Skip to main content

Dollar Crisis: డాలర్‌ కోటకు బీటలు... మ‌రో 10 ఏళ్ల‌లో డాల‌ర్ క‌థ ముగియ‌బోతోందా... పూర్తి వివ‌రాలు మీ కోసం

సైనిక, ఆర్థిక దండోపాయాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇది. తన మాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనుకుంటున్నారా? అదేమీ లేదు కాని, ఇన్నాళ్లూ ఏ డాలర్‌ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమలదండులా కదం తొక్కుతున్నాయి.
The World’s Currency
The World’s Currency

80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా....
దాదాపు 80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్‌ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీ వార్‌కు తెరతీశాయి. రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధించి, వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్‌ చేసిన అమెరికా, అలాగే పశ్చిమ దేశాలు భవిష్యత్తులో తమపైనా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కేంటంటూ మేల్కొంటున్నాయి. డాలర్‌ కరెన్సీ నిల్వలతో పాటు డాలర్లలో వాణిజ్యానికి నో చెబుతున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని పలు దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి.

Doller


అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ....
ఇదే ట్రెండ్‌ కొనసాగితే సమీప భవిష్యత్తులోనే డాలర్‌తోపాటు అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అసలు డాలర్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్‌ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్‌ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే!
డాలర్‌కు లోకం దాసోహం!
అన్ని దేశాలకూ తమ సొంత కరెన్సీలు ఉన్నా, లోకమంతా డాలర్ల వెంటే పరిగెడుతోంది. కేవలం అంతర్జాతీయ వాణిజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ లావాదేవీల్లో అత్యధిక శాతం డాలర్లలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఏ మారుమూలకెళ్లినా డాలర్‌ చెల్లుతుంది. డాలర్‌కు అత్యధికంగా స్టోర్‌ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్‌ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్‌) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా డాలర్‌ వెలుగొందుతోంది.
సూపర్‌ పవర్‌గా అవతరించి....
అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలుతెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడింది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడి ఎకానమీ పరుగులకు; సూపర్‌ పవర్‌గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్‌ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్‌ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్‌ను కంట్రోల్‌ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్‌ ప్రింటింగ్‌ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది.

Doller


72 శాతం నుంచి డాలర్‌ వాటా 59 శాతానికి...
2022 నాటికి మొత్తం యూఎస్‌ అప్పు 31.5 ట్రిలియన్‌ డాలర్లు (జీడీపీతో పోలిస్తే 120 శాతం పైనే). ఈ డాలర్‌ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసిన అమెరికాకు చివరికి అప్పులతిప్పలు మిగిలాయి. 25 ఏళ్ల క్రితం ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీలో 72 శాతంగా ఉన్న డాలర్‌ వాటా ప్రస్తుతం 59 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు రష్యా, చైనాతో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యానికి గూబ గుయ్యిమంటోంది. యుద్ధభూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ తామేంటో రుచి చూపిస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఏకంగా డాలర్‌కే ఎసరు పెట్టేలా పావులు కదుపుతూ శ్వేతసౌధానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
తాను తవ్వుకున్న గోతిలోనే...
తమ గుమ్మం ముందుకు నాటో విస్తరణను ఆపాలన్న రష్యా మాటను పెడచెవిన పెట్టిన అమెరికా, దాని మిత్ర దేశాలు... ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. డాలర్‌ పతనానికి ఆజ్యం పోసింది ఇదే! రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్‌ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్‌) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా,  యూరప్‌ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది.
విప‌రీతంగా పెరుగుతున్న వ‌డ్డీరేట్లు
క్రూడ్‌తో సహా అనేక కమోడిటీల ధరలు ఆకాశాన్నంటి జనాలు గగ్గోలు పెట్టడంతో సెంట్రల్‌ బ్యాంకులు విపరీతంగా వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సహా నాలుగు బ్యాంకులు కుప్పకూలాయి. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. డాలర్‌ రూపంలో విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిన ఏ దేశమైనా తనకు ఎదురుతిరిగితే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా డాలర్‌ను వాడుకుంటుందన్న విషయం రష్యాపై ఏకపక్ష ఆంక్షల ఉదంతంతో తేటతెల్లమైంది. అమెరికా ఆధిపత్య ధోరణితో విసిగి పోయిన దేశాలన్నీ డాలర్‌ను వదిలించుకునే దిశగా చకచకా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్‌ ఊహించని రీతిలో జోరందుకుంటోంది.
‘కింగ్‌ డాలర్‌’ ఎప్పుడు ఆవిర్భవించింది?
వాస్తవానికి, 105 ఏళ్ల క్రితం డాలర్లలో ప్రపంచ దేశాల ఫారెక్స్‌ నిల్వలు సున్నా! 1900–1918 వరకు ప్రపంచంలో మూడు ప్రధాన కరెన్సీలు రాజ్యమేలాయి. అవి బ్రిటన్‌ పౌండ్, జర్మనీ మార్క్, ఫ్రెంచ్‌ ఫ్రాంక్‌. ఈ మూడు యూరోపియన్‌ దిగ్గజాలు అనేక దేశాలను తమ కాలనీలుగా చేసుకొని కొల్లగొట్టిన అసాధారణ సంపదే దీనికి కారణం. 1918 వరకు అసలు అమెరికా డాలర్‌ సోదిలోనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ పూర్తిగా చితికిపోవడంతో డాలర్‌ ప్రాభవం మొదలైంది. యూరోపియన్‌ల యుద్ధకాంక్ష యూఎస్‌కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్‌ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్‌ దశ తిరిగింది.

Doller


మొద‌టి ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత నుంచీ... 
హిట్లర్‌ అధీనంలో ఉన్న ఫ్రాన్స్‌లో అమెరికా మిత్రదేశ బలగాలు విజయవంతంగా సముద్రదాడి చేయడంతో యూరప్‌పై శ్వేతసౌధం పట్టు బిగించింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న అమెరికా, ‘బ్రెటన్‌ వుడ్స్‌’ సంప్రదింపుల్లో బ్రిటన్, ఫ్రాన్స్‌ను గుప్పిట్లో పెట్టుకుంది. ఆ సందర్భంగానే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్‌ ప్రపంచ తటస్థ రిజర్వ్‌ కరెన్సీగా డాలర్‌ను ప్రతిపాదించారు. దీనికి ఆమోదం లభించడంతో, డాలర్‌ ఆధిపత్యానికి పునాది పడింది. అయితే, 1947లో ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీల్లో బ్రిటిష్‌ పౌండ్‌ వాటా 70 శాతం పైనే. మన రూపాయి కూడా పౌండ్‌తోనే ముడిపడి ఉండేది. బ్రిటిష్‌ సామ్రాజ్యం కుప్పకూలడం, భారత్‌ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పౌండ్‌ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1954లో తొలిసారి అమెరికా డాలర్‌ 40 శాతం పైగా వాటాతో పౌండ్‌ను వెనక్కినెట్టి కింగ్‌గా అవతరించింది. 1980 నాటికి పౌండ్‌ వాటా 3 శాతానికి పడిపోవడం విశేషం!
రిజర్వ్‌ కరెన్సీ హోదా అంటే..?
ప్రపంచ దేశాల విదేశీ కరెన్సీ రిజర్వ్‌ల (ఫారెక్స్‌ నిల్వలు) ఆధారంగా రిజర్వ్‌ కరెన్సీని పేర్కొంటారు. ఎక్కువ నిల్వలు ఏ కరెన్సీలో ఉంటే అది ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ కింగ్‌గా నిలుస్తుంది. ఉదాహరణకు, భారత్‌కు ఉన్న దాదాపు 580 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వల్లో అత్యధిక మొత్తం అమెరికా డాలర్లలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా బాండ్‌లలో పెట్టుబడుల రూపంలో, మరికొంత వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు, విదేశీ వాణిజ్య బ్యాంకులు, అంతర్జాతీయ సెటిల్‌మెంట్స్‌ బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో యూరో, జపాన్‌ యెన్, చైనా యువాన్‌ వంటి ఇతర కరెన్సీల్లో నిల్వ చేస్తుంది.
ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తూ...
ఇక బంగారం రూపంలో కూడా కొన్ని ఫారెక్స్‌ నిల్వలను కొనసాగిస్తుంది. అంటే టాప్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా ఉన్న డాలర్‌లోనే దాదాపు ప్రపంచ దేశాలన్నీ తమ ఫారెక్స్‌ నిల్వలను ఉంచుతాయి. దీనికి కారణం విదేశీ ఎగుమతి–దిగుమతులు, విదేశీ రుణాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతరత్రా కరెన్సీ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలో జరగడమే. డాలర్‌ ఆధిపత్యంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనూ తమ గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా, పశ్చిమ దేశాలు... రుణాల ఎరతో అనే దేశాల ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు డాలర్‌పై తిరుగుబాటు చేయడానికి ఇదీ కారణమే!

Doller


యూఎస్‌, ఈయూ ల‌దే ఆధిప‌త్యం
మరోపక్క, అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య ఫైనాన్షియల్‌ లావాదేవీలు, చెల్లింపులను నిర్వహించేందుకు ఏర్పాటైన స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌)పై అమెరికా, యూరప్‌ దేశాలు పెత్తనం చలాయిస్తున్నాయి. రష్యాను ఈ పేమెంట్‌ వ్యవస్థ నుంచి ఏకపక్షంగా వెలివేయడం దీనికి నిదర్శనం. స్విఫ్ట్‌లో డాలర్, యూరో కరెన్సీ లావాదేవీలే అత్యధికంగా ఉండటంతో పశ్చిమ దేశాలు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి.
డాలర్‌ రిజర్వ్‌ హోదా కోల్పేతే...
డీ–డాలరైజేషన్‌.. అంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాల ఫైనాన్షియల్‌ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు విడిపోవడం అనేది ఏడాదో రెండేళ్లలోనే జరిగే ప్రక్రియ కాదు. రష్యాపై ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే మొదలైన ఈ చర్యలు రాబోయే కొన్నేళ్లలో డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీ హోదాకు కచ్చితంగా చరమగీతం పలుకుతాయనేది మెజారిటీ ఆర్థికవేత్తల మాట. వచ్చే ఐదేళ్లలో డీ–డాలరైజేషన్‌ కారణంగా ఇతర దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతుందంటూ స్వయంగా యూఎస్‌ సెనేటర్‌ మార్కో రూబియో అంచనా వేయడం గమనార్హం.
ఆంక్షలు బ్యాక్‌ఫైర్‌...
రష్యా విషయంలో ఆంక్షలు బ్యాక్‌ఫైర్‌ అవ్వడమే దీనికి సంకేంతం. అంతేకాదు వచ్చే కొన్నేళ్లలో ప్రధాన దేశాలన్నీ తమ సొంత కరెన్సీల్లో (ప్రతిపాదిత బ్రిక్స్‌ కూటమి ఉమ్మడి కరెన్సీతో సహా) వాణిజ్య, ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌ వాటా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో డాలర్‌కు డిమాండ్‌ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇతర సెంట్రల్‌ బ్యాంకుల వద్దనున్న డాలర్‌ నిల్వలను తగ్గించుకోవడాన్ని చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. దీనివల్ల డాలర్‌ స్టోర్‌ విలువ మరింత పడిపోతుంది. వడ్డీరేట్లు భారీగా ఎగబాకే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.
పెరిగిపోనున్న బ‌డ్జెట్ లోటు
అమెరికా ట్రెజరీ బ్రాండ్స్‌ను కొనే దేశాలు కరువవ్వడంతో ఇప్పటిలాగే డాలర్లను ఇష్టానుసారం ప్రింట్‌ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్‌ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. ధరలు అంతకంతకూ కొండెక్కి అతి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతి మంగా దిగుమతులు గుదిబండగా మారడంతో పాటు అమెరికా ప్రభుత్వ రుణ చెల్లింపులు కష్టతరంగా మారతాయి. నిధుల కోసం పన్నులు పెంచాల్సి వస్తుంది. అంతేకాదు, మనీ ప్రింటింగ్‌కు గండిపడటంతో, సైనిక వ్యయం పడిపోయి మిలిటరీ పరంగా కూడా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు వేగం పుంజుకుంటే డాలర్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ హోదాతో పాటు రాజకీయంగా అమెరికా ‘సూపర్‌ పవర్‌’ ప్రాభవం కూడా మసకబారుతుందనేది నిపుణుల విశ్లేషణ!

Doller


చైనా–రష్యా–భారత్‌ భాయీ భాయీ..
‘100 ఏళ్లలో జరగని మార్పులను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మనం కలసి ముందుకు సాగితే ఈ మార్పులు సాక్షాత్కరిస్తాయి’ అంటూ పుతిన్‌తో జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యల అంతరార్థం డాలర్‌ కోటను బద్దలు కొట్టడమే! రష్యా ఇప్పటికే యూరప్‌తో పాటు పలు దేశాలకు రూబుల్స్‌లో మాత్రమే చమురు, గ్యాస్‌ ఇతరత్రా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సౌదీ, ఇరాన్‌ సైతం తమ సొంత కరెన్సీల్లో క్రూడ్, గ్యాస్‌ ఎగుమతులకు సై అంటున్నాయి. తద్వారా పెట్రో డాలర్‌కు షాక్‌ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు కమోడిటీలదే అత్యధిక వాటా. ఇక ఇప్పుడు ఏకంగా డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీ హోదాకు గురిపెట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలతో వాణిజ్యాన్ని చైనా కరెన్సీ యువాన్‌లతో జరుపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు.
భారీగా పెరిగిన ఆయిల్ దిగుమతి
మరోపక్క, రష్యాపై అమెరికా ఆంక్షలకు చెక్‌ చెప్పేందుకు భారత్, చైనా రంగంలోకి దిగాయి. రష్యా నుంచి యథేచ్ఛగా క్రూడ్‌ ఇతరత్రా కమోడిటీలను కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుండి భారత్‌ క్రూడ్‌ దిగుమతులు ఏకంగా 22 రెట్లు ఎగబాకాయి (రోజుకు 1.6 మిలియన్‌ బ్యారెల్స్‌). రష్యాతో పెనవేసుకున్న భారత్‌ మైత్రికి ఇది తర్కాణం. చైనా సైతం రష్యాతో వాణిజ్యాన్ని 30 శాతం పెంచుకుంది. గత ఏడాది రష్యా నుంచి చైనాకు 80 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగుమతులు జరగగా, రష్యా నుంచి  చైనాకు ఏకంగా 110 బిలియన్‌ డాలర్లకు పైగా దిగుమతులు జరిగాయి. ఈ మొత్తం వాణిజ్యం లో మూడు దేశాలు తమ సొంత కరెన్సీలనే ఉపయోగిస్తుండం డాలర్‌కు మరో బిగ్‌ షాక్‌!
అమెరికా పక్కలో ‘బ్రిక్స్‌’ బల్లెం..
ప్రపంచ భౌగోళిక రాజకీయాలనే కాదు ఆర్థిక వ్యవస్థను సైతం శాసించేలా బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి అంతకంతకూ బలోపేతం అవుతోంది. ప్రపంచ పెత్తనం చేస్తున్న  జీ7  దేశాల (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ, యూరోపియన్‌ యూనియన్‌తో సహా) జీడీపీని 5 బ్రిక్స్‌ దేశాల జీడీపీ (కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా) అధిగమించడం విశేషం. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా ప్రస్తుతం 30 శాతానికి పడిపోగా, బ్రిక్స్‌ దేశాల జీడీపీ వాటా 31.5 శాతానికి చేరింది. అంతేకాదు, సాధారణ జీడీపీలో సైతం ఇప్పటికే బ్రిక్స్‌ కూటమి అమెరికా జీడీపీని మించిపోయింది. 2035 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించి చైనా నంబర్‌ వన్‌ అవుతుందని బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచానా వేసింది.

Doller


2075కల్లా అమెరికాను మించిపోనున్న భార‌త్‌
భారత్‌ సైతం 2075కల్లా అమెరికాను మించిపోతుందని జోస్యం చెప్పింది. మరోపక్క, బ్రిక్స్‌ కూటమి విస్తరణతో బ్రిక్స్‌ ప్లస్‌గా అవతరించే చర్యలు పుంజుకున్నాయి. కీలకమైన సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, అర్జెంటీనా, నైజీరియా, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, మెక్సికో, వెనెజులా ఇలా మొత్తం 12 దేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలాఉంటే, బ్రిక్స్‌ కూటమి తమ సొంత కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. స్విఫ్ట్‌ స్థానంలో సొంత పేమెంట్‌ వ్యవస్థను నెలకొల్పనుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా బ్రిక్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను పెంచుకుంటోంది. చైనా పర్యటనలో బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా.. డాలర్‌ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్యానికి పిలుపునిచ్చారు. బ్రిక్స్‌ కూటమి మరింత విస్తరించి.. కరెన్సీ, పేమెంట్‌ వ్యవస్థ సాకారమైతే డాలర్‌కు నిజంగా మరణ శాసనమేనని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.
గల్ఫ్‌.. గుడ్‌బై!
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ మూడోసారి పగ్గాలు చేపట్టాక రష్యాతో మరింత సన్నిహితం కావడంతో పాటు దౌత్యపరంగానూ సత్తా చాటుతున్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్న సౌదీ, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి అమెరికాకు షాకిచ్చారు. టర్కీ–సిరియా మధ్య సంధి కుదిర్చేందుకు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. సౌదీ సైతం యెమెన్‌తో యుద్ధానికి  ముగింపు పలికేలా అడుగులేస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇన్నాళ్లూ అడిస్తున్న యుద్ధతంత్రానికి ఈ పరిణామాలు చెల్లు చెప్పే అవకాశం ఉంది.

మరోపక్క ఇరాన్, సౌదీ నుంచి ఇకపై చైనా యువాన్‌లోనే క్రూడ్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైతం తమ సొంత కరెన్సీలో ట్రేడింగ్‌కు సై అంది. సౌదీ, రష్యాలు సైతం తమ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పలు రిఫైనరీలను చైనాలో సౌదీ ఆరామ్‌కో నిర్మించనుంది. ఇందుకు యువాన్‌లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తొలిసారిగా చైనా బ్యాంకుల నుంచి సౌదీ యువాన్‌లలో రుణాల కోసం డీల్‌ కుదుర్చుకుంది కూడా. క్రూడ్‌ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌తో పాటు అరబ్‌ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా యువరాజు సల్మాన్‌ ఇప్పుడు అమెరికాకు పూర్తిగా ముఖం చాటేస్తుండటం విశేషం.
గ్లోబల్‌ సౌత్‌.. డాలర్‌ టార్గెట్‌!
బ్రిక్స్‌ దేశాలకు తోడు ఇప్పుడు ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు సైతం డాలర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. డాలర్‌ అవసరం లేకుండా ఇకపై నేరుగా తమ సొంత కరెన్సీలోనో లేదంటే చైనా యువాన్‌లోనో వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలు ఓకే అంటున్నాయి. ముఖ్యంగా భారత్‌ మలేషియా, టాంజానియాతో రూపాయిల్లో వాణిజ్యానికి డీల్‌ కుదుర్చుకుంది. మరో 18 దేశాలతో కూడా ఇదేవిధమైన ఒప్పందాలకు రెడీ అవుతోంది. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ తమ సొంత డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థతో స్థానిక కరెన్సీలో సెటిల్‌మెంట్‌కు తెరతీశాయి.

Doller

ఇప్పుడు 10 దేశాల ఆసియాన్‌ కూటమి తమ మధ్య వాణిజ్యానికి ఇదే వ్యవస్థను వాడుకోవాలని చూస్తోంది. చైనా పర్యటన సందర్భంగా మలేషియా ప్రధాని ఇబ్రహీమ్, ఐఎంఎఫ్‌ ఆధిపత్యానికి చెక్‌ చెప్పేందుకు ఆసియా మానిటరీ ఫండ్‌ (ఏఎంఎఫ్‌)ను ప్రతిపాదించడం గమనార్హం. తొలిసారిగా యూఏఈ నుంచి చైనా యువాన్‌లలో గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)ను కొనుగోలు చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలూ డాలర్‌ను డంప్‌ చేసేందుకు పోటీ పడుతున్నాయి. కెన్యా ఇకపై సౌదీ, యూఏఈ నుంచి తమ సొంత కరెన్సీలో క్రూడ్‌ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈజిప్ట్‌ బ్రిక్స్‌ బ్యాంకుతో చేతులు కలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీ అయితే వీసా, మాస్టర్‌కార్డ్‌ల వినియోగాన్ని దేశంలో ఆపేయాలని పిలుపునివ్వడం విశేషం.

ఇక లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌ తమ ఎగుమతిదారులకు యువాన్‌ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొ స్తోంది. బ్రెజిల్, అర్జెంటీనా లాటిన్‌ అమెరికా ఉమ్మడి కరెన్సీ ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్‌పై మూకుమ్మడి ఎటాక్‌ మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు–పాలించు... ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, ఆర్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే.. డాలర్‌తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం కళ్లకు కడుతోంది.
- శివరామకృష్ణ మిర్తిపాటి

Published date : 24 Apr 2023 01:58PM

Photo Stories