(ప్రకరణ 105, 106).
  • సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు(ప్రకరణ 139).
  • కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన(ప్రకరణ 239)
  • నియోజకవర్గాల పునర్విభజన(ప్రకరణ 82).
  • పార్లమెంటులో ఉపయోగించే భాష (ప్రకరణ 120).
  • ఐదవ షెడ్యూల్, ఆరవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు.
  • సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం (ప్రకరణ124).
  • అధికార భాషల వాడకం.

Indian Polity Study Material: భారత రాష్ట్రపతి

ప్రత్యేక మెజారిటీ ద్వారా

ప్రకరణ 368 ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ పద్ధతిని వివరిస్తుంది. రాజ్యాంగంలో అత్యధిక భాగాలు ఈ పద్ధతి ద్వారానే సవరించడం జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు మంది సభ్యులు ఆమోదించాలి. ఇది మొత్తం సభ్యులలో సగానికంటే తగ్గరాదు. ఈ పద్ధతి ద్వారా ఈ క్రింది అంశాలు సవరిస్తారు. అవి..
ఎ)    భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు (ప్రకరణ 12–35)
బి)    భారత రాజ్యాంగంలో నాల్గవ భాగంలో పేర్కొన్న నిర్దేశిక నియమాలు(ప్రకరణ 36–51)
సి)    మొదటి పద్ధతిలోను, మూడో పద్ధతిలోను పేర్కొనని ఇతర అన్ని అంశాలు.

ప్రత్యేక మెజారిటీ, రాష్ట్ర శాసనసభల ఆమోదం

ఈ పద్ధతిలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తరువాత.. ఆ రాజ్యాంగ సవరణ బిల్లును సగానికి తగ్గకుండా రాష్ట్ర శాసన సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది(ఖాళీలు, గైర్హాజరు అయిన సభ్యులతో కలుపుకుని). రాష్ట్రాల ఆమోదానికి నిర్ణీత సమయం అంటూ ఏదీ ఉండదు. రాష్ట్రపతి నిర్ణయించిన గడువు లోపల రాష్ట్ర శాసన సభ తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఈ పద్ధతి ద్వారా సవరించబడే అంశాలు..

  • రాష్ట్రపతి ఎన్నిక విధానం(ప్రకరణ 54, 55).
  • కేంద్ర కార్యనిర్వాహక పరిధిని విస్తృతపరచడం (ప్రకరణ 73).
  • రాష్ట్ర కార్యనిర్వాహక పరిధిని విస్తృతపరచడం (ప్రకరణ 162).
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన అధికారాల విభజన 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు (ప్రకరణలు 241, 246 పార్ట్‌ 21).
  • రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం (ప్రకరణ 80, 81)
  • సుప్రీంకోర్టు (పార్ట్‌5),హైకోర్టు (పార్ట్‌6) సంబంధించిన విషయాలు(ప్రకరణ 124, 214)
  • రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368).

APPSC Groups Practice Tests

రాజ్యాంగ సవరణ పద్ధతి–నిబంధనలు

  • రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో, ప్రకరణ 368లో పేర్కొన్న విధంగా క్రింది నియమాలను పాటించాలి.
  • రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. –రాష్ట్రం శాసన సభలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం లేదు.
  • రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రికాని, సాధారణ సభ్యుడుగాని ప్రతిపాదించవచ్చు.
  • రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.
  • రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు.. నిర్ణీత మెజారిటీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే, ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. కాబట్టి బిల్లు వీగిపోతుంది.
  • సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.
  • పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన తరువాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపుతారు. రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి.తిరస్కరించ డంగానీ,పునఃపరిశీలనకు గానీ అవకాశం లేదు.
  • గమనిక: రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నిబంధనను 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
  • రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమలులోకి వచ్చినరోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లుగా పరిగణిస్తారు.
  • రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది స్వయం నిర్దేశిత పద్ధతి (ట్ఛ జఛిౌn్ట్చజీn్ఛఛీ pటౌఛ్ఛిఛీuట్ఛ). ప్రకరణలో పేర్కొన్న సాధారణ చట్ట సవరణ పద్ధతికి పోలిక లేదు.
  • రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది.
  • ద్రవ్యబిల్లులోని (ప్రకరణ 110) అంశాలు రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్నప్పటికీ.. దానిని రాజ్యాంగ సవరణ బిల్లుగానే పరిగణిస్తారు. ప్రకరణ 368, ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లులలోని అంశాలను అధిగమిస్తుంది.

krishna reddy –బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

APPSC & TSPSC Guidance

ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌


APPSC Group 1&2 Previous Papers

Published date : 16 Jun 2022 07:19PM

Photo Stories