Skip to main content

Current Affairs: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

పోటీ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర‌వుతున్న అభ్య‌ర్థుల కోసం మే 12వ తేదీ నాటి టాప్ క‌రెంట్ అఫైర్స్ మీకోసం...
Supreme court
Supreme court

గుజరాత్‌లో కింది కోర్టుల్లో పనిచేస్తున్న‌ 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీరిలో రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ వర్మ కూడా ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

చ‌ద‌వండి: అయ్యో పాపం... మూడు నెల‌ల్లో మూడు చీతాల మ‌ర‌ణం..

Rahul Gandhi

హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ సహా 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జీ కేడర్‌కు ప్రమోట్‌ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ హైకోర్టు సెలక్షన్‌ జాబితాను జారీ చేసింది. ఈ జాబితాను సవాల్‌ చేస్తూ సివిల్‌ జడ్జీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మెరిట్- కమ్- సీనియారిటీ’ ఆధారంగా కాకుండా.. ‘సీనియారిటీ- కమ్- మెరిట్‌’ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించింది.

అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌
అగ్నివీర్‌లకు రైల్వేలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్‌ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుంది.

Agniveer

దివ్యాంగులు (పర్సన్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్‌ అప్రంటీస్‌ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్‌-1లో 10%, లెవెల్‌-2.. అంతకుమించిన నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను అగ్నివీర్‌లకు కల్పిస్తారు. తొలిబ్యాచ్‌ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్‌ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు పంపింది. 

చ‌ద‌వండి: 1.6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఎన్ఐటీ అమ్మాయి

ఒకే కోర్సులో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌
దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సుగా ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

IIT Madras

ఇందుకోసం మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్‌, ఐఐటీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి గురువారం ప్రారంభించారు. ఈ కోర్సుకు ప్రాముఖ్యం ల‌భించ‌డానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు.

సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను పరీక్షించిన ఇస్రో
తన వాహకనౌకలను భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రణాళికల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2000 కిలోన్యూటన్ల సామర్థ్యమున్న సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ)లో బుధవారం ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

చ‌ద‌వండి: రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

కొండచరియలు విరిగిపడే ముప్పుపై ముందే హెచ్చరికలు
కొండచరియలు విరిగిపడే ముప్పుపై ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసేందుకు సరికొత్త హెచ్చరికల వ్యవస్థను దేశవ్యాప్తంగా 2026లో అందుబాటులోకి తీసుకురావాలని ‘జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)’ ప్రణాళికలు రచిస్తోంది.

Land Slides

ఈ విషయాన్ని జీఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అసిత్‌ సాహా గురువారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని దార్జీలింగ్‌, కాలింపాంగ్‌ జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా సంబంధిత హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు చెప్పారు.

కశ్మీర్‌లో జీ-20 సమావేశాలకు భారీ బందోబస్తు
శ్రీనగర్‌లో దాల్‌ సరస్సు ఒడ్డున ఈ నెల 22, 23,24వ‌ తేదీల్లో జీ-20 పర్యాటక కార్యబృంద సమావేశాలు జరగనున్నందున జమ్మూలో, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. 10 సైనిక స్కూళ్లను మూసివేసి, మే 25 వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించారు.

G20

సరిహద్దులో చొరబాట్లను అరికట్టడానికి అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జన సంచారంపై నిఘా పెడుతున్నారు. జమ్మూ - పఠాన్‌కోట్‌ రహదారిపై గస్తీని ముమ్మరం చేశారు. అంతర్జాతీయ సరిహద్దు, అధీనరేఖ (ఎల్వోసీ)ల వెంబడి సైన్యం, సరిహద్దు భద్రతాదళం, పోలీసు, సీఆర్పీ దళాలు, గ్రామ రక్షక దళాలు చురుగ్గా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాయి.

Tenth Class : నిరుపేద కుటుంబం.. తండ్రి మ‌ర‌ణంతో.. జీవనోపాధి కోసం..

దేశాభివృద్ధికే సాంకేతికత వినియోగం
సాంకేతికత అనేది ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి కాదని దేశంలో అభివృద్ధిని ఉరకలెత్తించడానికి మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించిన 1998 మే 11.. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆయన అభివర్ణించారు. మే 11ను జాతీయ సాంకేతిక దినంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే.

narendra modi

తమ ప్రభుత్వం టెక్నాలజీని సమానత్వ సాధనకు, సామాజిక న్యాయ కల్పనకు ఉపయోగిస్తోందని మోదీ వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ ఆధ్వర్యంలో జరిగిన పోఖ్రాన్‌ పరీక్షలు... దేశ సత్తాను చాటడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారత్‌ పలుకుబడిని పెంచాయని మోదీ అన్నారు.

ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో..!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ రావడం ఖాయమైంది.  మరో ఆరు వారాల్లో సీఈఓగా ఓ మ‌హిళ‌ బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్ర‌స్తుత సీఈఓ ఎల‌న్ మ‌స్క్‌ ప్రకటించారు. అయితే, అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినో కొత్త సీఈఓ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

twitter

లిండా.. ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమెతో మస్క్‌ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు స‌మాచారం. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

MBBS Seats: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

జైపూర్‌లో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌
హ్యాండ్‌బాల్‌కు ఆదరణ పెంచే క్రమంలో మరో ముందడుగు. జైపూర్‌ వేదికగా ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్‌ 8 నుంచి జూన్‌ 25 వరకు రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ లీగ్‌ నిర్వహించనున్నారు.

handball

ఇందులో రాజస్తాన్‌ పేట్రియాట్స్‌, గర్విత్‌ గుజరాత్‌, మహారాష్ట్ర ఐరన్‌మెన్‌, గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, తెలుగు టాలోన్స్‌, ఢిల్లీ పంజెర్స్‌ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ మ్యాచ్‌లను వయాకామ్‌ 18, జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఖేల్‌లో వీక్షించవచ్చు.

ISSF World Cup Baku: సరబ్‌జోత్‌–దివ్య జోడీకి స్వర్ణం
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌–దివ్య థడిగోల్‌ సుబ్బరాజు (భారత్‌) ద్వయం విజేతగా నిలిచింది. స్వర్ణ–రజత పతక ఫైనల్‌ పోరులో సరబ్‌జోత్‌–దివ్య జోడీ 16–14తో జొరానా అరునోవిచ్‌–దామిర్‌ మికెచ్‌ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది.

Shooting

సరబ్‌జోత్‌ కెరీర్‌లో ఇది రెండో ప్రపంచకప్‌ స్వర్ణంకాగా... బెంగళూరుకు చెందిన దివ్యకు ప్రపంచకప్‌ టోర్నీలలో తొలి పతకం కావడం విశేషం. మొత్తం 55 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సరబ్‌జోత్‌–దివ్య ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. 

Published date : 12 May 2023 07:24PM

Photo Stories