Skip to main content

Medical Students: సర్దుబాటు అసాధ్యం

మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు రద్దు అయిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడం అసాధ్యమని జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Medical Students
మెడికల్ విద్యార్థుల సర్దుబాటు అసాధ్యం

ఈ మేరకు ఎన్‌ఎంసీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ లేఖ రాసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. నిబంధనల మేరకు వసతులు లేవంటూ రాష్ట్రంలో మూడు ప్రైవేట్‌ కాలేజీల్లో 450 ఎంబీబీఎస్, 70 వరకు పీజీ మెడికల్‌ విద్యార్థుల అడ్మిషన్లను ఎన్‌ఎంసీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆ మేరకు సీట్లు కోల్పోయిన విద్యార్థులను ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. పైగా ఆయా కాలేజీల్లో ఉన్న సీట్ల సంఖ్యకు మించకుండా సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే 450 ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు అంటే మూడు మెడికల్‌ కాలేజీ సీట్లకు సమానమని, అంతమంది విద్యార్థులను ఎలా సర్దుబాటు చేయగలమని కాళోజీ వర్సిటీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ మెడికల్‌ కాలేజీలోనూ కొద్ది మొత్తంలో కూడా ఎంబీబీఎస్, పీజీ సీట్లు ఖాళీగా లేవని ఆయా యాజమాన్యాలు చెబుతున్నందున నిబంధనల మేరకు సర్దుబాటు చేయడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తేల్చిచెబుతున్నాయి.

చదవండి: 

Medical Colleges: 5 వైద్య కళాశాలలు రెడీ

Medical Fee: ఆ ఫీజులను సర్కారుకు ఇవ్వాల్సిందే!

నీట్ పీజీలో కోనసీమ జిల్లా యువతికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్

అదనపు సీట్లు సృష్టించండమే మార్గం...

ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలన్న ఎన్‌ఎంసీ ఆదేశాలను పాటించి తమకు న్యాయం చేయాలని సదరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసే పరిస్థితి లేనందున రద్దయిన సీట్లకు సమానంగా అదనపు (సూపర్‌ న్యూమరరీ) ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్లు సృష్టించాలని ప్రభుత్వం ఆ లేఖలో కోరింది. అదనపు సీట్లు సృష్టించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్‌ఎంసీనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఏ కాలేజీల్లో ఎంత శాతం అదనపు సీట్లు సృష్టించాలో కూడా స్పష్టం చేయాలని ఎన్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అదనపు సీట్లు సృష్టించడం కూడా అంత సులువైన వ్యవహారం కాదని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే, ఇతర కాలేజీల్లో అన్ని సీట్లు సృష్టించాలంటే ఆ మేరకు అధ్యాపకులు, మౌలిక వసతులు ఉండాలి. వసతులు లేనప్పుడు అదనపు సీట్లను సృష్టించడం కూడా సాధ్యం కాదంటున్నారు. చివరకు అడ్మిషన్లు రద్దు చేసిన కాలేజీల్లోనే ఎలాగోలా కొనసాగిం చేలా ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంటుందని విశ్వవిద్యాలయం వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ మూడు కాలేజీల్లో కొనసాగడానికి విద్యార్థులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వసతులు లేని చోట కొనసాగిస్తే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, హాస్టల్‌ వసతి వంటివేవీ లేని కాలేజీల్లో చదవబోమని, ఇతర కాలేజీల్లోనే సర్దుబాటు చేయాలని స్పష్టం చేస్తున్నారు. 

Published date : 07 Jun 2022 03:18PM

Photo Stories