Skip to main content

YSR Kalyanamasthu: లబ్ధిదారుల ఖాతాల్లో 38 కోట్ల జమ... మన పిల్లలు ఎక్కడికి వెళ్లినా గెలవగలగాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, ఎడ్యుకేషన్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్‌ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందనుంది.
YS Jagan Mohan Reddy

ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. 
ప్రతీ ఏడాది అమలు చేస్తాం
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబరు–డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చాం. ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి ఈరోజు నేరుగా వారికి నగదు జమచేస్తున్నాం. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలుచేస్తున్నాం. ప్రతి సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. 
చదువులతోనే తలరాతలు మారతాయి
గొప్ప చదువులతోనే పేదల రాతలు మారతాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. డ్రాపౌట్‌ రేటు తగ్గించడమే లక్ష్యంగా పథకం అమలు అవుతోంది. ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లుగా నిర్దేశించాం. 
అమ్మాయిలు చదువుకోవాలి
పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ, చదువులు ఆగిపోకూడదు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నాం. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. 
వివక్షతకు తావులేకుండా పథకాలు....
లంచాలు, వివక్షతకు తావులేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలవుతోంది. గత ప్రభుత్వం బీసీల కులాంతర వివాహాలకు రూ.50 వేలు ప్రకటిస్తే.. మన ప్రభుత్వం రూ.75 వేలు అందిస్తోంది. మైనారీలకు వాళ్లు రూ.50 వేలు ప్రకటిస్తే మనం లక్ష రూపాయలు ఇస్తున్నాం. 

భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20 వేలు అయితే, ఇప్పుడు రూ.40 వేలు ఇస్తున్నాం. గతంలో వికలాంగులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి వారిని మోసం చేస్తే మన ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకుని లక్ష 50వేల రూపాయలు అందిస్తోంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు పెళ్లిలు అయిన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

Published date : 10 Feb 2023 06:46PM

Photo Stories