Most Powerful Missiles: హైపర్ సోనిక్ మిసైల్ కింజల్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
![Kinzhal missile](/sites/default/files/images/2022/03/23/kinzhal-missile-1648038537.jpg)
Top Most Powerful Missiles in The World: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. తాజాగా ఓ హైపర్ సోనిక్ మిసైల్ ‘కింజల్’ను ఆ దేశ సైనిక ఆయుధాగారంపై ప్రయోగించినట్టు ప్రకటించింది. కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల ఈ అత్యాధునిక క్షిపణిని తొలిసారి వాడామని రష్యా వెల్లడించింది. అంత అత్యాధునికంగా ఈ మిసైల్‌లో ఏం వాడారు, దీని ప్రత్యేకతలేంటి, ఏయే దేశాల దగ్గర ఇలాంటివి ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయా.. తెలుసుకుందాం.
ఏంటీ కింజల్ మిసైల్?
కింజల్ అంటే బాకు అని అర్థం. ఇది ఆకాశం నుంచి (ఎయిర్ లాంచ్డ్) ప్రయోగించే హైపర్ సోనిక్ మిసైల్. అణ్వాయుధాలను, సంప్రదాయ ఆయుధాలను 500 కిలోల వరకు మోసుకెళ్లగలదు. దీని వేగం మాక్ 10. అంటే ధ్వని వేగానికి 10 రెట్లు ఎక్కువ. ఇంకా సులువుగా చెప్పాలంటే గంటకు 12 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. తొలుత ప్రయోగించగానే గంటకు 4,900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ తర్వాత మాక్ 10 వేగాన్ని చేరుకోగలదు. గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకొని వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. దీని పరిధి 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు. 2018లోనే దీని గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
కింజల్ ప్రత్యేకతలు
- పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్
- వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే
- పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు
- ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు
- సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు
BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ కొత్త వెర్షన్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
హైపర్ సోనిక్ మిసైల్ అంటే?
ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు.
‘హైపర్ సోనిక్’ ఎవరిదగ్గరున్నాయి?
హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది.
బాలిస్టిక్ మిసైల్ ఎలా పని చేస్తుంది?
బాలిస్టిక్ మిసైళ్లను రాకెట్ (ఇతర సాధనాల) సాయంతో పైకి తీసుకెళ్తారు. ఆ తర్వాత భూమ్యాకర్షణ ప్రేరణతో లక్ష్యం వైపు ఇవి దూసుకెళ్తాయి. పరావలయ (పారాబోలిక్) మార్గంలో ప్రయాణిస్తాయి. మొత్తంగా బాలిస్టిక్ క్షిపణులకు ప్రయోగించాక కొద్ది దూరం వరకే శక్తిని (ఇంధనం) అందిస్తారు. ఇవి ఎక్కువ బరువును మోసుకెళ్లగలవు. ముందే నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఒకసారి ప్రయోగించాక దిశను మార్చుకోవడం కష్టం. ఇండియా దగ్గర ఉన్న పృథ్వీ 1, పృథ్వీ 2, అగ్ని 1, అగ్ని 2, ధనుష్ బాలిస్టిక్ క్షిపణులే.
భారత్ ప్రయోగం సక్సెస్
మన దేశం హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీడీవీ) పరీక్షను 2021 ఏడాది విజయవంతంగా పరీక్షించింది. ఇందులో స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను వాడింది. ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల హైపర్ సోనిక్ మిసైళ్ల తయారీకి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది.
Kavach Technology: రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఎక్కడ పరీక్షించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్