Department of Education: టీచర్ల బదిలీ, పదోన్నతుల సందడి
ఈ ఏడాది జనవరి 25 నుంచి జరగాల్సిన బదిలీల, పదోన్నతుల ప్రక్రియకు కోర్టు స్టేతో బ్రేక్‌పడింది. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీల షెడ్యూల్ విడుదలైంది. దీంతో జిల్లా విద్యాశాఖలో బదిలీలు,పదోన్నతుల సందడి మొదలైంది. సెప్టెంబర్ 3న నుంచి అక్టోబరు 3 వరకు ప్రక్రియ ముగించేలా షెడ్యూలును రూపొందించారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే
సెప్టెంబర్ ఒకటో తేదీకి సర్వీసును కటాఫ్‌గా నిర్ణయిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. డీఈవో జనార్దన్‌రావు సమక్షంలో కార్యాలయ సిబ్బంది, సీనియర్ ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల కసరత్తు ప్రారంభించారు. బదిలీలతో పాటు అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు దక్కనున్నాయి.
జిల్లాలో ఇలా..
- ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు గత జనవరిలో షెడ్యూల్ జారీ చేసి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌లో 1,021 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్1వ తేదీ నాటికి సర్వీసును కటాఫ్‌గా తీసుకుంటుండడంతో తప్పనిసరి బదిలీలు అయ్యే వారి సంఖ్య మరింత పెరగనుంది.
- రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు కూడా బదిలీకి అర్హులు కావడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. స్పౌజ్ కేటగిరీ కింద భార్యభర్తల బదిలీలకు ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తుండడంతో 150మంది వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
- ఉపాధ్యాయ సంఘ నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు తుది తీర్పునకు లోబడి బదిలీలు, పదోన్నతులకు ఆమోదం తెలుపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
- ఆరు నెలల సమయం గడిచిపోవడంతో సెప్టెంబరు ఒకటో తేదీకి సర్వీసును కటాప్‌గా నిర్ణయించడంతో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు ఒకేచోట ఎనిమిదేళ్లు, ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
- జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలల్లో 3,173 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 2,786 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 2015 ఆనంతరం ప్రభుత్వం పదోన్నతులకు అవకాశం ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ఆశలు పెట్టుకున్నారు.
- జిల్లాలో అన్ని విభాగాల పోస్టులు 387ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వాటిల్లో 70 శాతం మాత్రమే పదోన్నతులతో భర్తీ చేయనున్నారు.
- ఈ ఏడాది జనవరిలో 274మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈసారి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు కూడా అవకాశం ఇస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తరువాత పాఠశాలల్లో ఖాళీలు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా డీఎస్సీ నిర్వహించి ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతాం. మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది. అర్హులైన వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది.
– జనార్దన్‌రావు, డీఈవో
జిల్లా వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు: 651
ఉపాధ్యాయ పోస్టులు(మంజూరు): 3,173
విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు: 2,786
ఖాళీలు: 387