TG Teacher Transfers: నచ్చిన చోటుకు బదిలీ.. పాయింట్లు దుర్వినియోగం చేస్తున్న ఉపాధ్యాయులు.. చర్యలేవి?
నచ్చిన చోటుకు బదిలీ కోసం..
బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయ దంపతులు ఒకే దగ్గర పని చేసేందుకు వారికి ప్రత్యేకంగా 10 పాయింట్లు కేటాయించారు. వాటిని వినియోగించుకొని, స్పౌజ్ టీచర్లంతా ఒకేచోట పనిచేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, దానికి తూట్లు పొడుస్తూ చాలామంది ఉపాధ్యాయులు వారి భార్య/భర్త వద్దకు కాకుండా తమకు నచ్చిన చోటుకు బదిలీ కోసం ఈ పాయింట్లను వాడుతున్నారు.
చదవండి: DEO Wife: మూడేళ్లుగా స్కూల్‌కు వెళ్లని డీఈఓ భార్య?
ఈ విషయాన్ని గతంలో ‘సార్లూ.. ఇది తగునా?’ శీర్షికన పలువురు జీహెచ్‌ఎంలు నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న దరఖాస్తుల తీరును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కరీంనగర్ డీఈవో ఏడుగురు ఉపాధ్యాయులపై వేటు వేశారు. కానీ, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల డీఈవోలు ఈ విషయంలో అలసత్వం వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై నాన్ స్పౌజ్ టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దుర్వినియోగం ఎందుకు?
- కేవలం జిల్లా కేంద్రాల్లో నివసించాలని, తమ పిల్లలకు మంచి విద్య, వైద్యం అందాలన్న ఆలోచనలతో చాలామంది స్పౌజ్ టీచర్లు భార్య/భర్తకు దూరంగా ఉన్న పాఠశాలను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.
- స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగానికి అధిక హెచ్‌ఆర్‌ఏ మరో కారణమని నాన్‌స్పౌజ్ టీచర్లు ఆ రోపిస్తున్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వచ్చే హెచ్‌ఆర్‌ఏ విషయంలో వ్యత్యాసాల కారణంగా స్పౌజ్ టీచర్లంతా తప్పుదారి పడుతున్నారని మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలంలోని పాఠశాలను ఎంపిక చేసుకోవాల్సిన ఉపాధ్యాయుడు నిబంధనలకు విరుద్ధంగా జగిత్యాలలోని హెచ్‌ఆర్‌ఏ స్థానానికి బదిలీ అయ్యారు.
- ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందిగా భావిస్తున్నారు. వివిధ కారణాలతో పని ఎగ్గొట్టేందుకు ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ఎంచుకోకుండా మరో చోటుకు వెళ్తున్నారు.
- ఒకే పాఠశాలలో పనిచేయాలంటే స్పౌజ్‌లు ఇబ్బంది పడుతున్నారు. తమ భర్త/భార్య ఆదేశాలు పాటించడం ఇష్టం లేనివారు అవే పాయింట్లు వినియోగించుకొని, స్పౌజ్‌కు దూరంగా వెళ్తున్నారు. ఇదే కారణంతో సిరిసిల్ల జిల్లాలో వెంకంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సిన టీచర్ రగుడు పాఠశాలకు బదిలీ కోరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
నష్టమంటున్న నాన్ స్పౌజ్ టీచర్లు
స్పౌజ్‌పాయింట్లను ఉపయోగించుకొని, భార్య/ భర్త దగ్గరికి వెళ్లకుండా వారి వెసులుబాటు మేరకు పాఠశాలలు ఎంపిక చేసుకోవడం వల్ల తమకు నష్టం జరుగుతుందని నాన్‌స్పౌజ్ టీచర్లు అంటున్నారు. ఒక జిల్లాలో చర్యలు చేపట్టి, మిగతా జిల్లా ల్లో తాత్సారం చేయడం ఏంటని గుర్రుగా ఉన్నారు.
ఆయా జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
కరీంనగర్: ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి, పలు ఒత్తిళ్ల కారణంగా తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇంకా కొంతమంది టీచర్లపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
పెద్దపల్లి: విద్యాశాఖ అధికారి నలుగురు ఉపాధ్యాయులకు సంబంధించి ఫైల్‌ను కలెక్టర్‌కు పంపించారు. చర్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని టీచర్లు మండిపడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల: స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగంపై ప్రధానోపాధ్యాయులతో కమిటీ వేసి, పలువురు ఉపాధ్యాయులను గుర్తించారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
జగిత్యాల: 11 మంది టీచర్లను గుర్తించి, మెమోలు ఇచ్చారు. కానీ, చర్యలు శూన్యం.