Education News: పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం.. మొదలైన వంద రోజుల ప్రణాళిక.. ఎక్కడంటే..
ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి 27వ తేదీ వరకూ టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఇందుకు తగిన ప్రణాళికతో పని చేస్తూ టాప్–10లో నిలవాలనే లక్ష్యంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విద్యా శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.
గడచిన నాలుగున్నరేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యారంగంలో మెరుగైన సంస్కరణలు చేపట్టింది. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేకుండా మెరుగైన విద్య సాధించడం అసాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మారు. దీంతో ‘మన బడి.. నాడు–నేడు’ పథకం కింద మూడు విడతల్లో కోట్లాది రూపాయలతో పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలూ కల్పించారు. కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. ఉత్తీర్ణతకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా పక్కా ప్రణాళికను అనుసరిస్తోంది.
Education News: విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం ముఖ్యం
ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కచ్చితంగా టాప్–10లో నిలవాలనే సంకల్పంతో కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో విద్యా శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి విద్యార్థీ ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీనిని అన్ని పాఠశాలల్లోనూ శుక్రవారం నుంచి మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తొలి దశగా శిక్షణ కూడా ఇచ్చారు. ఏయే అంశాలపై విద్యార్థులకు ఎలా తర్ఫీదు ఇవ్వాలనే అంశంపై మెళకువలు చెప్పారు.
నాలుగు కేటగిరీలుగా..
● చదివే సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులను ఎ, బి, సి, డి కేటగిరీలుగా విభజించనున్నారు.
● ఒక పాఠశాలలోని విద్యార్థులను ఉపాధ్యాయులకు సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు 30 మంది విద్యార్థులు, తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉంటే ఒక్కో ఉపాధ్యాయుడికి మూడు కేటగిరీల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను దత్తత ఇస్తారు.
● ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు రోజువారీ సాధారణంగా బోధించే పాఠాలతో పాటు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థుల్లో అభ్యసనలో వెనుకబడిన వారికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తారు.
Mega DSc Notification : త్వరలోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేలా..
● నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ప్రతి రోజూ పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.20 గంటల వరకూ ఆరు పీరియడ్లు బోధిస్తారు.
● సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రగతిపై వారి తల్లిదండ్రులతో దత్తత తీసుకున్న ఉపాధ్యాయులు వారాంతంలో మాట్లాడతారు.
● బోధనతో పాటు ప్రతి రోజూ ఒక సబ్జెక్టుపై ఎ, బి గ్రేడులు, సి, డి గ్రేడులకు విడివిడిగా లఘు పరీక్షలు నిర్వహిస్తారు.
● విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని గ్రేడ్‌ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 17 నాటికి ఒక కొలిక్కి తీసుకురానున్నారు.
● ఉత్తీర్ణత 35 శాతం కంటే కొద్దిగా అంటే రెండు మూడు మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు.
● 11 వారాలు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ రోజువారీగా ఎ, బి గ్రేడ్‌ల వారికి 25 మార్కులు, సి, డి గ్రేడ్‌ల వారికి 20 మార్కులతో వార్షిక పరీక్షల తరహా ప్రశ్నలతో పరీక్షలు నిర్వహిస్తారు.
● విద్యార్థుల నైపుణ్యానికి సాన పట్టి, వారిని మెరికల్లా తయారు చేసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 70 మంది ఉపాధ్యాయుల సేవలను వినియోగిస్తున్నారు.
Andhra Pradesh: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం
జిల్లాల వారీగా పదో తరగతి విద్యార్థులు
జిల్లా బాలురు బాలికలు మొత్తం
కాకినాడ 14,350 14,548 28,898
కోనసీమ 9,607 9,387 18,994
తూర్పు గోదావరి 15,412 13,885 29,297
గత విద్యా సంవత్సరం టెన్త్‌లో జిల్లాల స్థానాలు
కోనసీమ : 11
కాకినాడ : 19
తూర్పు గోదావరి : 17
ఈ విద్యా సంవత్సరం ఈ మూడు జిల్లాలనూ టాప్–10లో నిలబెట్టాలన్నది లక్ష్యం.
టాప్–10లో నిలబెట్టడమే లక్ష్యం
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టాప్–10లో ఉండాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ఫలితాలతో పాటు ప్రతి ఒక్కరూ 500 పైబడి మార్కులు సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ఎక్కడికక్కడ జిల్లా విద్యా శాఖ ‘సెల్ఫ్’ అనే ప్రోగ్రాం రూపొందించింది. దానిని అమలు చేస్తూ విద్యార్థి ప్రగతిని ప్రతి 15 రోజులకు నివేదిస్తారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ నెల 13తో ముగిసిన సమ్మేటివ్ అసెస్మెంట్–1 (ఎస్‌ఏ–1) పరీక్షలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. – నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ
మంచి మార్కులకు అవకాశం
కార్పొరేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రణాళికలు అమలు చేసి, మార్కులు సాధించేలా ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ తరగతులను సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తాం.
– మేకల అమృతస్వామి, శ్రీనగర్ ఉన్నత పాఠశాల, పదో తరగతి, కాకినాడ
చాలా సంతోషం
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించి, వంద రోజుల ప్రణాళిక అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనివలన ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణులవడంతో పాటు అత్యధిక మార్కులు సాధించేందుకు అవకాశాలు కలుగుతాయి. విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా తెలియజేయడం అభినందనీయం. దీనివలన మా పిల్లల చదువుపై మరింతగా శ్రద్ధ చూపడానికి మాకు ఆస్కారం ఉంటుంది. – అంజూరి వెంకట పద్మావతి, విద్యార్థి తల్లి, కాకినాడ
Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..