Skip to main content

నీట్ పీజీలో కోనసీమ జిల్లా యువతికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.
Yalla Harshita
యాళ్ల హర్షిత

తాజాగా విడుదల చేసిన పీజీ నీట్‌ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్‌ సాధించి విశాఖపట్నంలో ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్‌ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్‌ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)– చండీగఢ్‌ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్‌ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్‌ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు.

చదవండి: 

JEE and NEET: ఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

NEET-UG 2022: మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ రద్దు

Published date : 03 Jun 2022 01:13PM

Photo Stories