Skip to main content

NMC: ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌తోనే ఈ సీట్ల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కా లేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్‌ పెట్టే దిశగా జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
NMC, Online Counseling Only
ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌తోనే ఈ సీట్ల భర్తీ

అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్‌) కౌన్సెలింగ్‌ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.  

ప్రతిభకు న్యాయం 

2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్‌ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్‌ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్‌ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.  

చదవండి: violent patients: ఇక‌పై రోగులు విసిగించినా, దురుసుగా ప్ర‌వ‌ర్తించినా వైద్యం బంద్‌... కొత్త నిబంధ‌న‌లు తెలుసుకున్నారా..?

బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! 

గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్‌ అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి.

ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్‌ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా ప్రైవేట్‌ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్‌ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు.

చదవండి: TELANGANA MBBS FEES: తెలంగాణ‌లో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...

రూ.60 వేలున్న కన్వీనర్‌ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు.  

ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం 

గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది.

గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్‌ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్‌ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్‌ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.  

Published date : 16 Aug 2023 11:38AM

Photo Stories