Skip to main content

NMC: వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్‌.. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఇన్ని కళాశాలలు

సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్‌: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ), మెడికల్‌ అసెస్‌మెంట్‌ మరియు రేటింగ్‌ బోర్డు అనుమతులిచ్చింది.
NMC
వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్‌.. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఇన్ని కళాశాలలు

ఈ మేరకు మే 4న వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విజయకుమారికి ఎన్‌ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్‌క్లియర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది.

చదవండి: NMC: అనురాగ్‌ ప్రైవేట్‌ వర్సిటీకి మెడికల్‌ కాలేజీ

ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్‌కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు.

చదవండి: అప్లికేషన్ల వెల్లువ.. ఏ రాష్ట్రం నుంచి ఎన్ని దరఖాస్తులు?

రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు..

రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరో­వైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరనున్నాయి.

చదవండి: ఏలూరు మెడికల్‌ కాలేజీకి 150 సీట్లు

ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు

ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటు­చేస్తున్న సీఎం జగన్‌కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి మే 22న సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
 

Published date : 05 May 2023 03:24PM

Photo Stories