Skip to main content

Engineering: ఇంజనీరింగ్‌ ఫీజులు తగ్గుతాయ్‌!

ప్రైవేటు ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంపై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది.
Engineering
ఇంజనీరింగ్‌ ఫీజులు తగ్గుతాయ్‌!

ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) సెప్టెంబర్‌ 24న భేటీ కానుంది. టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి సహా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు పునఃసమీక్షించిన ఆడిట్‌ నివేదికల ఆధారంగా 2023 నుంచి అమలు చేసే ఫీజులను నిర్ధారించనున్నారు. కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అనంతరం ప్రభుత్వం ఫీజులపై జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. మూడేళ్ల తర్వాత మరోసారి ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు అంశంపై కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు జూలైలో పూర్తయింది. కాలేజీల నిర్వహణ ఖర్చు ఆధారంగా కొత్త ఫీజులను ఖరారు చేసినా రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల విద్యాసంస్థలు మూతపడ్డ నేపథ్యంలో పాత ఫీజులనే అమలు చేయాలని ఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 80 కాలేజీలు ఫీజుల పెంపును నిలిపివేయడంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత మూడు రోజలుగా కాలేజీల ఆడిట్‌ నివేదికలను ఎఫ్‌ఆర్‌సీ పరీశీలించింది.

చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..

పొరపాట్లు గుర్తించినందునే..

చాలా కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయని ఆడిట్‌ నివేదికల పరిశీలన అనంతరం టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ స్వరూప్‌రెడ్డి తెలిపారు. నివేదికల సమీక్షను సొంతంగా చేపట్టామని... న్యాయస్థానం లేదా ప్రభుత్వం తమను ఆదేశించలేదని ఆయన చెప్పారు. ఆయన సెప్టెంబర్‌ 23న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తొలిసారి ఆడిట్‌లో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించడం వల్లే మరోసారి నివేదికలను పరిశీలించాల్సి వచ్చిందన్నారు. లోతుగా పరిశీలించిన తర్వాత వాస్తవ ఫీజులను నిర్ధారిస్తున్నామన్నారు. ఈ లెక్కన జూలైలో నిర్ణయించిన వాటికన్నా చాలా కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడున్న కనీస ఫీజు రూ. 35 నుంచి 45 వేలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కాలేజీల ఫీజులు కూడా భారీగానే తగ్గుతా యని చెప్పారు. తుది ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్‌ఆర్‌సీకి ఉందని, కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అవసరమైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 

చదవండి: Job Skills: టెక్‌ నైపుణ్యాలతో టాప్‌ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్‌ అవకాశాలు..

Published date : 24 Sep 2022 02:40PM

Photo Stories