పిట్ట కొంచెం..మనోడి సత్తా ఘనం..
గుంటూరు జిల్లా అమరావతికి చెంది అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తల్లం శ్రీనివాస కిరణ్, వెంకట పల్లవి కుమారుడు సాహిల్ (17) మూడు సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలకు రూపకల్పన చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో అతని ఆలోచనలు భారత్, అమెరికా దేశాలకు ఉపయుక్తమైన ఆవిష్కరణలకు అంకురార్పణ చేశాయి. ఆ కొత్త ఆవిష్కరణలు ఇవే..
ఈ లక్ష్యంతోనే..
కాలిఫోర్నియాలోని అడవులను కార్చిచ్చు తరచూ నాశనం చేస్తుండడంతో తల్లడిల్లిన సాహిల్ ఆ భూముల్లో తిరిగి మొక్కలు పెంచేందుకు (రీ ఫారెస్టేషన్) సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానిస్తూ డ్రోన్‌లను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా అడవుల పునర్నిర్మాణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాడు. బహుళ రకాలుగా ఈ డ్రోన్‌లు ఉపయోగపడతాయి. అడవులు, మైదాన ప్రాంతాల్లో మనుషులు, యంత్రాల సాయంతో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను ఇవి గుర్తిస్తాయి. మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో ఈ డ్రోన్‌లే మొక్కలు నాటి నీళ్లుపోసి సంరక్షిస్తాయి. స్మార్ట్ సాగులో ‘ఇ–ప్లాంటేషన్’ విధానం ఇది. ఇందుకోసం ప్రతీ డ్రోన్ ఒకదానికొకటి అనుసంధానించుకుని పనిచేస్తాయి.
తుపాకులను గుర్తించే సాఫ్ట్‌వేర్..
తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లిన ప్రాంతాల్లోని పాఠశాలల్లో నిఘా, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాహిల్ ఓ సాఫ్ట్‌వేర్ రూపొందించాడు. తుపాకీ, ఇతర మారణాయుధాలతో ప్రాంగణంలోకి వచ్చినా గుర్తించగలిగే సాఫ్ట్‌వేర్ ఆధారిత మైక్రో–కెమెరా వ్యవస్థను తాను చదివిన కాలిఫోర్నియాలోని శాన్ రామన్ డౌగెర్టీ వ్యాలీ హైస్కూల్లో ఏర్పాటుచేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నాడు. నిర్దేశిత ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచి పసిగట్టే సైన్స్ ఫిక్షన్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఇది.
అంధుల కోసం...
అంధులలో దృష్టిలోప నివారణకు సాహిల్ స్మార్ట్ కళ్లజోళ్లు రూపొందించాడు. ఈ కళ్లద్దాల్లో కెమెరా, మైక్, సెన్సార్, స్పీకర్లు ఉంటాయి. వీటికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను అనుసంధానించాడు. ఇవి ఎదురుగా కన్పించే దృశ్యాలను చిత్రీకరించి ప్రత్యేక సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. స్పీకర్ల ద్వారా వీటిని ధరించిన అంధులకు తెలియజేస్తుంది.
సాహిల్ మరికొన్ని ప్రత్యేకతలు...
☛ లాక్డ్ రెడీ సెక్యూర్ (ఎల్‌ఆర్‌ఎస్) కంపెనీ సీఈఓగా అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని తెలుసుకోగల నిఘా కెమెరాలను రూపొందించాడు.
☛ సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం మీడియా అప్లికేషన్లకు రూపకల్పన చేశాడు.
☛ అమెరికాలో వెబ్ డెవలపర్‌గా యూనిఫైడ్ స్పోర్ట్స్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేశాడు.
☛ భారత్‌లో కృత్రిమ మేథా ప్రాజెక్టు రూపకల్పనలో మెంపేజ్ టెక్నాలజీస్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాడు.
☛ తన డ్రోన్ ప్రాజెక్ట్‌తో ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్ పోటీల్లో సెమీఫైనల్స్‌కు చేరాడు.
☛ లింగ్ హక్స్ మేజర్ లీగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టి మూడో స్థానంలో నిలిచాడు.
☛ బెమాక్స్ కంపెనీతో చేపట్టిన సోలార్ హాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌కు ఉత్తమ అవార్డు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.
☛ 2018లో లూయిస్విల్లేలో జరిగిన వెక్స్ గ్లోబల్ కాంపిటీషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌లో 3వ స్థానం సాధించాడు.