Skip to main content

IAS Success Story: ఆల్ ఇండియా సివిల్స్ టాప‌ర్ ఈ క‌లెక్ట‌ర్‌... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి హైద‌ర‌బాద్ క‌లెక్ట‌ర్‌గా...

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ అంటేనే ఒక మారథాన్‌. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు.
IAS Anudeep Durishetty
ఆల్ ఇండియా సివిల్స్ టాప‌ర్ ఈ క‌లెక్ట‌ర్‌... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి హైద‌ర‌బాద్ క‌లెక్ట‌ర్‌గా...

అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్‌. త‌న స‌క్సెస్ జ‌ర్నీ త‌న మాట‌ల్లోనే...

సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్‌పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత  సర్వీసు ఐఏఎస్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్‌ఎస్‌ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్‌పైనే!

IAS Success Story: 16 ఏళ్ల‌కే వినికిడి శ‌క్తి కోల్పోయా... కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఐఏఎస్ సాధించానిలా...

Anudeep Durishetty

స్వీయ విశ్లేషణ
2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ తొలి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాను. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపరేషన్‌ అనేది మెగా మారథాన్‌ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్‌.

తప్పులను సరిదిద్దుకుంటూ..
వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్‌కు ప్రిపరేషన్‌ సయమంలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) లభించింది. 

Telugu Topper IFS Success Story: క‌రెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంకు సాధించానిలా...

లక్ష్యం.. ఐఏఎస్‌
2013లో విజయంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్‌ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్‌ఎస్‌ ప్రొబేషనరీ ట్రైనింగ్‌ తీసుకుంటూనే ఐఏఎస్‌ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్‌కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. 

Anudeep Durishetty

2016లో పరీక్షకు దూరంగా..
వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. దీంతో 2016లో అటెంప్ట్‌ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్‌’ దూరం కాలేదు. 

చివ‌రి అవ‌కాశంలో...
2017 నోటిఫికేషన్‌లో అటెంప్ట్‌ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్‌ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్‌ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్‌ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నా. సబ్జెక్టుపై పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్‌ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్‌కు అవసరమైన  ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్‌–1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

Success Story: వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

దురిశెట్టి అనుదీప్‌ సివిల్స్‌ ప్రస్థానం
2012   తొలి ప్రయత్నం – మెయిన్స్‌లో నిరాశ.
2013   రెండో ప్రయత్నం– ఐఆర్‌ఎస్‌కు ఎంపిక.
2014, 2015   మూడు, నాలుగు ప్రయత్నాలు – మెయిన్స్‌లో పరాజయం.
2017   అయిదో ప్రయత్నం – ఆలిండియా టాప్‌ ర్యాంకు.

Anudeep Durishetty

ఇంటర్వ్యూ సాగిందిలా..
ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్‌లో జరిగింది. అజిత్‌ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు..

చదివింది బీటెక్‌ కదా.. సివిల్స్‌వైపు ఎందుకు రావాలనుకున్నారు?
ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్‌ సర్వీసెస్‌ అని నిర్ణయించుకున్నాను.

☛  NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్ల‌కే పెళ్లి... 20 ఏళ్ల‌కు పాప... ఐదో ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేష‌న‌ల్‌ స్టోరీ

బీటెక్‌ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణం?
ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్‌ సర్వీసెస్‌ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను.

Anudeep Durishetty


     
ఇప్పటికే ఐఆర్‌ఎస్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్‌కు హాజరవడానికి కారణం?
మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్‌ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్‌ అని భావిస్తున్నాను. ఐఏఎస్‌ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్వచ్ఛ్‌ భారత్‌ పథకంపై మీ ఉద్దేశం?
కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

NEET 2023 Ranker : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం?
ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం.

ప్ర‌స్తుతం అనుదీప్ హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌గా ఈ జులై 15న‌ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అతి చిన్న వ‌య‌సులో హైద‌రాబాద్‌ క‌లెక్ట‌ర్‌గా నియ‌మితులై ఆయ‌న రికార్డు నెల‌కొల్పారు. 

Published date : 20 Jul 2023 07:09PM

Photo Stories