Free breakfast For Students: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఉచిత అల్పాహార పథకం ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు విస్తరించడానికి తమిళనాడు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమన్వయకర్తలను నియమించేందుకు సన్నద్ధమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమిస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
చదవండి: డాలర్ కోటకు బీటలు... మరో 10 ఏళ్లలో డాలర్ కథ ముగియబోతోందా...
రాష్ట్రంలోని 30,122 ప్రాథమిక పాఠశాలలకు....
ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారనే వివరాలను ఇప్పటికే అధికారుల నుంచి విద్యాశాఖ తెప్పించుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ అల్పాహారం అందించే కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగస్వాములు కానున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని 30,122 ప్రాథమిక పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుందని, 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించింది.
చదవండి: ఒక పోస్టుకు 174 మంది పోటీ... ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు భారీగా అభ్యర్థులు
2022 సెప్టెంబర్ 14న ప్రారంభించిన సీఎం
2022 సెప్టెంబర్ 14న మధురైలోని అదిమూళం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహారం పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా రూ.33.56 కోట్ల వ్యయంతో 1,545 ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించిన ఈ పథకం మొదటి దశలో 1.14 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. మొదటి దశ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ పథకాన్ని విస్తరించాలని, ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు.