Inspirational Person: ఎనిమిదో తరగతి చదివిన మన తెలుగు మహిళ.. ఐఏఎస్‌లకు పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగింది.. ఆమె సక్సెస్ జర్నీ చదవండి
బాల్య వివాహంతో....
ఎనిమిదో తరగతిలోనే చదువు మాన్పించి... 14 ఏళ్లకే పెళ్లి చేశారు. మా వారిది మహబూబాబాద్ జిల్లాలోని బొల్లెపల్లి గ్రామం. భర్త వెంకన్న సైకిల్ షాప్ నడిపేవారు. కటిక పేదరికంలో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు. అయినా చదువుపై ఇష్టంతో ఇంటి పని, వంట పని చేసి పదో తరగతి చదివేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేదాన్ని. కష్టపడి చదివి పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించా. బతుకుదెరువు కోసం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జాన్‌పాకకు వచ్చాం.
చదవండి: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
20 రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి...
ఆ సమయంలోనే స్వయం సహాయక సంఘాలలో (ఎస్‌హెచ్‌జీ) మహిళలు చేరుతున్నారు. నేను సభ్యురాలుగా చేరి చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం మొదలు పెట్టా. హిందీ నేర్చుకొని రిసోర్స్ పర్సన్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించా. నా మాట తీరు పది మందిని ఆకట్టుకునేలా ఉండేది. దీంతో అధికారులు నన్ను ప్రోత్సహించారు. సుమారు 20 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది మహిళలకు పొదుపు పాఠాలు నేర్పా. దీన్ని గమనించిన అధికారులు ముస్సోరిలో శిక్షణ తీసుకుంటున్న ఐఏఎస్‌లకు పొదుపు సంఘాల గురించి చెప్పే అవకాశాన్ని కల్పించారు. నా మాటతీరు, సంఘాల తీరుతెన్నుల గురించి నేను వివరించిన తీరును ట్రైనీ ఐఏఎస్‌లు అభినందించారు.
ఫోన్ చేసి అభినందనలు...!
ఎన్ని పనులు చేస్తున్న చదువును మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. రిసోర్స్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తూనే కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తి చేశా. తర్వాత ఎం.ఎ. రూరల్ డెవలప్‌మెంట్లో పీజీ పూర్తి చేశా. నా ఇద్దరబ్బాయిలను బీటెక్ చదివిస్తున్నా. పొదుపు సంఘాల గురించి ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో అవగాహన ఇవ్వడానికే వెళ్లినప్పుడు అక్కడి పురుషులు గ్రామాల్లోకి కూడా రానిచ్చేవారు కాదు. కానీ, ఎంతో శ్రమతో అక్కడి మహిళలకు పొదుపు చేయడం వల్ల ఉపయోగాలు, ఉపాధి గురించి వివరించేదాన్ని. ఇప్పుడు వారు స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. నేను శిక్షణ ఇచ్చిన వాళ్లలో ఎంతోమంది ప్రధాన మంత్రిని కలిసి ఆయన ప్రశంసలు పొందేవారు. జీవితంలో ఇంతకంటే సంతృప్తి ఉంటుందా అనుకొనేదాన్ని.
చదవండి: డాలర్ కోటకు బీటలు... మరో 10 ఏళ్లలో డాలర్ కథ ముగియబోతోందా...
కేంద్రమంత్రి ప్రశంసలు..!
పొదుపు సంఘాలలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారు. దేశంలోని స్వయం సహాయక సంఘాల్లో 9 కోట్ల మంది మహిళలున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆ సంఖ్యను పది కోట్లకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పొదుపు సంఘాల పనితీరు, వాటిలో మహిళలు సాధిస్తున్న విజయాల గురించి అద్భుతంగా చెప్పే మహిళలకు గూగుల్‌మీట్ ద్వారా పోటీలు నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక్కదాన్ని మాత్రమే ఎంపికయ్యా. నా ప్రసంగానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ ఆశ్చర్యపోయి, అభినందనలతో ముంచెత్తారు. జీవితంలో ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది.