Welfare Hostels: సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.
ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు.
చదవండి: Zilla Parishad High School: ఎంతటి దుర్భర పరిస్థితి.. 118 మంది ఒకటే బాత్రూం
నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది.
చదవండి: Quality Food: విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.
ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.
– కోట ఆనంద్, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు