Skip to main content

ఫీజు పెంపు ఉన్నట్టా? లేనట్టా?

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత కొరవడింది.
telangana engineering college fees details
ఫీజు పెంపు ఉన్నట్టా? లేనట్టా?

పాత ఫీజులే ఈ సంవత్సరమూ అమల్లో ఉంటాయని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ ఎఫ్‌ఆర్‌సీ) తెలిపింది. కానీ ఇటీవల తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇందుకు భిన్నంగా మాట్లాడారు. ఫీజుల పెంపును కమిటీ పరిశీలిస్తుందని ఆమె చెబుతూ, 2022 ఫీజుల పెంపు నిలిపివేత ప్రతిపాదనేమీ ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. దీంతో ఫీజుల విషయంలో గందరగోళం నెలకొంది. 

చదవండి: College Fees: ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఫీజులుండాలి

విద్యార్థి సంఘాల ఒత్తిడితో వెనక్కి 

ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ ప్రతి మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకు అమలులో ఉన్నాయి. దీంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులపై ఎఫ్‌ఆర్‌సీ కసరత్తు చేపట్టింది. కనిష్ట ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలకు, గరిష్ట ఫీజును రూ.1.40 లక్షల నుంచి రూ.1.73 లక్షలకు పెంచేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించింది. అయితే రెండేళ్ల కోవిడ్‌ నేపథ్యంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో అధిక ఫీజులు భరించేందుకు సిద్ధంగా లేరని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఫీజులు పెంచితే ఆందోళనలు తప్పవని స్పష్టం చేయడంతో, ఈ ఏడాదికి పాత ఫీజులే కొనసాగుతాయని ఎఫ్‌ఆర్‌సీ తెలిపింది. 

చదవండి: ఆ విద్యార్థులు 10 పూర్తిచేసే వరకు ఫీజు చెల్లించండి

ప్రైవేటు కాలేజీల అసంతృప్తి 

ఫీజులు పెంచకూడదని ఎఫ్‌ఆర్‌సీ తీసుకున్న నిర్ణయంపై ప్రైవేటు కాలేజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూడేళ్ళకోసారి ఫీజులు పెంచాల్సిందేనని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో కాలేజీల్లో నిర్వహణ వ్యయం పెరిగిందంటూ ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను కలిసి విజ్ఞప్తి కూడా చేసినట్లు సమాచారం. మరోపక్క ప్రభుత్వం ఫీజుల పెంపును నిలిపివేస్తే కోర్టుకెళ్ళేందుకు కొన్ని యాజమాన్యాలు సిద్ధపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో ఫీజులపై స్పష్టత కొరవడింది. 

చదవండి: జేఎన్‌టీయూహెచ్‌లో ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌

ఫీజు ఎంతో తెలియకపోతే ఎలా? 

జేఎన్‌టీయూహెచ్‌ తాజాగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 18వ తేదీ నుంచి కాలేజీల్లో తనిఖీలు చేపట్టనుంది. మౌలిక వసతులు, బోధన సిబ్బందిని పరిశీలించిన తర్వాత అఫ్లియేషన్‌ ఇస్తుంది. మరోవైపు ఆగస్టు 21 నుంచి మొదటి విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ కాలేజీ ఫీజు ఎంత అనేది తెలియకపోవడంతో విద్యార్థులు ఆప్షన్ల విషయమై గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటికైనా ఫీజులపై స్పష్టత ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీని కోరుతున్నారు. 

Published date : 16 Aug 2022 03:35PM

Photo Stories