Skip to main content

India GDP Growth: అంచనాలకు మించి.. భారత్ వృద్ధి!!

భారత్‌ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది.
Economic Forecast Comparison  Indias GDP Grows 7.8 percent in Q4, FY24 Growth pegged at 8.2 percent    FiscalYear2023 24

మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 

2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్‌బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్‌ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం.  ఎన్‌ఎస్‌ఓ మే 31వ తేదీ ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది.  

5 ట్రిలియన్‌ డాలర్ల దిశగా అడుగులు
భారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్‌ త్రైమాసికంలో 8.1 శాతం,  డిసెంబర్‌ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్‌ ఎకానమీ 3.5 ట్రిలియన్‌ డాలర్ల జోన్‌లో స్థిరపడగా, 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది.  

మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి 
ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్‌ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్‌ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్‌ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్‌లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్‌ వెయిటేజ్‌ 40.27 శాతం.  

Indian Stock Market: చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టాక్ మార్కెట్!

2024లో వృద్ధి 6.8%: మూడీస్‌ 
భారత్‌ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.

ద్రవ్యలోటు కట్టడి
ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం.  2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్‌ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తాజా గణాంకాలు వెల్లడించాయి.

8.2% వృద్ధి ఎలా.. 
2011–12ను బేస్‌ ఇయర్‌గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే.. ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 

7.8% పరుగు ఇలా.. 
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది.  

Global Burden of Disease: శుభవార్త.. పెరుగుతున్న‌ మనుషుల సగటు జీవితకాలం!!

మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది
ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్‌ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన  బ్యాంకింగ్‌ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్‌ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 1,105 బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్‌ చేసింది.  –  మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్‌

Published date : 03 Jun 2024 10:53AM

Photo Stories