Skip to main content

Save OU: ఉద్దేశ పూర్వకంగానే యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉద్దేశపూర్వకంగానే పాలకులు రాష్ట్రంలోని యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు.
Universities are being weakened on purpose
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరామ్, ఆకునూరి మురళి తదితరులు

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో 3179   ప్రొఫెసర్‌ పోస్టులు ఉండాల్సి ఉండగా కేవలం 818 మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. జూన్‌ 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవ్‌ ఉస్మానియా యూనివర్సిటీ లెగసీ(సోల్‌), సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరం, విద్యా పరిరక్షణ వేధికల సంయుక్త ఆధ్వర్యంలో సేవ్‌ ఉస్మానియా యూనివర్సిటీ అంశంపై సమావేశం జరిగింది. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్, ప్రొఫెసర్‌ హరగోపాల్, ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీకి రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. యూనివర్సిటీలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ పాలక మండలి విఫలమైందన్నారు. నిజాం కళాశాలలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ కోర్సులను రద్దు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు ప్రతి 15 రోజులకోసారి ఢిల్లీ, ముంబై వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. మన ఐఏఎస్‌లు రాష్ట్రాభివృద్ధికి కాకుండా వ్యాపార దృష్టితో పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉంటేనే రీసర్చ్‌ గ్రాంట్‌లు మంజూరవుతాయన్నారు.

చదవండి: NIRF Top 10 Rankings 2023 : దేశంలో టాప్‌-10 విద్యాసంస్థలు ఇవే.. ఈ సారి కూడా..

ప్రపంచమంతా ఐటీ వైపు అడుగులు వేస్తుండగా మన యూనివర్సిటీల్లో బల్లలు, చాక్‌పీసులు కూడా లేవన్నారు. యూనివర్సిటీలు పతనం కావడం అంటే సామాజిక మార్పుకు గొడ్డలి పెట్టు అన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థులు వీసీని కలిసే స్థితిలో లేరన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులను రూ.20 వేలకు పెంచడం దారుణమన్నారు. ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వీసీలు నియంతలుగా వ్యవహరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. యూనివర్సిటీ స్కాలర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వీసీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. వర్సిటీలో ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే పోలీసులతో తరిమికొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్లకు బడ్జెట్‌ పెంచాలని పోరాటం చేస్తుండగా వీసీ అణచివేత థోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఫీజుల పెంపుపై ప్రశ్నిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తామని కల్లబొల్లిమాటలు చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మహ్మద్‌ అన్సారీ, స్కాలర్‌ కోట శ్రీనివాస్, క్రాంతిరాజు, ఖలీదాపర్వీన్, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: Deemed Universities: ఈ నిబంధ‌న‌లు ఉంటేనే ఇక‌పై డీమ్డ్‌ యూనివర్సిటీ... వెబ్‌సైట్‌లో ఈ వివ‌రాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి

Published date : 16 Jun 2023 03:35PM

Photo Stories