Latest Top Current Affairs: రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్
ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ.. తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది.
సరిహద్దు సమస్యల పరిష్కారానికే పెద్ద పీట
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్‌తో జై శంకర్ సమావేశమయ్యారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జైశంకర్ సమావేశమయ్యారు. ఎస్‌సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు.
మణిపూర్‌లో భీకర హింస
మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్‌చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, తెంగౌన్‌పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
(ఇంఫాల్‌లో ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు)
జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. జవాన్లను లక్ష‍్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది.
రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని ఇటీవల సూరత్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి హరీశ్ హస్‌ముఖ్‌భాయి వర్మతోపాటు మరో 68 న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్‌కు పదోన్నతి దక్కింది. అయితే, వీరి ప్రమోషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కాకుండా.. సీనియారిటీ- కమ్- మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు.
బిహార్ ప్రభుత్వానికి రూ. 4,000 కోట్ల జరిమానా
బిహార్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) షాకిచ్చింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు రూ.4 వేల కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు జమ చేయాలని నీతీశ్ సర్కారును ఆదేశించింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందువల్ల రూ.4వేల కోట్లను రింగ్ ఫెన్స్‌డ్ అకౌంట్‌కు (అత్యవసర పరిస్థితుల్లో నిధులను సంరక్షించేందుకు ఉపయోగించే ఖాతాలు) డిపాజిట్ చేయాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఆల్ ఇండియా రేడియోకు స్వస్తి
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోల్లో ప్రకటనల సమయంలో కానీ, ఇతర అధికార ఉత్తర్వుల్లో కానీ కేవలం ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు. ఇంగ్లిష్ ప్రసారాల సమయంలో కూడా ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో’ అని కాకుండా ‘దిస్ ఈజ్ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. అన్ని భాషలు, మాండలికాల్లోనూ ఇదే నిబంధనను అనుసరించాలని నిర్దేశించారు.
మే 5వ తేదీ నుంచి దోహా డైమండ్ లీగ్
గతేడాది డైమండ్ లీగ్ ఫైనల్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా... ఈ సీజన్లో దోహాలో జరిగే డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో భారీ అంచనాలతో బరిలో దిగుతున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సత్తా చాటాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్), ఐరోపా చాంపియన్ జులియన్ వెబర్ (జర్మనీ), మాజీ ఒలింపిక్ విజేత వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) నుంచి చోప్రాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. గత సీజన్లో జావెలిన్‌ను 89.94 మీటర్లు (స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్) విసిరి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను చోప్రా కనబర్చాడు.
రేపే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు శనివారం(మే 6వ తేదీ) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది. తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.