APSSDC: ఉద్యోగమే లక్ష్యంగా.. స్కిల్ హబ్‌లు
చాలామంది పదో తరగతి, ఇంటర్మీడియెట్ వంటి కోర్సులకే పరిమితమవుతుంటారు. ఉద్యోగం చేయాలనే తపన ఉన్నా సరైన నైపుణ్యాలు లేక కొలువుల వేటలో వెనుకబడి పోతుంటారు. ఇలాంటి వారికి సుశిక్షితమైన ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్‌లు నిర్వహిస్తోంది.
మన జిల్లాలో ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో 2022 అక్టోబర్‌లో స్కిల్ హబ్ పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియోట్ ఉత్తీర్ణత ఆధారంగా శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
చదవండి: Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో..
ప్రస్తుతం స్కిల్ హబ్‌లో ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత గల విద్యార్థులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ ఇస్తున్నారు. కోర్సు కాల వ్యవధి మూడున్నర నెలలు. 26 మంది అభ్యర్థులు ఇప్పటికే 20 రోజుల శిక్షణ పుర్తి చేసుకున్నారు. ఉపాధి లక్ష్యంగా డిగ్రీ పూర్తిచేసిన యువత సైతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
కంప్యూటర్ వినియోగం, ఎంఎస్ ఆఫీస్, ఇంగ్లీష్, తెలుగు టైపింగ్‌లపై మెలకువలు నేర్పిస్తున్నారు. మూడు నుంచి మూడున్నర నెలల వ్యవధిలో డొమెస్టిక్ డోటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్స్ వంటి అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు.
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి విశాఖపట్నం, విజయవాడ, కడప తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రూ. 10 వేలు నుంచి రూ. 15 వేలు వరకు ప్రారంభ జీతం ఇస్తున్నారు. నైపుణ్యం, సీనియారిటీ ఆధారంగా భవిష్యత్తులో జీతాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉపాధి కల్పిస్తున్నాం..
ఉద్యోగాలు, ఉపాధి లక్ష్యంగా స్కిల్ హబ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన యువత లక్ష్యంగా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వంటి స్వల్ప కాలిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
– బి.స్వప్నదేవి, ఎచ్చెర్ల ఐటీఐ స్కిల్ హబ్ కో ఆర్డినేటర్
ఉద్యోగం కోసం..
మాది వ్యవసాయ కుటుంబం. బీఎస్సీ డిగ్రీ పూర్తిచేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు చాలా మంది కంప్యూటర్ నాలెడ్స్ ఉందా అని ప్రశ్నించారు. అందుకే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరాను. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది.
– జె.కళావతి, నాగంపాలేం, లావేరు మండలం
నైపుణ్యాలు పెంచుకునేందుకు..
బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. పరిశ్రమలు, విద్యా సంస్థల్లో స్కిల్స్ ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందవచ్చు. ప్రధానంగా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే స్కిల్ హబ్‌లో చేరాను.
– ఎన్.దేవి, నారువ, రణస్థలం మండలం