Collector Ravi Pattanshetty: విద్యాప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి
అనకాపల్లిటౌన్ : కళాశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ప్రిన్సిపాళ్లను జిల్లా కలెక్టర్ రవిపట్టాన్‌శెట్టి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈవోతో పాటు జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపైన పట్టు సాధించేలా బోధన ఉండాలన్నారు. తెలివైన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, విద్యాప్రమాణాలు తగ్గడానికి గల కారణాలను విశ్లేషించి, తదనుగుణంగా బోధన అంశాలను రూపొందించాలని అన్నారు. అన్ని గ్రూపులవారికి వార్షిక ప్రణాళిక తయారు చేసి మెరిట్ విద్యార్థులను ముందుగా గుర్తించాలని ఆదేశించారు. లెక్చరర్ల బోధనలతోపాటు డిజిటల్ బోధనలు కూడా అలవర్చాలన్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పాఠ్యాంశాలను తయారు చేసి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి సుజాత, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
చదవండి: Sri Prakash Educational Institutions: నేడు, రేపు విద్యార్థులకు పాటల పోటీలు
ఆడుదాం... ఆంధ్రా...
ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవిపట్టాన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2వతేదీ నుంచి 8వతేదీ వరకు నిర్వహించే వివిధ ఆటలపోటీల్లో ఎక్కువ సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొనేటట్లు చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జరిగే ఈ పోటీల్లో 5 అంశాలుంటాయని చెప్పారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలు, యోగా, టెన్నికాయిట్ మారథాన్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ ఆటలను కూడా చేర్చవచ్చని చెప్పారు. ఈ పోటీలకు అవసరమైన ఆట స్థలాలు, సామాగ్రి రిఫ్రెష్మెంట్స్ మొదలైన వాటికి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ చీఫ్ కోచ్ ఎల్.వి.రమణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.