Skip to main content

Andhra Pradesh: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్‌ల పంపిణీకి సర్వం సిద్ధమైంది.
Prepare tabs for ap government school children  Tablet distribution ceremony for 8th graders in Amaravati

వీటిని డిసెంబ‌ర్ 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్‌లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్‌ కంటెంట్‌తో పంపిణీ చేసింది.

ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్‌ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్‌ పాయింట్‌కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్‌ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు.

రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్‌ టీవీలు డిసెంబ‌ర్ 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి.   

చదవండి: Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..

మరింత మెరుగ్గా.. 

గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్‌లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్‌లోడ్‌ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్‌ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్‌ పాఠాలను సైతం అప్‌లోడ్‌ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి.

వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్‌ ఈ–కంటెంట్‌ను సైతం అప్‌లోడ్‌ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో పనిచేసే డౌట్‌ క్లియరెన్స్‌ యాప్‌ ‘ఈ–ట్యూటర్‌’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ పాఠాలను సైతం అప్‌లోడ్‌ చేసేంత స్పేస్‌ కూడా ఈ ట్యాబ్‌ల్లో ఉంది.   

30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్‌ టీవీలు.. 

గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్‌ టీవీ చొప్పున 10,038 స్మార్ట్‌ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్‌ టీవీలను డిసెంబ‌ర్ 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు.   

అన్ని ట్యాబ్‌ల్లో ‘డ్యులింగో’ యాప్‌  

పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చ­ర్చించారు.

ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్‌ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేశారు. గత డిసెంబర్‌లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్‌లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్‌ల్లోనూ ఈ డ్యులింగ్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. 

ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. 

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్‌లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్‌­ల సామర్థ్యం పెంచాం. 

అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్‌తోపాటు డౌట్‌ క్లియరెన్స్‌ యాప్‌ను, ఈ–డిక్షనరీని కూడా అప్‌లోడ్‌ చేశాం. కొత్త ట్యాబ్‌ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్‌ పాఠాలను సైతం అప్‌లోడ్‌ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తాం.  
– కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన  

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:12PM

Photo Stories