Quality Food: విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నవంబర్ 28న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తరచూ తనిఖీలు చేయండి
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు.
చదవండి: Collector Narayana Reddy: ఇక ఫుడ్ సేఫ్టీ కమిటీలు!
పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు
విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.