Skip to main content

Latest Top Current Affairs: ది కేరళ స్టోరీ చిత్రానికి పన్ను మినహాయింపునిచ్చిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

వివిధ పోటీ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్ అందిస్తున్న నేటి టాప్ టెన్ క‌రెంట్ అఫైర్స్ ఇవే...
The-Kerala-story
The-Kerala-story

మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌లో 55 మంది మృతి
ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. శనివారం ఉదయం మార్కెట్లు, దుకాణాలు తెరిచినప్పటికీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 55కు చేరింది. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ మృతదేహాలను చురాచాంద్‌పుర్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లా, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లోని మార్చురీల్లో భద్రపరిచారు. జాతుల మధ్య నెలకొన్న ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. 

చ‌ద‌వండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

Manipur

ది కేరళ స్టోరీ చిత్రానికి పన్ను మినహాయింపునిచ్చిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌
మత మార్పిడిలపై రూపొందిన ది కేరళ స్టోరీ చిత్రానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. పిల్లలు, పెద్దలూ అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే మత మార్పిడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చింది. ఈ చిత్రం కూడా మతమార్పిడులపై అవగాహన తీసుకొస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు, చిన్నారులు, ఆడ పిల్లల అందరూ వీక్షించదగ్గ చిత్రం. అందుకే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇస్తోంది’ అని చౌహాన్‌ అన్నారు.

త్వరలో పెంపుడు జంతువులకు రైలు టికెట్‌.!
ఇకపై రైలు ప్రయాణాల్లో తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికెట్‌ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్‌ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేషన్‌లోని పార్సిల్‌ కౌంటర్‌కు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. అలానే, సెకండ్‌ క్లాస్‌ లగేజ్‌ లేదా బ్రేక్‌వ్యాన్‌లో ఒక బాక్స్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ఈ వ్యవహారం మొత్తం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని పరిశీలిస్తోంది.

చ‌ద‌వండి: రేపే నీట్ ఎగ్జామ్‌... ఇలా వెళితేనే ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తి

indian railways

జులైలో పారిస్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ
పారిస్‌లో జులై 14న జరగనున్న బాస్టిల్‌ డే కవాతులో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని శుక్రవారం భారత్‌ విదేశీ వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని.. ఫ్రాన్స్‌ వెళ్లనున్నారని తెలిపింది. కవాతులో ఫ్రెంచ్‌ సైన్యంతో పాటు, భారత్‌ సాయుధ బలగాలూ కదం తొక్కనున్నాయి. ఆహ్వానాన్ని మన్నించిన మోదీకి మెక్రాన్‌ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.

narendra modi

ప‌ది ఫ‌లితాల్లో టాప్‌లో పార్వ‌తీపురం.. చివ‌ర‌లో నంద్యాల‌
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫ‌లితాల‌ను విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం 72.26 శాతంగా న‌మోదైంది. బాలుర కన్నా బాలికలే 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతంతో అగ్రస్థానంలో.. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా ఆఖరున నిలిచింది. ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వ‌హిస్తారు. మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలి. 

చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్సీలో మ‌ళ్లీ ప‌రీక్ష‌లు వాయిదా.. కొత్త‌గా ప్ర‌క‌టించిన తేదీలు ఇవే

students

10న కృష్ణా బోర్డు సమావేశం
కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. 2022–23 వాటర్‌ ఇయర్‌లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

krishna board meeting

అర్జున్‌ పరాజయం... గుకేశ్‌కు రెండో విజయం
టెపి సెగెమన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్‌ ఇరిగేశి అర్జున్‌ తొలి ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో వరంగల్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ తెల్ల పావులతో ఆడుతూ 57 ఎత్తుల్లో స్వీడన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నిల్స్‌ గ్రాండెలియస్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ వరుసగా రెండో విజయంతో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్‌లో తమిళనాడుకు చెందిన గుకేశ్‌ 35 ఎత్తుల్లో విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ అభిమన్యు మిశ్రా రెండో రౌండ్‌లో 43 ఎత్తుల్లో జోర్డెన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్, నవీన్‌
ప్రపంచ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్‌ కుమార్‌ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... ఆశిష్‌ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్‌లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌ బౌట్‌లలో హుసాముద్దీన్‌ 5–0తో లియు పింగ్‌ (చైనా)పై, నవీన్‌ 5–0తో జియోంగ్‌ జెమిన్‌ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్‌ 2–5తో రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అర్లెన్‌ లోపెజ్‌ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు. 

చ‌ద‌వండి: రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌

బ్రిటన్ రాజుగా కిరీటాన్ని ధరించిన చార్లెస్‌ 
బ్రిటిష్‌ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో చార్లెస్ సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. కింగ్ చార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్టించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు. పట్టాభిషేకం నిమిత్తం కింగ్‌ ఛార్లెస్‌ దంపతులు సంప్రదాయంగా వస్తున్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునీకరించిన డైమండ్‌ జూబ్లీ స్టేట్‌ కోచ్‌ బగ్గీలో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకున్నారు. అబేకు వచ్చిన తర్వాత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తొలుత కింగ్‌ ఛార్లెస్‌ను పరిచయం చేశారు. అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని చార్లెస్‌ ప్రమాణం చేశారు. 

king charles

గర్భస్థ పిండానికి బ్రెయిన్‌ సర్జరీ
గర్భంలోనే ఉన్న ఓ పిండం మెదడుకు అమెరికా వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ తరహా ఆపరేషన్‌ చేయడం ప్రపంచంలో ఇది మొదటిసారి. బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, బ్రిఘాం అండ్‌ ఉమెన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు ఈ ఘనత సాధించారు. చిన్నారి మెదడులో ‘వెయిన్‌ ఆఫ్‌ గాలెన్‌ మాల్‌ఫార్మేషన్‌’ అనే అరుదైన రుగ్మత తలెత్తింది. ఈ సమస్య వల్ల మెదడులోని ధమనులు.. అక్కడి ప్రధాన సిరతో అనుసంధానమవుతాయి. ఫలితంగా ఆ సిర విస్తరించి, దాని గుండా ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరిగా అందదు. ఈ నేపథ్యంలో గర్భస్థ శిశువుకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

Published date : 06 May 2023 06:35PM

Photo Stories