Skip to main content

Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..

కిందపడ్డప్పుడు ‘అయ్యో!’ అనుకుంటారు అందరు. ‘ఎందుకు పడ్డాం?’ అని ఆలోచిస్తారు కొందరు.
Meesho founders
Meesho founders

రెండో కోవకు చెందిన వారు కాస్త లేటయినా ఘాటైన విజయం సాధిస్తారు....ఇందుకు ఈ ఇద్దరే ఉదాహరణ...

యువ సంపన్నుల గురించి..
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్న విదిత్‌ ఆత్రే ‘ఫోర్ట్స్‌’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. అలాంటి విదిత్‌ పవర్‌ఫుల్‌ ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30’ ఏషియా జాబితాలోకి రావ‌డానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక కాస్త వెనక్కి వెళితే...

చాలా కష్టం అన్నవాళ్లే..
చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగాలే చేశాడు విదిత్‌. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కోసం యాప్‌ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువ. 

మంచి ఉద్యోగం..కానీ
దిల్లీ కాలేజీలో తన బ్యాచ్‌మేట్‌ సంజీవ్‌ బర్నావాల్‌ కూడా తనతో పాటే ‘ఫోర్బ్స్‌’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే...తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్‌లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్‌.

మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌..
ఇండియాలో ఉన్న విదిత్, జపాన్‌లో ఉన్న సంజీవ్‌ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్‌ లోకల్‌ ఫ్యాషన్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్యాష్‌నియర్‌’తో రంగంలోకి దిగారు. తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్‌కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్‌ విజిట్‌ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌ అయింది.

చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై.. 
అలా అని ‘చలో బ్యాక్‌’ అనుకోలేదు. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్‌ మార్కెట్‌కు ఉండే ‘వైడ్‌రేంజ్‌ ఆప్షన్స్‌’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. ఆ సమయంలోనే వారి ఆలోచనలు చిన్నవాపారుల చుట్టూ తిరిగాయి. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్‌సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌...లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్‌నియర్‌’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్‌–మై షాప్‌) యాప్‌ను డిజైన్‌ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై  మార్కెట్‌ ప్లేస్‌గా పేరు సంపాదించుకుంది. 

విదిత్, సంజీవ్‌లను రైజింగ్‌స్టార్‌లుగా...
తమ ప్రాడక్స్‌ను యాడ్‌ చేయడానికి, వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సులభంగా షేర్‌ చేయడానికి, సులభంగా యూజ్‌ చేయడానికి ‘బెస్ట్‌’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్‌ల ద్వారా సెల్లర్స్‌ నుంచి కమీషన్‌ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రతి నెల సెల్లర్స్‌ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటైన‌  ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్‌ సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఒకటిగా నిలిచింది. విదిత్, సంజీవ్‌లను రైజింగ్‌స్టార్‌లుగా మార్చింది.

Published date : 19 Nov 2021 05:58PM

Photo Stories