Insurance: విపత్తుల్లోనూ బీమా ధీమా!.. వాహన, హోమ్ ఇన్సూరెన్స్‌తో పూర్తి రక్షణ
కాంప్రహెన్సివ్...
మోటారు బీమా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సమగ్ర కవరేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సొంత వాహనానికి నష్టం జరిగితే పరిహారం రావాలంటే సమగ్ర కవరేజీ ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వల్ల తమ వాహనాలకు జరిగే నష్టానికి కాంప్రహెన్సివ్ పాలసీలోనే పరిహారం లభిస్తుంది. అలాగే, వాహనం చోరీ, ప్రమాదంలో నష్టం, అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టానికి పరిహారం కోరొచ్చు. వరదల వల్ల కార్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కారు విలువ కూడా పడిపోతుంది. ఖరీదైన రీపేర్లు అవసరం పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసినా దెబ్బతిన్న కారు బాగు కాకపోవచ్చు. సమగ్ర కారు బీమా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వెనుకాడొద్దని.. ఇలాంటి ఊహించని నష్టాలను గట్టెక్కడానికి ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్రహెన్సివ్ ప్లాన్లలో మళ్లీ ఇంజన్, గేర్ బాక్స్‌కు ఎక్కువ కంపెనీలు కవరేజీ ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో విడిగా యాడాన్ కవరేజీలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయా అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Small Finance Bankల్లో... డిపాజిట్ భద్రమేనా?
ఇంజన్ ప్రొటెక్షన్ కవర్:
కారు ఇంజన్ వాడకపోయినా పాడవుతుంది. వరద నీటి కారణంగానూ దెబ్బతింటుంది. ఇంజన్‌ను పూర్తిగా మార్చేయాలన్నా లేక ఇంజన్‌లో విడిభాగాలను మార్చాలన్నా అలాంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అక్కరకు వస్తుంది.
రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్: వరద నీరు కారణంగా రిపేర్ చేయడానికి వీలు లేకుండా కారు దెబ్బతింటే లేదా కారు చోరీకి గురైనా.. రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్ ఉన్న వారు కారు కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని (బిల్లులో ఉన్న మేర) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also read: Netanna Bima : ఆగస్టు 7 నుంచి ప్రారంభం
జీరో డిప్రీసియేషన్ కవర్:
వాడుకలో కాలం గడిచే కొద్దీ వాహనం, అందులోని విడిభాగాల విలువ తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల నుంచి క్లెయిమ్ వస్తే, బీమా కంపెనీలు తరిగిపోయిన విలువ మినహాయించి, మిగిలిన మేరే చెల్లిస్తాయి. కానీ, జీరో డిప్రీసియేషన్ కవర్ తీసుకుంటే ఇలాంటి కోతలు ఏవీ లేకుండా బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి.
ఇతర కవరేజీలు: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్, ఇంజన్ ఆయిల్, గ్రీజ్ తదితర వాటికి చెల్లింపులు చేసే కన్జ్యూమబుల్ కవర్, రోడ్డు సైడ్ అసిస్టెన్స్ అందించే కవర్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also read: Motor Floater Policy: ఒకటికి మించిన వాహనాలకు ఒకే బీమా ప్లాన్
క్లెయిమ్ దాఖలు ఎలా...
వరదల వల్ల కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ నీటిలో మునిగిపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, స్టార్ట్ చేసినా కానీ, అవి ఆన్ కాకపోవచ్చు. కానీ, వాహనాన్ని కదిలించినట్టయితే మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాహనదారు చర్యలతో మరింత నష్టం జరిగితే బీమా సంస్థ నుంచి తిరస్కారం ఎదురుకావచ్చు. దీనికి బదులు బీమా సంస్థకు వాస్తవ సమాచారాన్ని తెలియజేయడమే మంచి నిర్ణయం అవుతుంది. తమ వాహనానికి జరిగిన నష్టాన్ని తేల్చాలని కోరొచ్చు. దాంతో బీమా సంస్థ సర్వేయర్‌ను, మెకానిక్‌ను సంఘటన స్థలానికి పంపిస్తుంది. వరదనీరు తగ్గిపోయిన తర్వాత వారు వచ్చి జరిగిన నష్టంపై అంచనాకు వస్తారు. లేదంటే వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్‌కు తరలిస్తారు. అనంతరం ఇంజన్‌ను తనిఖీ చేయడం, ఇంజన్ ఫ్లషింగ్, క్లీనింగ్ చేయించొచ్చు. ఇంజన్‌కు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే నష్టాన్ని వాహనదారుడే మోయాల్సి వస్తుంది. అందుకనే వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని స్టార్ట్ చేయడానికి బదులు టోయింగ్ వ్యాన్‌తో తరలించి, నష్టాన్ని మదింపు చేయించడమే సరైనది అవుతుంది. బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో జాప్యం లేకుండా జాగ్రత్తపడాలి. బెంగళూరులో వరదల వల్ల వస్తున్న క్లెయిమ్‌లలో 80 శాతం విడిభాగాలకు నష్టానికి సంబంధించినవి అయితే, మరో 20 శాతం పూర్తి డ్యామేజీ క్లెయిమ్‌లు ఉంటున్నట్టు బీమా సంస్థలు తెలిపాయి.
Also read: PMJJBY: పీఎం జీవన్ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు
హోమ్ ఇన్సూరెన్స్ సంగతేంటి?
సొంతిల్లు పట్ల ఎంతో మమకారం ఉంటుంది. ఈ రోజుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే కానీ సొంతిల్లు సమకూరడం లేదు. అంతటి విలువైన ఇంటికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ముంబై, చెన్నై, ఇప్పుడు బెంగళూరు నగరాలు వరద ముప్పును ఏ స్థాయిలో ఎదుర్కొన్నదీ చూశాం. కనుక విలువైన ఇంటికి, ఇంట్లోని విలువైన సామగ్రికి బీమా రక్షణ తీసుకోవడం ఎంతో లాభం. ఇంటి యజమానులే అని కాదు, అద్దెకు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అద్దెకు ఉండే వారు ఇంట్లోని వాటికి మాత్రమే కవరేజీ తీసుకుంటే చాలు. అదే ఇంటి యజమాని అన్ని రకాల కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉండే రిస్క్ ల గురించి పూర్తి అవగాహనతో ఉంటే, ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తేల్చుకోవచ్చు. ప్రకృతి విపత్తులు (అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం) లేదా ప్రమాదవశాత్తూ వాటిల్లిన నష్టాలకు సైతం కవరేజీ లభిస్తుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే వారికే ఇది అవసరం అనుకోవద్దు. ఎత్తయిన అపార్ట్‌మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారికీ హోమ్ ఇన్సూరెన్స్ ఎన్నో రూపాల్లో ఆదుకుంటుంది. ఇంటి విలువ, ఇంట్లోని వస్తువువల విలువ ఆధారంగానే ప్రీమియం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది.
Also read: National Logistics Policy 2022: దేశంలో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం.. 5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
ప్రయోజనాలు..
హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణానికి వాటిల్లే నష్టానికే పరిహారం అనుకోకండి. గ్యారేజ్, కాంపౌండ్, ఫెన్సింగ్‌కు నష్టం ఎదురైనా కవరేజీ లభిస్తుంది. బేస్ పాలసీలకి యాడాన్‌గా, ఫర్నిచర్, ఎల్రక్టానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోని ఆభరణాలు, నగదుకు కూడా రక్షణనిచ్చే కవరేజీలు ఉన్నాయి. లేదంటే సమగ్ర బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఏ రూపంలో దేనికి నష్టం వాటిల్లినా పరిహారం అందుతుంది. ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే, వాటి రీపేర్‌కు అయ్యేంత కాకుండా.. వాస్తవ విలువ మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా బీమా రక్షణ కల్పించుకోవడం ద్వారా భూకంపాలు, వరదల వంటి భారీ నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దొంగలు పడి విలువైన సొత్తు ఎత్తుకుపోయినా, ఈ ప్లాన్‌లో కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందుబాటులోనే ఉంటుంది. రూ.2,000 ప్రీమియంకే కవరేజీనిచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, దోపిడీల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోని వారు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ ఇంటి కారణంగా ఎదురయ్యే న్యాయ వివాదాల్లోనూ రక్షణనిస్తుంది. ఎలా అంటే.. ఇంట్లో పనిచేసే వారు మరణించినా పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అగ్ని ప్రమాదాల వల్ల ఇతర ప్రాపర్టీకి నష్టానికి కారణమైనా, అతిథులు కానీ, ఇతర వ్యక్తుల మరణానికి దారితీసినా కవరేజీ లభిస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి..
- హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇంట్లో ఉన్న అన్నింటికీ ఆధారాలు ఉంచుకోవాలి. లేదంటే క్లెయిమ్ సమయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.
- అనధికారిక కట్టడం అయితే బీమా కవరేజీ ల భించదు. చట్టబద్ధమైన నిర్మాణాలు, చట్టపరమై న అనుమతులు ఉన్న వాటికే కవరేజీ లభిస్తుంది.
- ఇంట్లో అద్దెకు ఉండే వారు, తమ నివాసంలోని విలువైన అన్ని ఉత్పత్తులకు కవరేజీ తీసుకోవచ్చు.
- వరదల సమయంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉత్పత్తులన్నింటికీ కరెంట్ కరెక్షన్ తొలగించాలి (అన్ ప్లగ్ చేయాలి). ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కూడా తొలగించాలి.
- వరద ముప్పు నుంచి తప్పించుకోవడానికి తమ వంతు ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. నిర్మా ణ సమయంలోనే ఇంటి బేస్‌మెంట్‌ను రోడ్డు నుంచి వీలైన మేర ఎత్తున నిర్మించుకోవాలి.
- సీవరేజీ పైపులకు చెక్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలి. వరదల సమయంలో బయటి నీరు సీవరేజీ పైపుల నుంచి మీ ఇంటిని ముంచెత్తకుండా చెక్‌వాల్వ్‌లు సాయపడతాయి.
- వరద నీరు ఇంట్లోకి చేరుతుందని గుర్తించిన వెంటనే విలువైన వస్తువులను ఎత్తయిన ప్రదేశానికి చేర్చాలి. లేదంటే దిగువ అంతస్తుల్లోని వారు ఎగువ అంతుస్తులోని వారి సాయం కోరి పై అంతస్తులకు తరలించాలి.
- ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్లను, నగలను ముందుగా తీసేసి జాగ్రత్త పరుచుకోవాలి.
- కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణం చేసుకున్న వారు మేడపైకి వాటిని తరలించొచ్చు. వరద నీరు మరింత పైకి చేరుతుందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి.
- వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అమలు చేసే విధంగా ముందస్తు కార్యాచరణ దగ్గర ఉంచుకోవాలి.