BRICS Youth Summit: వారెవ్వా.. బ్రిక్స్ యూత్ సదస్సులో పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి ఈమెనే..
![Shaik Aayesha of UoH selected for BRICS Youth Summit 2024 at Russia](/sites/default/files/images/2024/07/26/shaik-aayesha-1721992128.jpg)
ఈ సదస్సు జూలై 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయేషా భారత్ తరఫున ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగమ్మాయిగా నిలిచింది.
ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకున్నారు. అప్పుడే ఆయేషా లేచి నిల్చొని తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది.
ఆయేషా వివరాలు..
పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– వెంకటరమణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.
సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.
ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటే..
ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది.