Skip to main content

ఫండింగ్ ఏజెన్సీలను మెప్పించటమే ప్రధానం

‘స్టార్టప్ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నా.. ఆయా సంస్థలను మెప్పించటంలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని లీడ్ ఏంజెల్స్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి తెలిపారు. స్టార్టప్ సంస్థల మెంటారింగ్‌లో ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థగా పేరొందిన లీడ్ ఏంజెల్స్ సంస్థకు దక్షిణ భారత హెడ్‌గా నియమితులైన వినుత రాళ్లపల్లితో ఈ వారం గెస్ట్ కాలం..
ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా స్టార్టప్స్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఈ స్టార్టప్స్ ఆలోచనకు అకడమిక్ స్థాయిలోనే పునాది పడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు.

అవకాశాల సద్వినియోగం
యువతలో బిజినెస్ ఆలోచనలు ఉన్నప్పటికీ, ఆచరణ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మెంటార్స్ ఎంపిక, తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వేదికలపై అవగాహన లేకపోవటం వంటివి కారణాలుగా పేర్కొనవచ్చు. ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సంస్థలను, స్టార్టప్ ఔత్సాహికులను ఒకే వేదికపై తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాంటి సదుపాయాలు మరింత విస్తృతం అయ్యేలా కళాశాలల యాజమాన్యాలు వ్యవహరించాలి. ఐఐటీలు, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్లు ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి.

ఫండింగ్‌పై ఆందోళన అనవసరం
ఔత్సాహికులు తమ బిజినెస్ ఐడియాలను కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే టాటా, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, నాస్కామ్ వంటి ప్రముఖ సంస్థలు.. స్టార్టప్ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కొన్ని సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఔత్సాహికులు వీటిపై అవగాహన పెంచుకొని, అన్వేషణ సాగిస్తే సులువుగా తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు.

ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో సవివరంగా..
సీడ్ ఫండింగ్ ఏజెన్సీలను మెప్పించే విధంగా వ్యవహరించలేకపోవటం వల్ల మంచి ఐడియాలు ఉన్నా నిధుల సమీకరణలో ఔత్సాహికులు విఫలమవుతున్నారు. వ్యాపార పరంగా తమ ఐడియాలు ఎలా మెరుగైనవి? వాటి ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలు వంటి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో సిద్ధం చేసుకోవాలి. బిజినెస్ ఐడియా నుంచి ఎగ్జిట్ పాలసీ వరకు అన్నిటినీ అందులో వివరించాలి.

వేదికలు ఎన్నెన్నో..
స్టార్టప్ ఔత్సాహికులను, సీడ్ ఫండింగ్ సంస్థలు/వ్యక్తులను ఒకచోట కలిపే ఎన్నో వేదికలు ఉన్నాయి. నాస్కామ్ 10000 స్టార్టప్ ఇనీషియేటివ్, టై - ఆగస్ట్ ఫెస్ట్, ఐఎస్‌బీ నిర్వహించే ఐడియా పోటీలు వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు లభిస్తాయి. ఇలాంటి ఉమ్మడి వేదికలు, పోటీల్లో తమ ఐడియాలు వివరించేందుకు ఔత్సాహికులకు 5 నుంచి 10 నిమిషాల్లోపే సమయం ఉంటుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే తాము ఎంపిక చేసుకున్న బిజినెస్, కనీసం 5 ఏళ్ల వ్యవధికి తమ లక్ష్యాల గురించి వివరించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. స్టార్టప్ ఔత్సాహికులకు సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు ఆర్థిక తోడ్పాటుతోపాటు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలపై సలహాలు అందిస్తూ మార్గనిర్దేశం కూడా చేస్తున్నాయి.

మహిళల సంఖ్య పెరగాలి
స్టార్టప్ సంస్కృతి పెరుగుతున్నప్పటికీ, మహిళా ఔత్సాహికుల సంఖ్య తక్కువగానే ఉంది. మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఫిక్కీ, సీఐఐ తదితర సంస్థల మహిళా విభాగాలు కృషి చేస్తున్నాయి. ఔత్సాహిక మహిళలు వీటి గురించి తెలుసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ స్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొని ముందడుగు వేయాలి.

అవగాహన పెంచుకోవాలి
బిజినెస్‌కు సంబంధించి ఆలోచన, ఆచరణ, వ్యూహం వంటి ప్రధాన లక్షణాలు స్టార్టప్ ఔత్సాహికుల్లో ఉండాలి. అకడమిక్ సమయంలోనే సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను లక్ష్యంగా ఎంచుకుంటే, తమ బిజినెస్ ఆలోచనలకు అనుగుణమైన సంస్థలు ప్రస్తుతం మార్కెట్లో రాణిస్తున్న తీరును గమనించాలి. తాము కోర్సు పూర్తి చేసుకునే సమయానికి తమ బిజినెస్ ఐడియా మార్కెట్‌పై అవగాహనతో అడుగులు వేస్తే సత్ఫలితాలు లభిస్తాయి!

ఆల్ ది బెస్ట్!!
Published date : 07 Nov 2015 01:03PM

Photo Stories