Skip to main content

NASA Challenge 2021: తెలుగు కుర్రాడికి రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం..ఎలా అంటే..?

శ్రీకాకుళం యువకుడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌లో ఓ బృందానికి ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభ చాటారు.
Nasa Space Robotics Challenge
Nasa Space Robotics Challenge

సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను ఎలా సమకూర్చుకోవాలి? వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అన్న అంశాలపై వర్చువల్‌ విధానంలో రోబోటిక్‌ సాప్ట్‌వేర్‌ తయారీపై నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ సంస్థ పోటీ నిర్వహించింది. ఈ చాలెంజ్‌లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ ప్రాతినిధ్యం వహించిన బృందం విశ్వవిజేతగా నిలిచింది.

ఈ చాలెంజ్‌లో.. 
ఈ బృందంలో అలెంసాండ్రో డిఫవా, వెక్టర్‌ లోపెజ్, డేవిడ్‌ ఫెర్నాండెజ్‌ లోపెజ్, ఫియర్‌ ఫెర్న్‌బాచ్, లూకా మర్కియాని, ఆద్రియా రోయజ్‌ మొరెనో, నాసిన్‌ మిగేల్‌ బాన్యోస్‌  సభ్యులుగా ఉన్నారు. విజేతగా నిలిచిన వీరు రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. సాయికిశోర్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్‌ రోబోటిక్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్‌ మోన్స్‌ బృందంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. 

114 బృందాలను అధిగమించి..ఏకంగా..
మల్టీ–రోబో బృందం అంతరిక్షంలోకి వెళ్లాక ఎలా పనిచేయాలి? ఎంత త్వరగా ఖనిజాన్ని సేకరించాలి? జీపీఎస్‌ వ్యవస్థ లేకుండా మొత్తం పనిచేసి, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ బృందం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ప్రకారం.. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఒక రోబో వెతుకుతుంది.. ఇంకొకటి లొకేషన్‌కు వెళ్లి ఖనిజాలను తవ్వి, ఇంకో రోబో మీద మినరల్‌ వేస్తుంది.. లోడ్‌ చేసిన రోబో హోమ్‌ బేస్‌ లొకేషన్‌కు వచ్చి అన్‌లోడింగ్‌ చేసేలా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేశారు. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 114 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్‌ మోన్స్‌ బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్‌ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం.   

రెండేళ్లుగా..
ఈ ఛాలెంజ్‌ కోసం మేం రెండేళ్లు కష్టపడ్డాం. ఇందులో స్కౌట్స్‌ అనే రకం రోబో మినరల్‌ను వెతుకుతుంది. ఎక్స్‌కవేటర్‌ అనే రోబో తవ్వకాలు చేసి, హౌలర్‌ అనే రోబోలో లోడింగ్‌ చేస్తుంది. మంచు, నీరు, అమ్మోనియా, కార్బన్‌ డై ఆక్సైడ్, ఈథేన్, హైడ్రోజన్‌ సల్ఫైడ్, మంచు, ఇసుకను సమర్థంగా తవ్వకాలు చేసి, తీసుకొచ్చేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం. దీనిని భవిష్యత్‌లో నాసా మిషన్‌ వినియోగించే అవకాశం ఉంది.
                                                                                                                                          – కొత్తకోట సాయికిశోర్, శ్రీకాకుళం

Published date : 23 Oct 2021 03:26PM

Photo Stories