Skip to main content

Medical Education: పీజీ వైద్య సీట్ల పంట.. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా ఇన్ని పీజీ సీట్లు

సాక్షి, అమరావతి: ఇటు ఎంబీబీఎస్‌ సీట్లు.. అటు పీజీ సీట్లు! ఒకేసారి కొత్తగా 750 ఎంబీబీఎస్‌ సీట్లతోపాటు అదనంగా 510 పీజీ వైద్య సీట్లతో రాష్ట్ర వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది.
Medical Education
పీజీ వైద్య సీట్ల పంట.. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా ఇన్ని పీజీ సీట్లు

వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్‌ గేమ్‌ ఛేంజర్‌గా అవతరిస్తోంది. ఒక్క ఏడాదిలోనే వీటిని సాధించడం ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర వైద్య విద్యా రంగం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పీజీ సీట్లు పెరుగుతున్నాయి. వైద్య విద్యను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసు­కున్న చర్యలతో గత నాలుగేళ్లలో ఏకంగా 702 పీజీ సీట్లు కొత్తగా సమకూరడం గమనార్హం. అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూనే అప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో వసతులను మెరుగు పరిచారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో వైద్యులు, సిబ్బందిని సమకూర్చడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. ఫలితంగా 1956 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వైద్య సీట్లు పెరిగాయి. 

చదవండి: District Medical and Health Officer: ఆన్‌లైన్‌లో వైద్యాధికారుల ప్రొవిజనల్, రిజెక్టెడ్‌ జాబితా

పీజీ సీట్లు ఇంకా పెరిగే చాన్స్‌

రాష్ట్రంలో పది వైద్య కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం వరకూ 966 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఏసీఎస్‌ఆర్‌ కళాశాలలో ఒక్క పీజీ సీటు కూడా లేదు. అలాంటిది నాలుగేళ్లలో వరుసగా 2020లో 24 సీట్లు, 2021లో 31 సీట్లు, 2022లో 137 సీట్లు చొప్పున రాష్ట్రానికి అదనంగా పీజీ సీట్లు సమకూరాయి. 2023లో 737 సీట్లు పెంచాలని ఎన్‌ఎంసీకి ప్రతిపాదించగా ఇప్పటి వరకు 510 సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన సీట్ల పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల ప్రవేశాలకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా మరికొన్ని సీట్లు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగేళ్లలోనే ఏకంగా 702 సీట్లు పెరగడంతో ఇప్పటికే 1,668 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 42.08 శాతం సీట్లు పెరిగాయి. ఏసీఎస్‌ఆర్‌ కళాశాల కూడా పీజీ సీట్లలో బోణీ కొట్టింది. ప్రస్తుతం ఆ కళాశాలలోనూ 24 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా సమకూరాయి. 

చదవండి: YS Jagan Mohan Reddy: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఒకేసారి ఇన్ని ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుదల

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ

వైద్యులు, స్పెషలిస్ట్‌ వైద్యుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. పీజీ సీట్లు పెరగడంతో స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు సత్వరమే, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. 
– ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 

సీట్ల పెంపుతో పలు లాభాలు
వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడం వల్ల చాలా లాభాలుంటాయి. రీసెర్చ్‌ కార్యకలాపాలు, రోగులకు వైద్యుల అందుబాటు పెరుగుతుంది. మన ఆస్పత్రుల్లో నిత్యం వేల సంఖ్యలో ఓపీలు, ఐపీలు నమోదవుతుంటాయి. వీటిద్వారా రీసెర్చ్‌ కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వం సైతం రీసెర్చ్‌ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు. పీజీ సీట్లు పెరగడంవల్ల చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. 
– కంచర్ల సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ

పీజీ సీట్లు పెరుగుదల ఇలా..

కళాశాల

2019

2023

జీఎంసీ శ్రీకాకుళం

23

64

ఆంధ్ర వైద్యకళాశాల, వైజాగ్‌

235

340

ఆర్‌ఎంసీ, కాకినాడ

136

207

ఎస్‌ఎంసీ విజయవాడ

89

161

జీఎంసీ గుంటూరు

110

188

జీఎంసీ ఒంగోలు

12

79

ఏసీఎస్‌ఆర్‌ జీఎంసీ, నెల్లూరు

0

24

ఎస్‌వీఎంసీ, తిరుపతి

127

227

జీఎంసీ, కడప

34

108

కేఎంసీ, కర్నూలు

143

183

జీఎంసీ, అనంతపురం

57

87

మొత్తం

966

1,668

భారీగా పోస్టుల భర్తీ

ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య సీట్లు పెరగాలంటే ఆయా విభాగాల్లో తగినంత మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది విధిగా ఉండాలి. స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 2 పీజీ సీట్ల చొప్పున ఎన్‌ఎంసీ మంజూరు చేస్తుంది. వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం వచ్చాక డీఎంఈలో 106 ప్రొఫెసర్, 312 అసోసియేట్‌ ప్రొఫెసర్, 832 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కొత్తగా సృష్టించారు. వీటితో కలిపి 1,585 పోస్టుల­ను ఇప్పటివరకూ భర్తీ చేశారు. పదోన్నతుల ద్వారా 500 వరకూ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ అయ్యాయి.

Published date : 07 Jun 2023 04:59PM

Photo Stories