Daily Current Affairs in Telugu: 2022, జులై 16th కరెంట్ అఫైర్స్
NIRF Rankings 2022: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ - ఐఐటీ–మద్రాస్
దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 15న విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది.
Also read: GK International Quiz:. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎంత మొత్తాన్ని అందిస్తోంది?
టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు.
ఓవరాల్ ర్యాంకింగ్
ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో, 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్‌ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది.
Also read; Nonorocks ISS : అంతరిక్షంలో తయారయ్యే వ్యర్థాలకు చెక్..!
ఇంజినీరింగ్
ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్‌ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్‌టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి.
మేనేజ్‌మెంట్
ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి.
Also read: GK Persons Quiz: త్రిపుర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
ఫార్మసీ
జామియా హమ్‌దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది.
Sri Lanka తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా జూలై 15న ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ జూలై 16న పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్‌లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి.
also read: I2I2: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా.. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు..
West Bank: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో బైడెన్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో జూలై 15న పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు.
also read: India Political Parties Donations : భారతదేశంలో వివిధ పార్టీలకు వచ్చిన విరాళాలు ఇవే.. : ఏడీఆర్
Adani Group చేతికి ఇజ్రాయెల్ పోర్టు
ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సార్టియం దక్కించుకుంది. దీనితో పోర్ట్ ఆఫ్ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి. ఈ డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్ సీఈవో ఓఫర్ లించెవ్‌స్కీ పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్‌నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు.
also read: Weekly Current Affairs (International) Bitbank: మంకీపాక్స్ క్వారంటైన్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది?
ఇజ్రాయెల్‌లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్ ఆఫ్ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్ టన్నుల కార్గోనూ హ్యాండిల్ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్‌లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్ కొనసాగుతోంది.
Duvwarapu Sivakumar: అమెరికా తరఫున ఆంధ్ర ఆటగాడు శివకుమార్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. జూలై 15న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది.
also read: ICC ODI Player Rankings బుమ్రా మళ్లీ నంబర్‌వన్
P17A ‘దునగిరి’ యుద్ధనౌక జాతికి అంకితం
ఆధునిక యుద్ధనౌక P 17 A INS ‘దునగిరి’ ని కోల్ కతాలోని హుగ్లీ నది వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జూలై 15న ప్రారంభించారు. కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ప్రాజెక్ట్ 17A కింద రూపొందిస్తోన్న యుద్ధ నౌకల్లో ఇది నాలుగోది. మొదటిదైనా ఐఎన్ఎస్ నీలగిరిని 2019, రెండోదైన ఐఎన్ఎస్ హిమగిరిని 2020లో ప్రారంభించారు. మూడోదైన ఐఎన్ఎస్ ఉదయగిరి 2022 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద అన్ని యుద్ధ నౌకలను పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు.
Also read: Most Powerful Missiles: హైపర్ సోనిక్ మిసైల్ కింజల్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
CAATSA: భారత్‌కు కాట్సా నుంచి మినహాయింపు
రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచి్చంది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్‌డీఏఏ)కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ జూలై 15న ఆమోదం తెలిపింది. చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది. కాట్సా నుంచి మినహాయింపు కలి్పస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భారత ప్రభుత్వం 2018లో రష్యా నుంచి రూ.40 వేల కోట్ల విలువైన ఐదు ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Also read: Italy Prime Minister Mario Draghi : ఇటలీ ప్రధాని రాజీనామా తిరస్కరణ.. ఎందుకంటే..?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP