MBBS Education: ఎంబీబీఎస్ విద్యార్థికి పీజీ సీటు ఇప్పిస్తానన్నాడు.. కానీ..!
సాక్షి ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన వ్యక్తికి పీజీ సీటు ఇప్పిస్తానని ఘరానా మోసం చేసిన సంఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం గుంటూరుకు చెందిన అభిరామ్ యశస్వి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులు మండలంలోని గడ్డిపాడు సమీపంలో యశస్వి ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అభిరామ్‌కు వరుసకు బాబాయి అయిన అగస్య శ్రీనివాస్ రాజమండ్రిలో డాక్టరుగా పనిచేస్తున్నాడు.
➤ Intermediate Education: ఇంటర్ విద్య భవిష్యత్తుకు బాట..
డాక్టర్ అగస్య శ్రీనివాస్ కుమారుడు, కుమార్తెలకు వెల్దుర్తి మండలం శిరిగిరి పాడు గ్రామానికి చెందిన పోకల చంద్రశేఖర్ కర్ణాటక రాష్ట్రంలో పీజీ చదివేందుకు సీట్లు ఇప్పించాడని, చాలా నమ్మకమైన వ్యక్తి అని అభిరామ్‌కు పరిచయం చేశాడు. ఈ విధంగా పరిచయమైన పోకల చంద్రశేఖర్ యశస్వి ఆసుపత్రి వద్దకు వెళ్లి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న చాలా మెడికల్ కాలేజ్‌లకు ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, కౌన్సెలింగ్‌తో పనిలేకుండా సీటు ఇప్పిస్తానని పరిచయం చేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని మేల్‌మరువత్తూరు ఆదిపరాశక్తి ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. సీటు రూ.1.25 కోట్ల అవుతుందని, అడ్వాన్స్‌గా రూ.26,50,000 ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది మే 26వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకూ దశల వారీగా డబ్బులు తీసుకున్నాడు.
➤ Tenth Class: పదోతరగతి ఫీజులు స్వీకరణకు చివరితేది ఖరారు
డబ్బులు తీసుకుంటున్న ప్రతిసారీ మీ సీటు మీకు గ్యారంటీ అంటూ నమ్మబలికేవాడు. చివరిసారిగా పీజీలో చేరేందుకు చైన్నె వెళ్లిన డాక్టర్ కుటుంబం ఉన్న రూము వద్దకు వెళ్లి పీజీ సీటు అడ్వాన్స్ రూ.26,50,000 సంబంధించిన బ్యాలెన్స్ రూ.6,50,000 తీసుకుని 27వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చి కళాశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఉదయం ఫోన్ చేయగా పోకల చంద్రశేఖర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కళాశాలలోకి వెళ్లి విచారించగా కౌన్సెలింగ్ అయిపోయిందని, క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని సమాధానం చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన డాక్టర్ పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.